Share News

ఎన్నికల సంఘానికి 48 ప్రశ్నలు.. సుప్రీంకోర్టును ఆశ్రయించిన రాహుల్ గాంధీ

ABN , Publish Date - Nov 16 , 2026 | 05:02 PM

ఓటర్ల జాబితా సవరణ (SIR) వివాదం మరో దశకు చేరుకుంది. ఎన్నికల సంఘంపై 48 ప్రశ్నలు సంధించేందుకు అనుమతి కోరుతూ రాహుల్ గాంధీ సుప్రీంకోర్టును ఆశ్రయించారు.

ఎన్నికల సంఘానికి 48 ప్రశ్నలు.. సుప్రీంకోర్టును ఆశ్రయించిన రాహుల్ గాంధీ
Rahul Gandhi SIR Case

ఢిల్లీ, నవంబర్ 16: దేశవ్యాప్తంగా చేపట్టిన ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణ (Special Intensive Revision - SIR) ప్రక్రియలో ఏకపక్ష నిర్ణయాలు జరిగాయని, భారీ ఎత్తున ఓట్లను తొలగించారని ఆరోపిస్తూ లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, ఇతర విపక్ష నేతలు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ వ్యవహారంలో కేంద్ర ఎన్నికల సంఘానికి (ECI) 48 రాతపూర్వక ప్రశ్నలు (Interrogatories) సంధించేందుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ వారు అత్యున్నత న్యాయస్థానంలో తాజాగా పిటిషన్ దాఖలు చేశారు.

పిటిషనర్ల ఆరోపణ: ప్రధాన ఎన్నికల కమిషనర్ (CEC), మిగిలిన ఇద్దరు ఎన్నికల కమిషనర్లు డాక్టర్ సుఖ్‌బీర్ సింగ్ సంధు, డాక్టర్ వివేక్ జోషిల ప్రమేయం లేకుండానే కమిషన్‌కు ఉన్న ఉమ్మడి అధికారాలను ఏకపక్షంగా వినియోగించారా అన్నదే ఈ వివాదంలో కీలకమని రాహుల్ గాంధీ తదితరులు తమ పిటిషన్‌లో పేర్కొన్నారు. దీనిపై ముగ్గురు కమిషనర్లు స్వయంగా ప్రమాణపత్రాలు (Sworn Affidavits) దాఖలు చేయాలని వారు డిమాండ్ చేశారు.

ఈసీఐ (ECI) వాదన: అక్టోబర్ 26న, తిరిగి నవంబర్ 14న డిప్యూటీ ఎలక్షన్ కమిషనర్ భాను ప్రకాశ్ ఏటూరు ద్వారా సుప్రీంకోర్టులో దాఖలు చేసిన కౌంటర్ అఫిడవిట్లలో.. ముగ్గురు సభ్యుల కమిషన్ ఏకగ్రీవ నిర్ణయం మేరకే SIR ఉత్తర్వులు జారీ అయ్యాయని ఎన్నికల సంఘం స్పష్టం చేసింది.

విపక్షాల కౌంటర్: ఈసీఐ కేవలం మాటల ద్వారానే వాదిస్తోందని, తమ వాదనకు మద్దతుగా కనీసం ఫైల్ నంబర్లు, తేదీలు, సమావేశపు మినిట్స్ వంటి అధికారిక రికార్డులను బయటపెట్టడం లేదని పిటిషనర్లు విమర్శించారు. పైగా, దేశవ్యాప్త SIR నిర్వహణపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని ఆగస్టు 2025లో ఈసీఐ అధికారులే స్వయంగా ఒక సమాచార హక్కు (RTI) దరఖాస్తుకు బదులిచ్చిన విషయాన్ని వారు కోర్టు దృష్టికి తెచ్చారు.

సుప్రీంకోర్టు ముందుంచిన 48 ప్రశ్నల్లోని కీలక అంశాలు

సుప్రీంకోర్టు నిబంధనలు-2013 ప్రకారం పది విభాగాల్లో మొత్తం 48 ప్రశ్నలను ఈసీఐకి సంధించేందుకు పిటిషనర్లు అనుమతి కోరారు. అందులో ప్రధానమైనవి:

కమిషనర్ల అభ్యంతరాలు: ఫిబ్రవరి 2025 నుంచి అక్టోబర్ 2026 మధ్య కాలంలో SIR, ECINET, ఫారం-6 (Form 6), లేదా కోర్టు అప్పీళ్ల విషయంలో ఎన్నికల కమిషనర్లు డాక్టర్ సుఖ్‌బీర్ సింగ్ సంధు, డాక్టర్ వివేక్ జోషి ఏవైనా రాతపూర్వక అభ్యంతరాలు, భిన్నాభిప్రాయాలు నమోదు చేశారా? అన్న వివరాలను వెల్లడించాలని కోరారు.

డేటాబేస్ యాక్సెస్, తొలగింపులు: ఓటర్ల జాబితా డేటాబేస్‌లో మార్పులు చేసే (Write access) అవకాశం ప్రైవేట్ కాంట్రాక్టర్లు లేదా వెండర్లకు ఉందా? ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ల (EROs) ఉత్తర్వులు లేకుండానే సామూహికంగా ఓట్ల తొలగింపు జరిగిందా? యాక్సెస్ ఆడిట్ నిర్వహించాలన్న డాక్టర్ వివేక్ జోషి ప్రతిపాదనపై ఎలాంటి చర్యలు తీసుకున్నారు? అన్న విషయాలపై ఈసీఐ డైరెక్టర్ జనరల్ (ఐటీ) స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు.

వాట్సాప్ ఆమోదాలు.. రాష్ట్రాల వారీ డేటా: ఆన్‌లైన్ ఫారం-6లో కొత్త డిక్లరేషన్ చేర్చడానికి ఎవరు అనుమతించారు? ముసాయిదా, తుది జాబితాల నుంచి తొలగించిన ఓటర్ల రాష్ట్రాల వారీ డేటా ఏమిటి? అత్యవసర ఆమోదాలను వాట్సాప్ (WhatsApp) లేదా వ్యక్తిగత ఇమెయిళ్ల ద్వారా పొందారా? అన్న వివరాలను అడిగారు.

పుట్టస్వామి తీర్పు ప్రస్తావన

ఒక సాంకేతిక వ్యవస్థను నిర్వహిస్తున్న సంస్థ వద్ద మాత్రమే ఉండే కీలక వాస్తవాలు రాజ్యాంగపరమైన సవాలుకు కేంద్రబిందువుగా మారినప్పుడు, ఆ అధికారులను నిర్దిష్ట ప్రశ్నలకు సమాధానాలు చెప్పాలని కోర్టు ఆదేశించవచ్చంటూ గతంలో జస్టిస్ కె.ఎస్. పుట్టస్వామి కేసులో రాజ్యాంగ ధర్మాసనం ఇచ్చిన తీర్పును పిటిషనర్లు ఉదహరించారు. ఒకవేళ ఏదైనా అధికారిక రికార్డుపై ఈసీఐ గోప్యత (Privilege) కోరితే, ప్రతి రికార్డుకు సంబంధించి నిర్దిష్ట కారణాలను కోర్టుకు వివరించేలా ఆదేశించాలని పిటిషనర్లు విజ్ఞప్తి చేశారు. (Rahul Gandhi SIR Case)


ఇవీ చదవండి

జంగిల్ సఫారీలో పర్యాటకులకు షాక్.. దూసుకొచ్చిన పెద్దపులి!

కనపడని డాక్టర్‌..ఏఐ

Updated Date - Nov 16 , 2026 | 05:06 PM