Share News

రాహుల్ గాంధీకి బీజేపీ కౌంటర్.. పాత లండన్ వీడియోతో ఎదురుదాడి!

ABN , Publish Date - Nov 03 , 2026 | 12:31 PM

ప్రధాని నరేంద్ర మోదీ విదేశీ సహకారంతోనే అధికారంలోకి వచ్చారని, ఇప్పటికీ అదే మద్దతుతో పదవిలో కొనసాగుతున్నారని కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ చేసిన ఆరోపణలు రాజకీయంగా దుమారం రేపుతున్నాయి.

రాహుల్ గాంధీకి బీజేపీ కౌంటర్.. పాత లండన్ వీడియోతో ఎదురుదాడి!
Rahul Gandhi

ఇంటర్నెట్ డెస్క్: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 'విదేశీ సహాయం వల్లే' అధికారంలోకి వచ్చారని, పదవిలో కొనసాగుతున్నారని కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ ఆరోపించిన తర్వాత, బీజేపీ ఆయనపై తీవ్రంగా ఎదురుదాడికి దిగింది. బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి సి.ఆర్. కేశవన్ సోషల్ మీడియా వేదిక Xలో రాహుల్ గాంధీపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. రాహుల్ తప్పుడు, తప్పుదారి పట్టించే ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. 2023లో లండన్ పర్యటన సందర్భంగా రాహుల్ చేసిన ప్రసంగాన్ని ప్రస్తావిస్తూ.. ‘ఇది కేవలం భారత పోరాటం కాదు’ అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు విదేశీ జోక్యాన్ని కోరుతున్నట్లుగా ఉన్నాయని ఆరోపించారు. రాహుల్ గాంధీ ఒక మోసగాడని.. ఆయన అబద్ధాలు చివరకు ఆయనకే ఎదురుదెబ్బ తగిలేలా చేస్తున్నాయని కేశవన్ తీవ్రంగా విమర్శించారు.


అలాగే.. కాంగ్రెస్ అగ్ర నాయకత్వానికి అంతర్జాతీయ సంస్థలు.. విదేశీ వ్యక్తులతో ఉన్న సంబంధాలపైనా బీజేపీ ప్రశ్నలు సంధించింది. ఫోరమ్ ఆఫ్ డెమోక్రటిక్ లీడర్స్ ఇన్ ది ఆసియా-పసిఫిక్ (FDL-AP) సంస్థతో సోనియా గాంధీకి సంబంధాలున్నాయని, ఆ సంస్థకు జార్జ్ సోరోస్ ఫౌండేషన్ నుంచి నిధులు అందాయని కేశవన్ ఆరోపించారు. అలాగే హిండెన్‌బర్గ్ రీసెర్చ్ నివేదికలు.. జర్మన్ విద్యావేత్త కార్నెలియా వోల్‌తో రాహుల్‌కు ఉన్న పరిచయాలను ప్రస్తావించారు. ఈ సంబంధాలపై కాంగ్రెస్ ఎందుకు స్పష్టత ఇవ్వడం లేదని ప్రశ్నించారు.

ఇదే సమయంలో రాహుల్ గాంధీ తరచుగా విదేశీ పర్యటనలకు వెళ్లడంపైనా బీజేపీ విమర్శలు గుప్పించింది. లోక్‌సభలో ప్రతిపక్ష నేతగా కీలక రాజ్యాంగబద్ధమైన బాధ్యతలు నిర్వహిస్తున్న వ్యక్తి తన విదేశీ పర్యటనల వివరాల విషయంలో పారదర్శకంగా ఉండాలని కేశవన్ అన్నారు. ఆయన విదేశాల్లో ఎవరిని కలుస్తున్నారు? ఆ సమావేశాల వెనుక ఉద్దేశం ఏమిటి? అన్న విషయాలను దేశ ప్రజలకు తెలియజేయాలని డిమాండ్ చేశారు. మొత్తానికి ప్రధాని మోదీపై రాహుల్ చేసిన ఆరోపణలు, వాటికి బీజేపీ ఇచ్చిన కౌంటర్‌తో మరోసారి కాంగ్రెస్, బీజేపీ మధ్య రాజకీయ విమర్శల యుద్ధం తీవ్రస్థాయికి చేరిందని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.


ఇవి కూడా చదవండి..

ఏపీలో మరో నాలుగు రోజులు భారీ వర్షాలు.. 7 జిల్లాలకు అత్యంత భారీ వర్ష సూచన

మద్యం స్కామ్ కేసులో అంబటి రాంబాబుకు ఈడీ నోటీసులు.. రేపు విచారణ

Read Latest AP News And Telugu News

Updated Date - Nov 03 , 2026 | 12:31 PM