Share News

అంత్యక్రియలకు విమానంలో తీసుకెళ్తాం.. దీప్కేకు ఢిల్లీ పోలీసుల ఆఫర్..!

ABN , Publish Date - Oct 10 , 2026 | 08:38 PM

కాక్రోచ్ జనతా పార్టీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే కుటుంబంలో విషాదం చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. ఆయన నాన్నమ్మ వయోభారంతో శనివారం ఉదయం కన్నుమూశారు. ఇదే సమయంలో ఢిల్లీ వెళ్లిన అభిజీత్ దీప్కేను పోలీసులు అరెస్టు చేయగా.. మహారాష్ట్రకు తిరిగి తరలించేందుకు మంచి ఆఫర్ ఇచ్చారు.

అంత్యక్రియలకు విమానంలో తీసుకెళ్తాం.. దీప్కేకు ఢిల్లీ పోలీసుల ఆఫర్..!
Abhijit Dipke

న్యూఢిల్లీ: కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే కుటుంబంలో విషాదం చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. మహారాష్ట్రలోని హింగోలి జిల్లా సంతుక్ పింప్రిలో ఆయన నాన్నమ్మ వయోభారంతో శనివారం ఉదయం కన్నుమూశారు. ఇదే సమయంలో SIR, ఓటు చోరీకి వ్యతిరేకంగా జంతర్ మంతర్ వద్ద నిరసన చేపట్టేందుకు ఢిల్లీ వెళ్లిన అభిజీత్ దీప్కేను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం ఆయనకు నాన్నమ్మ మరణవార్తను తెలియజేశారు. ఈ సందర్భంగా అంత్యక్రియలకు హాజరయ్యేందుకు మహారాష్ట్రకు వెళ్లేలా ప్రయాణ ఏర్పాట్లలో సహకరిస్తామని పోలీసు వర్గాలు తెలిపాయి.


విమానంలో మహారాష్ట్రకు దీప్కేను తీసుకెళ్తామని ప్రతిపాదించినట్లు పోలీసులు తెలిపారు. అయితే, నిర్బంధంలోనే ఉండి నిరసనను కొనసాగించాలా? లేక నాన్నమ్మ అంత్యక్రియల్లో పాల్గొనేందుకు స్వగ్రామానికి వెళ్లాలా? అన్నది ఆయనే నిర్ణయించుకోవాల్సి ఉంటుందన్నారు. కాగా, దీప్కే తన అమ్మమ్మ మరణించిన సమయంలో ముంబై నుంచి ఢిల్లీకి వెళ్తున్నారు. ఆశుతోష్ రంకా, సౌరవ్ దాస్‌తో కలిసి ఆయన విమానంలో బయలుదేరారు. అయితే, దేశ రాజధానికి చేరుకున్న వెంటనే విమానంలోనే పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. దీనిపై అభిజీత్ తల్లిదండ్రులు అభ్యంతరం వ్యక్తం చేశారు. విమానం దిగకముందే అదుపులోకి తీసుకోవడాన్ని ఆయన తల్లి అనితా దీప్కే ప్రశ్నించారు. అలాగే, నిరసన నిర్వహించాలన్న సీజేపీ నిర్ణయానికి తన పూర్తి మద్దతు ఉంటుందని దీప్కే తండ్రి భగవాన్‌రావ్ తెలిపారు.


ప్రస్తుతం ఛత్రపతి శంభాజీనగర్‌లో ఉన్న అభిజీత్ తల్లిదండ్రులు నాన్నమ్మ అంత్యక్రియల్లో పాల్గొనేందుకు హింగోలికి వెళ్లనున్నట్లు సమాచారం. కాగా, ఎన్నికల సంఘం చేపట్టిన ఓటర్ల జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) ప్రక్రియలో అక్రమాలు జరిగాయంటూ సీజేపీ నిరసనకు పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తోంది. నిరసన సందర్భంగా నాలుగు రాష్ట్రాల మాజీ ముఖ్యమంత్రులు సహా వందల మంది సీజేపీ మద్దతుదారులు, కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దీంతో ఈరోజు ఢిల్లీ వీధులు రణరంగాన్ని తలపించాయి.


ఈ వార్తలు కూడా చదవండి

భూమిని తాకనున్న సౌర తుఫాను.. అక్టోబర్ 11న ఏం జరగనుంది..?

'సర్'కు మద్దతుగా 124 మంది మాజీ ఐఏఎస్‌, ఐఎఫ్‌ఎస్‌ అధికారుల లేఖ..

Updated Date - Oct 10 , 2026 | 08:55 PM