Share News

ఎవరెస్ట్‌ ఎత్తుకు ‘రక్షణ’ బంధం

ABN , Publish Date - Feb 18 , 2026 | 06:31 AM

భారత్‌-ఫ్రాన్స్‌ మధ్య రక్షణ సంబంధాలు ‘ఎవరెస్ట్‌’ స్థాయికి చేరుతున్నాయి. ప్రపంచంలోనే అత్యంత ఎత్తుకు ఎగరగలిగేఎయిర్‌బస్‌ హెచ్‌-125 హెలికాప్టర్లు, హ్యామర్‌ క్షిపణులను...

ఎవరెస్ట్‌ ఎత్తుకు ‘రక్షణ’ బంధం

భారత్‌-ఫ్రాన్స్‌ మధ్య కీలక ఒప్పందాలు

ఎవరెస్టు ఎత్తుకు చేరగలిగే ఎయిర్‌బస్‌ హెచ్‌-125

హెలికాప్టర్లు, హ్యామర్‌ క్షిపణుల ఉమ్మడి తయారీ

కర్ణాటకలోని వేమగల్‌లో టాటా-ఎయిర్‌బస్‌ యూనిట్‌

ప్రారంభించిన ప్రధాని మోదీ, ఫ్రాన్స్‌ అధ్యక్షుడు మెక్రాన్‌

సాంకేతికతలు, ఆవిష్కరణల్లో భాగస్వామ్యం కోసం

‘ఇండియా-ఫ్రాన్స్‌ సృజనాత్మక సంవత్సరం-2026’

రక్షణ, ఖనిజాలు, అత్యాధునిక సాంకేతికత,ఆరోగ్య

రంగాల్లో పరస్పర సహకారం కోసం 21 ఒప్పందాలు

ముంబైలోని లోక్‌భవన్‌లో మోదీ, మెక్రాన్‌ భేటీ

ఫ్రాన్స్‌ నైపుణ్యానికి తోడుగా భారత సామర్థ్యాలు: మోదీ

రక్షణ సహకారం మరింత విస్తృతం: మెక్రాన్‌

3 రోజుల పాటు భారత్‌లో ఫ్రాన్స్‌ అధ్యక్షుడు

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 17: భారత్‌-ఫ్రాన్స్‌ మధ్య రక్షణ సంబంధాలు ‘ఎవరెస్ట్‌’ స్థాయికి చేరుతున్నాయి. ప్రపంచంలోనే అత్యంత ఎత్తుకు ఎగరగలిగేఎయిర్‌బస్‌ హెచ్‌-125 హెలికాప్టర్లు, హ్యామర్‌ క్షిపణులను భారత్‌-ఫ్రాన్స్‌ సంయుక్తంగా ఉత్పత్తి చేయనున్నాయి. రక్షణ అంశాల్లో సమన్వయం, సమగ్రత కోసం ఇరు దేశాల సైన్యంలో పలువురు సైనికాధికారులను పరస్పరం నియమించుకోనున్నాయి. మొత్తంగా రక్షణ, కీలక ఖనిజాలు, అత్యాధునిక సాంకేతికతలు, ఆరోగ్య రంగాల్లో పరస్పర సహకారం కోసం భారత్‌-ఫ్రాన్స్‌ మధ్య 21 ఒప్పందాలపై ప్రధాని మోదీ, ఫ్రాన్స్‌ అధ్యక్షుడు ఎమ్మాన్యుయెల్‌ మెక్రాన్‌ మంగళవారం సంతకాలు చేశారు. ఈ సందర్భంగా ఇరు దేశాల మధ్య బంధాన్ని ‘ప్రత్యేక అంతర్జాతీయ వ్యూహాత్మక భాగస్వామ్యం’గా ఇరువురు నేతలు అభివర్ణించారు. మంగళవారం ముంబైలోని మహారాష్ట్ర లోక్‌భవన్‌లో ప్రధాని మోదీ, మెక్రాన్‌, విదేశాంగ మంత్రి జైశంకర్‌, జాతీయ భద్రతా సలహాదారు అజిత్‌ దోవల్‌, ఫ్రాన్స్‌ రక్షణ అధికారులు భేటీ అయి ద్వైపాక్షిక అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ, మెక్రాన్‌ ఇద్దరూ కలిసి కర్ణాటకలోని వేమగల్‌లో ఏర్పాటు చేస్తున్న టాటా-ఎయిర్‌బస్‌ సంస్థల సంయుక్త ‘హెచ్‌125 లైట్‌ యూటిలిటీ హెలికాప్టర్‌ ఫైనల్‌ అసెంబ్లింగ్‌ యూనిట్‌’ను వర్చువల్‌గా ప్రారంభించారు. అనంతరం సంయుక్తంగా మీడియా సమావేశంలో మాట్లాడారు.


