పరుపు కింద డ్రగ్స్ పెట్టి.. కెమెరాకు చిక్కి!
ABN , Publish Date - Nov 03 , 2026 | 06:07 AM
డ్రగ్స్ కేసులో శివసేన నేతను ఇరికిద్దామని పంజాబ్ పోలీసులు వేసిన ఎత్తు రహస్య కెమెరాతో చిత్తయింది.
పంజాబ్ శివసేన నేత ఇంట్లో పోలీసుల నిర్వాకం
సోదాకు ముందు ప్యాకెట్ పెట్టిన ఏఎ్‌సఐ
30 గ్రాముల హెరాయిన్ ‘దొరికిందని’ నేత అరెస్టు
చండీగఢ్, నవంబరు 2: డ్రగ్స్ కేసులో శివసేన నేతను ఇరికిద్దామని పంజాబ్ పోలీసులు వేసిన ఎత్తు రహస్య కెమెరాతో చిత్తయింది. ఆయన ఇంట్లో సోదాకు కొద్దిసేపటి ముందు సివిల్ దుస్తుల్లో ఇంట్లోకి వెళ్లిన ఓ ఏఎస్ఐ పరుపు కింద ప్యాకెట్ పెడుతున్న దృశ్యాలు ఇంట్లోని రహస్య కెమెరాలో రికార్డయ్యాయి. కాసేపటికే వచ్చిన పోలీసు బృందం సరిగ్గా అదే పరుపు కింద 30 గ్రాముల హెరాయిన్ దొరికిందంటూ నేతను అరెస్టు చేసింది. వీడియో బయటకు రావడంతో ఉన్నతాధికారులు తప్పనిసరై ఏఎఎస్ఐ సుఖ్‌దేవ్ సింగ్‌ను సస్పెండ్ చేశారు. అరెస్టయిన శివసేన నేత మహంత్ కశ్మీర్ గిరిని కేసు నుంచి తప్పించారు. తొలుత గిరి డ్రైవర్‌ను 7.5 గ్రాముల హెరాయిన్‌తో అరెస్టు చేశామని, అతడి విచారణలో గిరి పేరు బయట పడిందని పోలీసులు చెప్పారు. శనివారం మధ్యాహ్నం గిరి ఇంటికి సీఐఏ విభాగం ఏఎ్‌సఐ సుఖ్‌దేవ్ ఒంటరిగా వచ్చి ఓ గదిలోకి వెళ్లి పరుపు కింద ఏదో పెట్టి వెళ్లిపోయారు. తర్వాత స్థానిక ఇన్‌స్పెక్టర్, మరికొందరు అధికారులు సోదాకు వచ్చారు. నేరుగా ఏఎ్‌సఐ పరుపు కింద దాచిన చోటే హెరాయిన్ దొరికిందని ప్రకటించారు. ఆ తర్వాత కుటుంబం బయటపెట్టిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. పోలీసు అధికారులు స్పందించక తప్పలేదు. ఉన్నతాధికారుల ఆదేశం మేరకు ఎస్పీ నేతృత్వంలో సిట్ ఏర్పాటైంది. ఏఎస్ఐ డ్రగ్స్ ఎక్కడి నుంచి తెచ్చారో తేలుస్తామని సీనియర్ ఎస్పీ అన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
లైంగిక వేధింపుల కేసు.. జేఎన్‌యూ ప్రొఫెసర్ తొలగింపుపై స్టే
ఢిల్లీలో గ్రీన్ క్రాకర్స్ కాల్చేందుకు సుప్రీంకోర్టు అనుమతి