వాళ్లను ఓడించి తీరుతాం
ABN , Publish Date - Oct 11 , 2026 | 04:56 AM
రాజ్యాంగం మీద దాడి చేస్తున్న వ్యక్తులు, రాజ్యం ఓడిపోకతప్పని పరిస్థితులను సృష్టిస్తాయని.. విద్యార్థులు, యువత ఉద్యమాన్ని కొనసాగించాలని ప్రతిపక్షనేత రాహుల్‌గాంధీ పిలుపునిచ్చారు.
మోదీ, షా, భాగవత్, జ్ఞానేశ్, దోవల్.. వీరందరి సహజ స్వభావం పిరికితనం
మోదీ 50 వేల మంది పోలీసులను
పిలిపించినా వెనక్కి తగ్గం: రాహుల్
రాహుల్ గాంధీ శనివారం తమిళనాడు సీఎం విజయ్‌తో చెన్నైలో భేటీ అయ్యారు. విజయ్ ఇంట్లోనే మధ్యాహ్నం భోజనం చేశారు. అనంతరం ఇద్దరి మధ్య అరగంటపాటు జాతీయ రాజకీయాలపై చర్చ జరిగినట్లు సమాచారం. తర్వాత విజయ్ కారులోనే రాహుల్ స్థానిక పాలవాక్కంలో ఉన్న ‘బాస్క్ బై కాఫీ’ కెఫేకు వెళ్లి కాఫీ తాగారు. ఆ కెఫే మాజీ క్రికెటర్ ఎంఎస్ ధోనీకి చెందినదని తెలిసింది.
న్యూఢిల్లీ, చెన్నై, బెంగళూరు అక్టోబరు 10(ఆంధ్రజ్యోతి): రాజ్యాంగం మీద దాడి చేస్తున్న వ్యక్తులు, రాజ్యం ఓడిపోకతప్పని పరిస్థితులను సృష్టిస్తాయని.. విద్యార్థులు, యువత ఉద్యమాన్ని కొనసాగించాలని ప్రతిపక్షనేత రాహుల్‌గాంధీ పిలుపునిచ్చారు. ఆర్ఎస్ఎస్ తో, మోదీతో గత పదేళ్లుగా పోరాడుతున్న తనకు వారి గురించి పూర్తి అవగాహన ఉందని పేర్కొంటూ.. మోదీ, అమిత్‌షా, మోహన్ భాగవత్, జ్ఞానేశ్‌కుమార్, అజిత్ దోవల్.. వీరందరి సహజ స్వభావం పిరికితనమని చెప్పారు. విలన్లుగా మారిన వీరందరూ తమ చుట్టూ ఉన్న ప్రదేశం రోజురోజుకీ కుంచించుకుపోతున్న విషయాన్ని గుర్తిస్తున్నారని, ఆ పని తామే(ప్రతిపక్షాలు) చేస్తున్నామని తెలిపారు. ‘మోదీ! మీకు నచ్చినట్లు చేసుకోండి. 10వేలు, 20వేలు, 50వేల మంది పోలీసులను పిలిపించండి. నాయకులందరినీ అరెస్టు చేయించండి. యువతనందరినీ అరెస్టు చేయించండి. మేం మిమ్మల్ని చుట్టుముడుతున్నాం. వెనక్కి తగ్గేదే లేదు. గత 10-15 ఏళ్లలో దేశానికి జరిగింది మళ్లీ ఎన్నడూ, ఎప్పటికీ జరగకుండా చర్యలు తీసుకుంటాం’ అని హెచ్చరించారు. భారతదేశ యువతను చూసి తాను గర్విస్తున్నానని, వారి వెంట తామంతా ఉంటామని చెప్పారు. ఈ మేరకు శనివారం రాహుల్ ఒక వీడియో సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అంతకుముందు ఎక్స్‌లో ఒక పోస్ట్‌లో.. ‘జ్ఞానేశ్‌కుమార్, ఈ ప్రభుత్వం వెళ్లిపోక తప్పదు. ఆ తర్వాతే ప్రజాస్వామ్యానికి మరమ్మతు పనులు మొదలవుతాయి’ అని పేర్కొన్నారు. ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించేందుకు జరుగుతున్న ఓ పెద్ద పోరాటంలో ఎన్నికల కమిషన్ వివాదం కూడా ఒక భాగమని పేర్కొన్నారు.
మోదీ మొగాంబో: మోదీ
విద్యార్థులు, యువతను కలిసేందుకు తాను చేపట్టిన ‘ఛాత్రోంకీ గూంజ్’ 6వ కార్యక్రమాన్ని శనివారం రాహుల్ చెన్నైలో నిర్వహించారు. ఈ సందర్భంగా రాహుల్ మాట్లాడుతూ 1987లో విడుదలైన ప్రఖ్యాత బాలీవుడ్ సినిమా ‘మిస్టర్ ఇండియా’లో విలన్ అమ్రిశ్‌పూరి పోషించిన ‘మొగాంబో’ పాత్రను మోదీతో పోల్చారు. ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్‌షా, ఆర్‌ఎ్‌సఎస్ నేత భాగవత్ కలిసి గత పదిహేనేళ్లుగా దేశాన్ని భ్రష్టు పట్టించారన్నారు. బీజేపీ పాలకులు తమిళ భాష, సంస్కృతులపై దాడులకు పాల్పడుతున్నారన్నారని ఆరోపించారు.
వాళ్లు బందిపోట్లా: దీప్కే తల్లిదండ్రులు
తమ కుమారుడు అభిజీత్ దీప్కేతోపాటు ఎంతోమంది సీజేపీ నేతలను, యువ ఉద్యమకారులను ఢిల్లీలో పోలీసులు అరెస్టు చేయటంపై దీప్కే తల్లిదండ్రులు తీవ్రంగా స్పందించారు. ‘ఢిల్లీలో అంతమంది పోలీసులను ఎందుకు మోహరించారో నాకు అర్థం కావటం లేదు. అది విద్యార్థులు, యువత నిరసన. శాంతియుత ప్రజా నిరసన అనేది పౌరుల భాగస్వామ్యంలో ఒక అంతర్భాగం. ఢిల్లీకి ఏమైనా చంబల్ లోయ నుంచి బందిపోట్లు వచ్చి చేరారా? నిజమైన బందిపోట్లు పార్లమెంటులో ఉన్నారు’ అంటూ అభిజీత్ దీప్కే తండ్రి భగవాన్‌దీప్కే విమర్శించారు. దీప్కే తల్లి అనిత మాట్లాడుతూ, అహింసాయుతంగా నిరసన తెలుపుతున్న విద్యార్థుల మీద ఈ అణచివేత ఏమిటని ప్రశ్నించారు. తమ కుమారుడికి తాము పూర్తి అండగా ఉంటామని స్పష్టం చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి
అంత్యక్రియలకు విమానంలో తీసుకెళ్తాం.. దీప్కేకు ఢిల్లీ పోలీసుల ఆఫర్
పార్కులో కూర్చున్నందుకే అరెస్ట్ చేశారు: బీజేపీ నాయకుడి కుమార్తె..