సర్వ దర్శన టోకెన్ల జారీ నిలిపివేత.. ఎప్పటినుంచంటే.?
ABN , Publish Date - Jan 22 , 2026 | 08:53 AM
టీటీడీ మరో కీలక నిర్ణయం తీసుకుంది. సర్వ దర్శన టోకెన్లను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. అందుకు కారణాన్ని సైతం టీటీడీ వివరించింది.
తిరుపతి, జనవరి 22: రథ సప్తమి నేపథ్యంలో తిరుమల తిరుపతి దేవస్థానం(TTD) కీలక నిర్ణయం తీసుకుంది. శుక్రవారం నుంచి తిరుపతిలో మూడు రోజుల పాటు సర్వ దర్శన టోకెన్ల జారీని నిలిపివేసింది. ఈ టోకెన్లు జారీచేసే మూడు ప్రాంతాల్లో నిలిపివేయాలని నిర్ణయించినట్లు టీటీడీ ప్రకటించింది.
మరోవైపు ఆదివారం(2026 జనవరి 26)న రథ సప్తమి వేడుకలను వైభవంగా నిర్వహించాలని ఇప్పటికే టీటీడీ అధికారులను ఈవో అనిల్ కుమార్ సింఘాల్ ఆదేశించారు. రథ సప్తమి నేపథ్యంలో ఉన్నతాధికారులతో టీటీడీ ఈవో ఇటీవల సమీక్షా సమావేశం నిర్వహించారు. భద్రత, పార్కింగ్, అన్నప్రసాదాలు, లడ్డూలు, రద్దీ నిర్వహణ, స్వచ్ఛ కార్యక్రమాలు, అత్యవసర సేవల విషయంలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని వారికి సూచించారు. సందర్శకులను ఆకట్టుకునేలా సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించాలని, గ్యాలరీల్లో భక్తుల రద్దీ అధికంగా ఉండే ప్రాంతాల్లో ఎల్‌ఈడీ స్క్రీన్లు ఏర్పాటు చేయాలని ఆదేశించారు.
రథసప్తమి వేళ.. వాహన సేవల వివరాలు..
తెల్లవారుజామున 5:30 నుంచి 8:00 గంటల వరకు సూర్యప్రభ వాహనం
ఉదయం 9:00 నుంచి 10:00 గంటల వరకు చిన్నశేష వాహనం
ఉదయం 11:00 నుంచి మధ్యాహ్నం 12:00 గంటల వరకు గరుడ వాహనం
మధ్యాహ్నం 1:00 నుంచి 2:00 గంటల వరకు హనుమంత వాహనం
మధ్యాహ్నం 2:00 నుంచి 3:00 గంటల వరకు చక్రస్నానం
సాయంత్రం 4:00 నుంచి 5:00 గంటల వరకు కల్పవృక్ష వాహనం
సాయంత్రం 6:00 నుంచి 7:00 గంటల వరకు సర్వభూపాల వాహనం
రాత్రి 8:00 నుంచి 9:00 గంటల వరకు చంద్రప్రభ వాహనం
సిఫార్సు లేఖలు స్వీకరించం: టీటీడీ
రథ సప్తమి నేపథ్యంలో స్వామివారి ఆర్జిత సేవలు, ప్రత్యేక దర్శనాలు, కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపకాలంకార సేవలు రద్దు చేశారు. ఎన్‌ఆర్ఐలు, చంటి బిడ్డల తల్లిదండ్రులు, సీనియర్ సిటిజన్లు, దివ్యాంగుల ప్రివిలేజ్ దర్శనాలూ నిలిపివేస్తున్నట్లు టీటీడీ వెల్లడించింది. ప్రొటోకాల్ ప్రముఖులకు మినహా వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు చేయడం సహా బ్రేక్ దర్శనాలకు సంబంధించి జనవరి 24న ఎలాంటి సిఫార్సు లేఖలనూ స్వీకరించబోమని టీటీడీ స్పష్టం చేసింది.
నేడు ఏప్రిల్ మాసం టోకెన్లు విడుదల..
ఈ రోజు ఆన్‌లైన్‌లో ఏప్రిల్ మాసం శ్రీవారి దర్శన టికెట్లు విడుదల చేసేందుకు టీటీడీ అన్ని ఏర్పాట్లు చేసింది. ఉదయం 10:00 గంటలకు ఆర్జిత సేవ, మధ్యాహ్నం 3:00 గంటలకు వర్చువల్ సేవా టికెట్లను విడుదల చేస్తున్నట్లు వెల్లడించింది. శుక్రవారం (23-01-2026) ఉదయం 10:00 గంటలకు అంగ ప్రదక్షణ టోకెన్లు, 11:00 గంటలకు శ్రీవాణి టికెట్స్ కోటా విడుదల.. అలాగే మధ్యాహ్నం 3:00 గంటలకు వికలాంగులు, వృద్ధుల టోకెన్స్ విడుదల చేయనున్నారు. శనివారం ఉదయం 10: 00 గంటలకు ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్ల కోటా విడుదల చేయనున్నట్లు టీటీడీ వివరించింది.
ఈ వార్తలు కూడా చదవండి..
కొలిచిన వారికి కొంగు బంగారం.. జూబ్లీహిల్స్ పెద్దమ్మ తల్లి
వసంత పంచమి ఎప్పుడు? ఆ రోజు ఏం చేయాలి.?
For More Devotional News And Telugu News