Share News

మోదీ - పుతిన్ ద్వైపాక్షిక సమావేశం ప్రారంభం

ABN , Publish Date - Sep 11 , 2026 | 04:39 PM

బ్రిక్స్ సమావేశాల్లో పాల్గొనేందుకు భారత్‌కు వచ్చిన రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భారత ప్రధాని నరేంద్ర మోదీతో తాజాగా సమావేశమయ్యారు.

మోదీ - పుతిన్ ద్వైపాక్షిక సమావేశం ప్రారంభం
PM Modi - Putin Meet

ఇంటర్నెట్ డెస్క్: బ్రిక్స్ సమావేశాల్లో పాల్గొనేందుకు భారత్‌కు వచ్చిన రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భారత ప్రధాని నరేంద్ర మోదీతో తాజాగా సమావేశమయ్యారు. ద్వైపాక్షిక వాణిజ్యం, పెట్టుబడులు, ఇంధన రంగంలో సహకారం తదితర అంశాలపై ఇరు దేశాధినేతలు చర్చించనున్నారు. గతేడాది డిసెంబర్‌లో భారత్-రష్యా శిఖరాగ్ర సమావేశం సందర్భంగా రష్యా అధ్యక్షుడు ప్రధాని మోదీతో సమావేశమైన విషయం తెలిసిందే. ఇక రష్యాకు చెందిన పలువురు ఉన్నతాధికారులు తాజా సమావేశానికి హాజరయ్యారు.


ద్వైపాక్షిక సంబంధాలు, అంతర్జాతీయ అంశాలపై అధ్యక్షుడు పుతిన్ ప్రధాని మోదీతో చర్చించనున్నారని రష్యా అధ్యక్ష కార్యాలయం క్రెమ్లిన్ ప్రతినిధి అంతకుముందు మీడియా ప్రతినిధులతో చెప్పారు. ఉక్రెయిన్‌తో ఘర్షణల గురించి కూడా అధ్యక్షుడు పుతిన్ ప్రధాని మోదీతో చర్చించనున్నారని తెలిపారు. ఈ చర్చల్లో రక్షణ రంగంలో సహకారం ప్రధానాంశం కానుందని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఈ సందర్భంగా ఇరు దేశాలు సంయుక్తంగా చేపట్టిన డిఫెన్స్ ప్రాజెక్టులు చర్చకు రానున్నాయి.


ఈ ఏడాదికి బ్రిక్స్ కూటమికి ఛైర్‌గా భారత్ వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో బ్రిక్స్ సమావేశాలకు ఆతిథ్య దేశంగా వ్యవహరిస్తోంది. ఈ నెల 12-13 తేదీల్లో న్యూఢిల్లీ వేదికగా ఈ సమావేశాలు జరగనున్నాయి. కూటమి దేశాల మధ్య సహకారం మరింత పెంపొందించేందుకు బ్రిక్స్ దేశాల నేతలు ఈ సందర్భంగా చర్చించనున్నారు. అంతర్జాతీయ, ప్రాంతీయ అంశాలపై ఉమ్మడి ప్రాధాన్యాలు ఎజెండాగా సమావేశాలు జరుగుతాయని భారత విదేశాంగ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది.


ఈ వార్తలనూ చదవండి:

ఉగ్రవాదంపై నిరంతరం పోరాడుతున్నాం: ప్రధాని మోదీ

ఏడేళ్ల తరువాత భారత్‌కు చైనా అధినేత.. ఇరు దేశాల మైత్రి బలపడనుందా.?

Updated Date - Sep 11 , 2026 | 05:06 PM