గ్యాస్ కొరతతో దేశం అల్లాడుతోంది: రాహుల్ గాంధీ
ABN , Publish Date - Mar 12 , 2026 | 05:30 PM
ఇరాన్, అమెరికా - ఇజ్రాయిల్ యుద్ధం నేపథ్యంలో గ్యాస్ కొరతతో భారతదేశం అల్లాడుతోందని లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఆవేదన వ్యక్తం చేశారు. దేశంలో ప్రస్తుత పరిస్థితికి మోదీ ప్రభుత్వమే కారణమని ఆయన విమర్శించారు.
న్యూఢిల్లీ, మార్చి 12: ఇరాన్, అమెరికా - ఇజ్రాయిల్ యుద్ధం నేపథ్యంలో గ్యాస్ కొరతతో భారతదేశం అల్లాడుతోందని లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఆవేదన వ్యక్తం చేశారు. దేశంలో ప్రస్తుత పరిస్థితికి మోదీ ప్రభుత్వమే కారణమని ఆయన విమర్శించారు. గురువారం లోక్‌సభలో దేశంలో వంట గ్యాస్ కొరతపై రాహుల్ గాంధీ ప్రసంగించారు. పశ్చిమాసియాలో యుద్ధం జరుగుతుందన్నారు. అమెరికా - ఇజ్రాయిల్, ఇరాన్ యుద్ధంలో ఉన్నాయని పేర్కొన్నారు. ప్రపంచ దేశాలకు 20 శాతం చమురు హార్ముజ్ జల సంధి నుంచి వస్తుందని వివరించారు. ప్రస్తుతం ఆ జల సంధిని మూసివేశారని పేర్కొన్నారు.
గ్యాస్ కొరత కారణంగా దేశవ్యాప్తంగా రెస్టారెంట్లు మూతపడ్డాయని చెప్పారు. ఎల్పీజీ గ్యాస్ కొరత నేపథ్యంలో ప్రజలు భయాందోళనలో ఉన్నారన్నారు. దేశానికి పునాది ఇంధన భద్రత అని అభివర్ణించారు. భారత్ వ్యవహారాలను అమెరికా శాసిస్తోందని మండిపడ్డారు. రష్యా ఆయిల్‌ను కొనడానికి ఎవరి అనుమతి కావాలి? అంటూ ప్రభుత్వాన్ని ఆయన సూటిగా ప్రశ్నించారు. యూఎస్ అనుమతి లేకుంటే ముడి చమురు కొనుగోలు చేయ్యారా? అంటూ వ్యంగ్యంగా కేంద్రాన్ని నిలదీశారు.
భారత్ వంటి పెద్ద దేశానికి మరో దేశం అనుమతి అవసరమా? అంటూ సందేహం వ్యక్తం చేశారు. తన ప్రశ్నకు సమాధానం ఎప్‌స్టీన్ ఫైల్స్ రూపంలో దొరికిందన్నారు. ఎప్‌స్టీన్‌తో పరిచయం ఉందని పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ చెప్పారని ఈ సందర్భంగా ఎంపీ రాహుల్ గాంధీ గుర్తు చేశారు.
పెట్రోలియం మంత్రికి ఎప్‌స్టీన్‌తో సంబంధాలున్నాయని ఆరోపించారు. ఈ వ్యాఖ్యలు చేసిన వెంటనే రాహుల్ మైక్‌ను స్పీకర్ ఓం బిర్లా కట్ చేశారు. అంతలో సభలోని హర్దీప్ సింగ్ స్పందిస్తూ.. రాహుల్ గాంధీ వ్యాఖ్యలపై అభ్యంతరం వ్యక్తం చేశారు. హర్దీప్‌సింగ్ ప్రసంగాన్ని విపక్షాలు అడ్డుకున్నాయి. అంతే కాకుండా ఎప్‌స్టీన్ అంటూ సభలో విపక్ష పార్టీల సభ్యులు బిగ్గరగా నినాదాలు చేశారు. అనంతరం సభను వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ ఓం బిర్లా ప్రకటించారు.