పంజాబ్ రైతుకు జాక్‌పాట్.. రూ.500 పెట్టి టికెట్ కొంటే రూ.12 కోట్ల లాటరీ..
ABN , Publish Date - Nov 18 , 2026 | 10:00 AM
అదృష్టం ఎప్పుడు ఎవరిని వరిస్తుందో చెప్పలేం. ఎన్నో ఏళ్ల పాటు సహనంతో ఎదురు చూసిన పంజాబ్‌కు చెందిన ఓ రైతు జాక్‌పాట్ కొట్టాడు. గత 15 ఏళ్లుగా లాటరీ టికెట్లు కొనుగోలు చేస్తున్న అతడిని ఎట్టకేలకు అదృష్టం వరించింది.
ఇంటర్నెట్ డెస్క్: అదృష్టం ఎప్పుడు ఎవరిని వరిస్తుందో చెప్పలేం. ఎన్నో ఏళ్ల పాటు సహనంతో ఎదురు చూసిన పంజాబ్‌కు చెందిన ఓ రైతు జాక్‌పాట్ కొట్టాడు. గత 15 ఏళ్లుగా లాటరీ టికెట్లు కొనుగోలు చేస్తున్న అతడిని ఎట్టకేలకు అదృష్టం వరించింది. రూ.500 పెట్టి కొనుగోలు చేసిన టికెట్‌తో ఏకంగా రూ.12 కోట్ల లాటరీని గెలుచుకున్నాడు. దీంతో అతడి కుటుంబంలో ఆనందం వెల్లివిరిసింది (Punjab Diwali Bumper Lottery).
పంజాబ్‌లోని మొహాలీ జిల్లా హమాయున్‌పూర్ గ్రామానికి చెందిన 45 ఏళ్ల బల్జిందర్ సింగ్ ఈ భారీ బహుమతిని గెలుచుకున్నాడు. అతడు వ్యవసాయం చేస్తూనే ట్రక్కు డ్రైవర్‌గా కూడా పనిచేస్తున్నాడు. అతడికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. బల్జిందర్ సింగ్ 2010 నుంచి క్రమం తప్పకుండా లాటరీ టికెట్లు కొనుగోలు చేస్తున్నాడు. ఇన్నేళ్లుగా కొంటున్నా ఎప్పుడూ బహుమతి రాలేదు. అయితే ఈసారి మాత్రం అతడి నిరీక్షణకు తెరపడింది. దీపావళికి ముందు హండేస్రాలోని ఓ లాటరీ విక్రేత వద్ద బల్జిందర్ సింగ్ రూ.500 పెట్టి టికెట్ కొనుగోలు చేశాడు (Rs 12 Crore Lottery Winner).
నవంబరు 16న నిర్వహించిన పంజాబ్ స్టేట్ డియర్ దీపావళి బంపర్ లాటరీ డ్రాలో అతడికి మొదటి బహుమతి దక్కింది (Punjab Lottery News). ఆ వార్త విన్న వెంటనే అతడి కుటుంబ సభ్యులు ఆనందంలో మునిగిపోయారు. ఎట్టకేలకు దేవుడు తన ప్రార్థనలు విన్నాడని బల్జిందర్ చెప్పాడు. తన కుటుంబ సభ్యులకు కూడా చెప్పకుండా దాదాపు పదిహేనేళ్లుగా లాటరీ టికెట్లు కొంటున్నానని చెప్పాడు. ఈ లాటరీ డబ్బులతో తన పిల్లలను బాగా చదివిస్తానని బల్జిందర్ పేర్కొన్నాడు. లాటరీ గెలిచిన విషయం గ్రామంలో తెలియడంతో స్థానికులు అతడి ఇంటికి చేరుకుని అభినందనలు తెలిపారు.
ఇవి కూడా చదవండి..
కశ్మీర్‌లో మళ్లీ ఎన్‌కౌంటర్.. ఉగ్రవాదులు, భద్రతా బలగాల మధ్య ఎదురుకాల్పులు..
స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు.. ఈ రోజు మీ నగరంలో ఎలా ఉన్నాయంటే..