నాలుగోసారి భారత్‌కు..

మెక్రాన్‌ ఫ్రాన్స్‌ అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత నాలుగో సారి భారత్‌కు వచ్చారు. ఈసారి 3 రోజుల పర్యటన నిమిత్తం మంగళవారం తెల్లవారుజామునే ముంబైకి చేరుకున్న ఆయన.. తీరంలోని మెరైన్‌ డ్రైవ్‌ ప్రాంతంలో జాగింగ్‌ చేశారు. అనంతరం తన సతీమణి బ్రిగిట్టేతో కలిసి తాజ్‌మహల్‌ ప్యాలెస్‌ హోటల్‌ సమీపంలోని స్మారకం వద్ద 26/11 ముంబై ఉగ్రదాడి మృతులకు నివాళి అర్పించారు. అనంతరం ప్రధాని మోదీతో భేటీ అయ్యారు. మెక్రాన్‌ గురువారం ఢిల్లీలో ఏఐ ఇంపాక్ట్‌ సదస్సులో పాల్గొననున్నారు.

21 ఒప్పందాలు.. హెలికాప్టర్లు, క్షిపణులు..

ప్రధాని మోదీ, ఫ్రాన్స్‌ అధ్యక్షుడు మెక్రాన్‌ భేటీ సందర్భంగా ఇరు దేశాల మధ్య సహకారానికి సంబంధించి 21 ఒప్పందాలు, అవగాహనా పత్రాలపై సంతకాలు జరిగాయి. ఆ ఒప్పందాల ప్రకారం ఇరుదేశాల రక్షణ సహకార ఒప్పందాన్ని పదేళ్లు పొడిగించారు.

  • ఎయిర్‌బస్‌ హెచ్‌125 హెలికాప్టర్లను కర్ణాటకలోని వేమగల్‌లో ఏర్పాటు చేస్తున్న టాటా-ఎయిర్‌బస్‌ ప్లాంట్‌లో ఉత్పిత్తి చేయనున్నారు. ప్రతికూల వాతావరణాన్ని సమర్థవంతంగా తట్టుకుని, ఎవరెస్ట్‌ శిఖరం వరకు కూడా చేరుకోగల సామర్థ్యం ఈ యూటిలిటీ హెలికాప్టర్‌ సొంతం. దీనిని భారత్‌లో ఉత్పత్తి చేయడమేగాకుండా విదేశాలకు విక్రయించేందుకూ తాజా ఒప్పందం వీలుకల్పించనుంది. 2027 మార్చి నాటికి తొలి మేడిన్‌ ఇండియా హెచ్‌-125 హెలికాప్టర్‌ను డెలివరీ చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.

  • అత్యంత కచ్చితత్వంతో లక్ష్యాలను ఛేదించగల హ్యామర్‌ క్షిపణులను కూడా భారత్‌లో ఉత్పత్తి చేయడానికి ఒప్పందం కుదిరింది. ఇందుకోసం హ్యామర్‌ క్షిపణులను అభివృద్ధి చేసిన ఫ్రెంచ్‌ సంస్థ సాఫ్రాన్‌, భారత్‌ ఎలకా్ట్రనిక్స్‌ లిమిటెడ్‌ (బీఈఎల్‌) ఉమ్మడి సంస్థను ఏర్పాటు చేయనున్నాయి. రఫేల్‌ యుద్ధ విమానాల నుంచి ప్రయోగించగలిగే ఈ హ్యామర్‌ క్షిపణుల సామర్థ్యం గరిష్ఠంగా 70 కిలోమీటర్లు.

  • ఇరుదేశాల మధ్య పెట్టుబడులను ప్రోత్సహించేందుకు వీలుగా.. ఇరువైపులా పన్ను (డబుల్‌ ట్యాక్సేషన్‌) లేకుండా ఒప్పందం కుదిరింది.

  • ఆరోగ్య రంగంలో కృత్రిమ మేధ, డిజిటల్‌ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ, విమానయాన రంగాల్లో పరస్పర సహకారం కోసం ప్రత్యేక ఇండో-ఫ్రెంచ్‌ సెంటర్లను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.

