Share News

మోదీ నా ఫోన్‌ ట్యాప్‌ చేస్తున్నారు

ABN , Publish Date - Nov 14 , 2026 | 03:15 AM

ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం తన ఫోన్‌ను ట్యాప్‌ చేయిస్తోందని, ఈ విషయం మోదీకి కూడా తెలుసునని విపక్షనేత రాహుల్‌ గాంధీ సంచలన ఆరోపణలు చేశారు.

మోదీ నా ఫోన్‌ ట్యాప్‌ చేస్తున్నారు
Rahul Gandhi

  • ఆయనపై ఆరోపణల తాలూకు ఆధారాలన్నీ నా ఫోన్‌లో ఉన్నాయి

  • రాహుల్‌ గాంధీ సంచలన ఆరోపణలు

  • దేశద్రోహి ఎవరో తేల్చుదాం.. చర్చకు రండి

  • వెంట టెలిప్రాంప్టర్‌ తెచ్చుకోండంటూ ఎద్దేవా

  • సోనియాను బీజేపీ నేతలూ అభిమానిస్తారు

  • ‘ఆత్మకథ’పై భక్తులు ఎంత ఎక్కువ కామెంట్లు చేస్తే అంత మంచిదని వ్యాఖ్య

న్యూఢిల్లీ, నవంబరు 13 (ఆంధ్రజ్యోతి): ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం తన ఫోన్‌ను ట్యాప్‌ చేయిస్తోందని, ఈ విషయం మోదీకి కూడా తెలుసునని విపక్షనేత రాహుల్‌ గాంధీ సంచలన ఆరోపణలు చేశారు. తన చేతుల్లోని ఫోన్‌ను పైకి ఎత్తి చూపుతూ.. మోదీపై ఆరోపణలకు సంబంధించిన అన్ని ఆధారాలూ తన ఫోన్‌లో ఉన్నాయని రాహుల్‌ నొక్కిచెప్పారు. ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా శుక్రవారం నిర్వహించిన ‘ఆస్క్‌ మీ’ ఆన్‌లైన్‌ చర్చాగోష్టి కార్యక్రమంలో, కాంగ్రెస్‌ పార్టీ, తాను ఎక్స్‌లో పోస్టు చేసిన వీడియోల్లో రాహుల్‌ ఈ ఆరోపణలు చేశారు. ఇద్దరిలో ‘‘ఎవరు దేశద్రోహి?’’ అనేది తేల్చేందుకు మోదీ తనతో బహిరంగ చర్చకు రావాలని రాహుల్‌ మరోసారి సవాలు విసిరారు. మోదీ వచ్చి.. ముఖాముఖిగా చర్చిస్తే విదేశీ శక్తుల నియంత్రణలో ఉన్నదెవరు? దేశ వ్యతిరేక కార్యకలాపాల్లో పాలు పంచుకుంటున్నదెవరు? అనేవి తేటతెల్లమవుతాయని వ్యాఖ్యానించారు. ‘‘ప్రధాని మోదీకి ఈ విషయం తెలుసు, ఎందుకంటే ఆయనే నా ఫోన్‌ను ట్యాప్‌ చేయించారు’’ అని ఆరోపించారు.


rahul2.jpgతనతో మోదీ ముఖాముఖి చర్చిస్తే ఆయన ప్రధాని పదవిలో కొనసాగలేరని, ఆయన రాజకీయ జీవితం ముగిసిపోతుందని.. ఈ విషయం మోదీకి కూడా తెలుసునని వ్యాఖ్యానించారు. మోదీతో తన బహిరంగ చర్చకు న్యాయనిర్ణేతలుగా అదానీ, సంఘ్‌ చీఫ్‌ మోహన్‌ భాగవత్‌ ఉన్నా తనకు అభ్యంతరం లేదని పేర్కొన్నారు. మోదీ మునుపటిలాగా తనపై కామెంట్లు చేయకపోవచ్చునని, ఎందుకంటే ఆయన తీవ్ర ఒత్తిడిలో, భయంలో ఉన్నారని.. జాగ్రత్తగా మాట్లాడుతున్నారని పేర్కొన్నారు. ‘‘మీ సొంత గోదీ మీడియా నిర్వహించిన దీపావళి సమ్మేళంలోనూ మీరు టెలిప్రాంప్టర్‌ ద్వారానే మాట్లాడారు. అది మీ వేదికే.. అక్కడ ఉన్నదీ మీ జనమే.. అయినా మీకు మాట్లాడేందుకు స్ర్కిప్ట్‌ అవసరపడింది. మిమ్మల్ని ఒత్తిడి ఆవహించినట్టే అనిపిస్తోంది’’ అని మోదీని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. ముఖాముఖి చర్చ కోసం మోదీ తన వెంట టెలిప్రాంప్టర్‌ తెచ్చుకోవొచ్చునంటూ ఎద్దేవా చేశారు. మోదీ తనతో బహిరంగ చర్చకు రావాలంటూ రాహుల్‌ సవాలు చేయడం గత 12 రోజుల్లో ఇది ఏడోసారి. ‘ఆస్క్‌ మీ’ కార్యక్రమం సందర్భంగా సోనియా ఆత్మకథ ’బిలాంగింగ్‌: ఎ లవ్‌ ఆఫ్‌ జర్నీ’పై బీజేపీ నేతలు విమర్శలు చేస్తున్నారు కదా? అని ప్రశ్నించగా.. ‘‘భక్తులు ఈ పుస్తకంపై ఎంత ఎక్కువగా కామెంట్లు చేస్తే అంత మంచిది’’ అని రాహుల్‌ వ్యాఖ్యానించారు. బీజేపీ నేతల్లో ఎంతోమంది సోనియా గాంధీని అభిమానిస్తారని.. దురదృష్టవశాత్తు పైకి చెప్పలేరని పేర్కొన్నారు. ‘..ఎ లవ్‌ ఆఫ్‌ జర్నీ’ గొప్ప పుస్తకం అని, బీజేపీ నేతలు ఈ పుస్తకాన్ని చదువుతున్నారని చెప్పారు. కాగా మోదీపై రాహుల్‌ ఫోన్‌ ట్యాపింగ్‌ ఆరోపణలను బీజేపీ ఖండించింది. రాహుల్‌కు అబద్ధాలు చెప్పడం అలవాటుగా మారిందని.. రోజూ ఏదో ఒక అబద్ధమాడనిదే ఆయన ఉండలేరని బీజేపీ అధికార ప్రతినిధి తుహిన్‌ సిన్హా విమర్శించారు. ఇక మోదీకి రాహుల్‌ విసిరిన బహిరంగ చర్చ సవాలును బీజేపీ తిరస్కరించింది. పార్లమెంట్‌ లో జరగనున్న చర్చ నుంచి రాహుల్‌ తప్పించుకోవాలనుకుంటున్నారని కేంద్రమంత్రి నిర్మల సీతారామన్‌ ఆరోపించారు. చర్చలకు వేదికగా పార్లమెంటు ఉండనే ఉందని.. లోక్‌సభలో రాహుల్‌ గాంధీ ప్రవర్తన హుందాగా ఉండాలని పేర్కొన్నారు.

ఇవి కూాడా చదవండి..

విచిత్రం: ఓవర్ స్పీడ్‌కు చలానా.. లొకేషన్ మాత్రం అట్లాంటిక్ మహాసముద్రం!

అస్సాంలో ఘోర ప్రమాదం.. మినీబస్సు, కంటైనర్ ట్రక్కు ఢీకొని పలువురి మృతి

Updated Date - Nov 14 , 2026 | 03:28 AM