కర్ణాటక అసెంబ్లీలో కలకలం రేపిన గవర్నర్ థావర్‌చంద్ గహ్లోత్
ABN , Publish Date - Jan 22 , 2026 | 12:45 PM
కర్ణాటక అసెంబ్లీ సమావేశాలు గురువారం ఉదయం ప్రారంభమయ్యాయి. ఉభయ సభలనుద్దేశించి గవర్నర్ థావర్‌చంద్ గహ్లోత్ చేసిన ప్రారంభోపన్యాసంలో హైడ్రామా నెలకొంది. కేవలం రెండు లైన్లు చదివి గవర్నర్ సభ నుంచి వాకౌట్ చేశారు. దీంతో అధికార కాంగ్రెస్ ప్రభుత్వం మండిపడింది.
బెంగళూరు, జనవరి 22: కర్ణాటక అసెంబ్లీ సమావేశాల్లో ప్రారంభం రోజే హైడ్రామా నడిచింది. ఉపాధి హామీ పథకానికి సవరణలు వద్దనే తీర్మానంపై కర్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధం చేసిన ప్రసంగాన్ని గవర్నర్ థావర్‌చంద్ గహ్లోత్.. కేవలం రెండు లైన్లు చదివేసి సభ నుంచి వాకౌట్ చేశారు.
'ఈ ప్రభుత్వం రాష్ట్రంలో ఆర్థిక, సామాజిక పురోగతి వేగాన్ని రెట్టింపు చేయడానికి కట్టుబడి ఉంది. జై హింద్, జై కర్ణాటక!' అంటూ ప్రసంగాన్ని ముగించారు గవర్నర్. దీంతో గవర్నర్ తీరుపై కాంగ్రెస్ నేతలు భగ్గుమన్నారు. గవర్నర్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. 'లోక్ భవన్ బీజేపీ కార్యాలయంగా మారిందా?' అని గవర్నర్‌ను ప్రశ్నించారు.

ఇది రాజ్యాంగ వ్యతిరేక చర్య: సీఎం సిద్ధరామయ్య
గవర్నర్ గహ్లోత్ అసెంబ్లీ నుంచి వాకౌట్ చేసిన తర్వాత.. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్ధరామయ్య మీడియాతో మాట్లాడారు. 'ప్రతి కొత్త సంవత్సరం గవర్నర్ అసెంబ్లీ ఉమ్మడి సమావేశంలో ప్రసంగించాలి. ఆ ప్రసంగ పత్రాలను క్యాబినెట్ తయారు చేయాలి. ఇది రాజ్యాంగబద్ధమైన అవసరం. నేడు క్యాబినెట్ తయారు చేసిన ప్రసంగాన్ని చదవడానికి బదులుగా.. గవర్నర్ స్వయంగా రూపొందించుకున్న ప్రసంగాన్ని చదివారు. ఇది భారత రాజ్యాంగాన్ని ఉల్లంఘించడమే. రాజ్యాంగంలోని ఆర్టికల్ 176, 163ను ఉల్లంఘనల కిందకు వస్తుంది. రాజ్యాంగం ప్రకారం.. ఆయన తన విధులను సక్రమంగా నిర్వర్తించలేదు. అందువల్ల గవర్నర్ వైఖరికి వ్యతిరేకంగా నిరసన తెలపబోతున్నాం. సుప్రీంకోర్టును ఆశ్రయించాలా.. వద్దా.. అని పరిశీలిస్తున్నాం' అని సీఎం సిద్ధరామయ్య అన్నారు.
ఇవీ చదవండి:
సర్వ దర్శన టోకెన్ల జారీ నిలిపివేత.. ఎప్పటినుంచంటే.?
వసంత పంచమి ఎప్పుడు? ఆ రోజు ఏం చేయాలి.?