  • ఇక ‘ఇండియా-ఫ్రాన్స్‌ సృజనాత్మక సంవత్సరం’ పేరిట ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రధాని మోదీ, మెక్రాన్‌ ప్రారంభించారు. రెండు దేశాల ఆవిష్కరణలను సమన్వయం చేసేందుకు ‘ఇండో-ఫ్రెంచ్‌ ఇన్నోవేషన్‌ నెట్‌వర్క్‌’ను ఏర్పాటు చేస్తారు.


  • ‘ఇన్నోవేషన్‌ ఇయర్‌’ కార్యక్రమంలో భాగంగా హైదరాబాద్‌కు చెందిన ధ్రువ స్పేస్‌, కర్ణాటకకు చెందిన పిక్సెల్‌ స్పేస్‌ సంస్థలు ఫ్రాన్స్‌ అంతరిక్ష సంస్థ ఎక్సోట్రెయిల్‌తో ఒప్పందం కుదుర్చుకున్నాయి. ధ్రువ, పిక్సెల్‌ సంస్థలు ప్రయోగించే ఉపగ్రహాలకు అవసరమైన ఎలక్ట్రిక్‌ ప్రొపల్షన్‌ వ్యవస్థలను ఎక్సోట్రెయిల్‌ సరఫరా చేయనుంది.

  • ప్రస్తుతం అంతర్జాతీయంగా అనిశ్చిత పరిస్థితులు నెలకొన్నాయని.. ఇలాంటి సమయంలో భారత్‌-ఫ్రాన్స్‌ భాగస్వామ్యం ప్రపంచ స్థిరత్వానికి దోహదం చేస్తుందని ప్రధాని మోదీ పేర్కొన్నారు. ‘‘భారత్‌-ఫ్రాన్స్‌ మధ్య భాగస్వామ్యానికి ఎలాంటి సరిహద్దులూ లేవు. సముద్రపు లోతుల నుంచి ఎత్తయిన పర్వత శిఖరాల వరకు ఈ భాగస్వామ్యం విస్తరించగలదు. హెచ్‌-125 హెలికాప్టర్ల ఉమ్మడి తయారీ అంశం ఇరు దేశాల మధ్య లోతైన నమ్మకానికి చిహ్నం’’ అని మోదీ చెప్పారు. ఫ్రాన్స్‌కు భారత్‌ అత్యంత విశ్వసనీయమైన భాగస్వామి అని మెక్రాన్‌ పేర్కొన్నారు.

వేమగల్‌లో టాటా-ఎయిర్‌బస్‌ యూనిట్‌

బెంగళూరు, ఫిబ్రవరి 17 (ఆంధ్రజ్యోతి): కర్ణాటకలోని కోలారు జిల్లా వేమగల్‌లో టాటా-ఎయిర్‌బస్‌ యూనిట్‌ను ప్రధాని మోదీ, ఫ్రాన్స్‌ అధ్యక్షుడు మెక్రాన్‌ వర్చువల్‌గా ప్రారంభించగా.. వేమగల్‌లో జరిగిన కార్యక్రమంలో రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌, విమానయాన మంత్రి రామ్మోహన్‌, ఫ్రాన్స్‌ రక్షణ మంత్రి కేథరిన్‌ పాల్గొన్నారు. ఇక్కడ హెచ్‌125తోపాటు మిలిటరీకి అవసరమైన హెచ్‌125ఎం హెలికాప్టర్లనూ తయారు చేయనున్నారు.

రఫేల్‌ ఒప్పందంపై

వెలువడని ప్రకటన

ఫ్రాన్స్‌ నుంచి 114 రఫేల్‌ ఫైటర్ల కొనుగోలు ప్రతిపాదనలకు రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ నేతృత్వంలోని ‘రక్షణ కొనుగోళ్ల మండలి (డీఏసీ)’ ఇటీవలే ఆమోదం తెలిపిన సంగతి తెలిసిందే. సుమారు రూ.3.6 లక్షల కోట్ల విలువైన ఈ ఒప్పందంపై మంగళవారమే ప్రకటన వెలువడుతుందని భావించారు. కానీ రాలేదు. బుధ, గురువారాల్లోనూ మెక్రాన్‌ భారత్‌లోనే పర్యటించనున్నారు. గురువారం ఢిల్లీలో ప్రధాని మోదీతో భేటీకానున్నారు. అక్కడ దీనిపై ప్రకటన రావొచ్చని చెబుతున్నారు.

ఇవి కూడా చదవండి..

ఫ్రాన్స్ సహకారంతో ఎవరెస్ట్ హైట్స్‌కు వెళ్లే హెలికాప్టర్ల తయారీ.. మోదీ

మెక్రాన్‌తో ముంబైలో మోదీ భేటీ

Updated Date - Feb 18 , 2026 | 07:08 AM