Share News

వరుస పేపర్ లీక్‌లపై రాహుల్ గాంధీ తీవ్ర విమర్శలు.. ఛాత్రోన్ కీ గూంజ్‌కి పిలుపు..

ABN , Publish Date - Jul 13 , 2026 | 04:39 PM

భారత విద్యా వ్యవస్థపై లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడు, ఎంపీ రాహుల్ గాంధీ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. దేశ విద్యా వ్యవస్థ ప్రస్తుతం నిజాయతీ లేని దోపిడీ యంత్రాంగంగా మారిందని ఆరోపించారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదిక ఎక్స్‌లో ఎంపీ రాహుల్ గాంధీ పోస్టు పెట్టారు.

వరుస పేపర్ లీక్‌లపై రాహుల్ గాంధీ తీవ్ర విమర్శలు.. ఛాత్రోన్ కీ గూంజ్‌కి పిలుపు..
MP Rahul Gandhi

న్యూఢిల్లీ: భారత విద్యా వ్యవస్థపై లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడు, ఎంపీ రాహుల్ గాంధీ ఇవాళ (సోమవారం) తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. దేశ విద్యా వ్యవస్థ ప్రస్తుతం నిజాయతీ లేని దోపిడీ యంత్రాంగంగా మారిందని ఆయన ఆరోపించారు. వరుసగా జరుగుతున్న ప్రశ్నపత్రాల లీకులు, అవినీతిపై కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వం, కేంద్ర విద్యాశాఖ మంత్రి మౌనం వహిస్తున్నారని మండిపడ్డారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదిక ఎక్స్‌లో ఎంపీ రాహుల్ గాంధీ పోస్టు పెట్టారు.


ఈ సందర్భంగా అవినీతి, అన్యాయం, పక్షపాతం, నిజాయితీ లేని వ్యవస్థ అనే పదాలు తనవి కాదని రాహుల్ అన్నారు. అవి భారత విద్యా వ్యవస్థ గురించి విద్యార్థులు వ్యక్తం చేస్తున్న అభిప్రాయాలని పేర్కొన్నారు. విద్యార్థులను భవిష్యత్తుకు సిద్ధం చేయాల్సిన వ్యవస్థ.. వారిని, వారి కుటుంబాలను అప్పులు, మానసిక ఒత్తిడి, నిరాశల వైపు నెడుతోందని ఆయన ఆరోపించారు. దేశంలో కొనసాగుతున్న అవినీతే పేపర్ లీక్ మాఫియాకు కారణమైందని రాహుల్ విమర్శించారు. పోటీ పరీక్షల కోసం సంవత్సరాల తరబడి కష్టపడిన లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తును ఈ మాఫియా ఒక్కసారిగా నాశనం చేస్తోందని ధ్వజమెత్తారు. వీటన్నింటినీ చూస్తున్న ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర విద్యాశాఖ మంత్రి మౌనం వహిస్తున్నారని విమర్శించారు. జవాబుదారీతనం నుంచి తప్పించుకోవడానికే ఈ అంశంపై కేంద్రం ముఖం చాటేస్తోందన్నారు. అలాగే దీనిని ప్రశ్నించాల్సిన మీడియా కూడా దీర్ఘకాలంగా మౌనంగా ఉందని ఎంపీ పేర్కొన్నారు.


దేశ విద్యా రంగంలో విప్లవం అవసరమని రాహుల్ గాంధీ అభిప్రాయపడ్డారు. కాంగ్రెస్ చేపట్టిన 'ఛాత్రోన్ కీ గూంజ్' కార్యక్రమంలో విద్యార్థులంతా పాల్గొనాలని ఆయన పిలుపునిచ్చారు. జులై 17న డెహ్రాడూన్‌లో నిర్వహించనున్న కార్యక్రమానికి హాజరై విద్యార్థుల గొంతుకను మరింత బలంగా వినిపిద్దామని అన్నారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా ఛాత్రోన్ కీ గూంజ్ రిజిస్ట్రేషన్‌కి సంబంధించిన లింక్‌ను ఎంపీ రాహుల్ గాంధీ తన పోస్టులో షేర్ చేశారు.


ఈ వార్తలు కూడా చదవండి...

దేవాలయాల అభివృద్ధిపై సీఎం ప్రత్యేక దృష్టి సారించారు: మంత్రి కొండా సురేఖ

హైదరాబాద్‌లో ఈగల్ ఫోర్స్ మెగా ఆపరేషన్..

Updated Date - Jul 13 , 2026 | 05:19 PM