జాతీయ భద్రతకు రాహుల్ ప్రమాదకారి.. రిజిజు సంచలన వ్యాఖ్యలు
ABN , Publish Date - Feb 18 , 2026 | 03:10 PM
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు తీవ్ర ఆరోపణలు చేశారు. దేశ వ్యతిరేక శక్తులతో రాహుల్‌కు సంబంధాలు ఉన్నాయని, ఆయన జాతీయ భద్రతకు చాలా ప్రమాదకరమని అన్నారు.
న్యూఢిల్లీ: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ (Rahul Gandhi)పై కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు (Kiren Rijiju) తీవ్ర ఆరోపణలు చేశారు. దేశ వ్యతిరేక శక్తులతో రాహుల్‌కు సంబంధాలు ఉన్నాయని, ఆయన జాతీయ భద్రతకు చాలా ప్రమాదకరమని అన్నారు. దేశంలోనూ, విదేశీ పర్యటనల్లోనూ ఆయన నక్సలైట్లు, వేర్పాటువాదులు, సిద్ధాంతకర్తలు, అమెరికాకు చెందిన ప్రముఖ పెట్టుబడిదారుడు జార్జిసోరస్ వంటి వ్యక్తులతో సమావేశమవుతున్నారని ఆరోపించారు. దేశ చరిత్రలో ఆయనలాంటి విపక్ష నేతను తాను ఎప్పడూ చూడలేదని అన్నారు. ఏఎన్ఐ వార్తా సంస్థకు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో రిజిజు ఈ వ్యాఖ్యలు చేశారు.
ఇటీవల పార్లమెంటు సమావేశాల్లో కలిగిన అంతరాయంపై రిజిజు మాట్లాడుతూ, పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో సందడి, గందరగోళం వంటివి ఉంటాయని, ప్రతి పార్టీకి సొంత ఎజెండాలు ఉండటం వల్ల సభలో ప్రస్తావించాలని అనుకుంటాయని చెప్పారు. అయితే సమావేశాలు జరగనీయకూడదనే ఉద్దేశంతో కాగితాలు విసరడం, నినాదాలు చేస్తూ వాకౌట్ చేయడంతో తాను అసహనానికి గురైనట్టు తెలిపారు. రాహుల్ చిన్న పిల్లల చర్యలు చేస్తూ, బాధ్యతారాహిత్యంతో వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. విపక్షాలకు ప్రాతినిధ్యం వహించాల్సిన నేత సభ బయటకు వెళ్లడం, ద్రోహులంటూ మాట్లాడటం, బైఠాయింపులు చేయడం, ఆముద్రిత పుస్తకంలోని విషయాల గురించి పట్టుబట్టడం వంటివి చిన్నపిల్లాడి చేష్టలని తప్పుపట్టారు. పార్లమెంటు వెలుపల కేంద్ర మంత్రి రవ్‌నీత్ సింగ్ భిట్టూతో ఆయన వ్యవహరించిన తీరును సైతం రిజిజు ప్రస్తావించారు.
ఎప్‌స్టీన్ వివాదం నేపథ్యంలో ప్రధానమంత్రి మోదీని ప్రస్తావిస్తూ రాహుల్ చేసిన వ్యాఖ్యలను రిజిజు తప్పుపట్టారు. 'రాహుల్ గాంధీ అనుచరులు సైతం ఆయనను ఎందుకు సీరియస్‌గా తీసుకోవడం లేదో గ్రహించాలి. ఆయన మాట్లాడే దాంట్లో నిజం ఉండదు. ప్రధాన మంత్రి ఎవరినైనా కలిసి ఉంటే, అలాంటి డాక్యుమెంట్లు ఉండి ఉంటే వాటిని చూపించాలి. ఎలాంటి ఆధారాలు లేకుండా ప్రధానమంత్రి పేరును లాగుతున్నారు. ఇలాంటివన్నీ తీవ్ర అసహనాన్ని కలిగిస్తున్నాయి' అని రిజిజు చెప్పారు.
కాంగ్రెస్‌లో ఒకప్పుడు పరిపక్వత కలిగిన నాయకులు ఉండేవారని, ఏ పనిచేసినా, ప్రసంగించినా పరిపక్వత కనిపించేదని, క్రమంగా రాహుల్ గాంధీ వంటి నాయకుల స్థాయికి వచ్చేసిందని విమర్శించారు. రాహుల్ చుట్టూ తిరిగే వాళ్లంతా ఆయనలాగానే అవుతున్నారని రిజిజు అన్నారు.
ఇవి కూడా చదవండి..
ప్రధాని మోదీతో సుందర్ పిచాయ్ భేటీ.. ఏఐ టెక్నాలజీపై చర్చలు!
రాజ్యసభ ఎన్నికల షెడ్యూల్ విడుదల .. తెలంగాణ నుంచి 2 స్థానాలకు ఎన్నికలు