రాజుల పాలనలా దేశాన్ని మార్చాలనుకుంటున్నారు: రాహుల్
ABN , Publish Date - Jan 22 , 2026 | 03:47 PM
మోదీ ప్రభుత్వం తీసుకువచ్చిన కొత్త చట్టం ఉద్దేశం, గతంలో తీసుకువచ్చిన 'మూడు నల్ల వ్యవసాయ చట్టాల' ఉద్దేశం ఒకటేనని రాహుల్ గాంధీ విమర్శించారు.
న్యూఢిల్లీ: ఎంజీఎన్‌ఆర్‌ఈజీఏ స్థానంలో కేంద్రం తీసుకువచ్చిన వికసిత్ భారత్-గ్యారంటీ ఫర్ రోజ్‌గార్ అండ్ అజీవికా మిషన్ (గ్రామీణ) బిల్లు 'వీబీ జీ రామ్ జీ'కు వ్యతిరేకంగా పేద ప్రజలంతా ఏకం కావాలని లోక్‌సభలో విపక్ష నేత రాహుల్ గాంధీ(Rahul Gandhi) కోరారు. మోదీ ప్రభుత్వం తీసుకువచ్చిన కొత్త చట్టం ఉద్దేశం, గతంలో తీసుకువచ్చిన 'మూడు నల్ల వ్యవసాయ చట్టాల' ఉద్దేశం ఒకటేనని విమర్శించారు. జవహర్ భవన్‌లో గురువారం నాడు జరిగిన నేషనల్ ఎంజీఎన్‌ఆర్‌ఈజీఏ కార్మికుల సమావేశంలో రాహుల్ గాంధీ పాల్గొన్నారు.
పంచాయతీ రాజ్ వ్యవస్థ ఏర్పాటు ఉద్దేశానికే చరమగీతం పాడాలని ప్రధాని మోదీ కోరుకుంటున్నారని రాహుల్ ఆరోపించారు. రాజుల పాలనలా ఇండియాను మార్చాలని బీజేపీ అనుకుంటోందన్నారు. పేద ప్రజలందరికీ పని హక్కును ఎంజీఎన్‌ఆర్‌ఈజీఏ కల్పిస్తే, ఆ ఉద్దేశాన్ని దెబ్బతీయడమే బీజేపీ, మోదీ కోరిక అని తప్పుబట్టారు. కొద్దికాలం క్రితం మూడు నల్ల వ్యవసాయ చట్టాలను వాళ్లు తెచ్చారని, అంతా కలిసికట్టుగా ప్రభుత్వంపై పోరాటం జరిపామని, రైతులు దాన్ని అడ్డుకున్నారని గుర్తు చేసారు. దాంతో ఆ నల్ల చట్టాలను కేంద్రం రద్దు చేసిందన్నారు. రైతుల విషయంలో అప్పుడు చేసినట్టే ఇప్పుడు అదే పని కార్మికుల విషయంలోనూ చేస్తున్నారని అన్నారు. కొత్త చట్టంతో బీజేపీ పాలిత రాష్ట్రాలకే పనులు, నిధులను కేంద్రం కేటాయిస్తుందని చెప్పారు.
పేద ప్రజల పని హక్కును కేంద్రం హరిస్తూ, ఆధునిక భారత్‌ను విచ్ఛిన్నం చేయాలని కుట్ర జరుపుతోందని రాహుల్ ఆరోపించారు. కేంద్రాన్ని అడ్డుకునేందుకు అందరూ ఏకం కావాలని పిలుపునిచ్చారు. ప్రజాస్వామ్యంపై నమ్మకం ఉన్న ప్రతిఒక్కరూ ఐక్యంగా నిలబడినప్పుడే కేంద్రం వెనక్కి తగ్గుతుందన్నారు. కేంద్రం తెచ్చిన ఉపాధి హామీ చట్టాన్ని వెనక్కి తీసుకుని ఎంజీఎన్‍ఆర్‌ఈజీఏను పునరుద్ధరించేంత వరకూ తాము పోరాడతామని చెప్పారు. దీనిపై పార్లమెంటు బడ్జెట్ సమావేశాల్లోనూ పోరాటం సాగిస్తామని తెలిపారు. ఈ సదస్సులో పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో పాటు పలువురు సీనియర్ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి.
భోజ్‌శాల వద్ద ప్రార్థనలపై సుప్రీం కీలక ఉత్తర్వులు
తమిళ హీరో విజయ్ పార్టీకి ఎన్నికల గుర్తు కేటాయించిన ఈసీ
Read Latest National News