ప్రధాని మోదీపై దాడి చేసేలా విపక్ష సభ్యులు వ్యవహరించారు: ఓం బిర్లా
ABN , Publish Date - Feb 05 , 2026 | 04:11 PM
లోక్‌సభలో వాయిదాల పర్వం కొనసాగుతోంది. గురువారం ఈ సభ ప్రారంభమైన కొద్ది సేపటికే పలుమార్లు వాయిదా పడింది. చివరకు శుక్రవారానికి సభను వాయిదా వేశారు. ఇక రాజ్యసభకు ప్రధాని మోదీ ఈరోజు సాయంత్రం హాజరుకానున్నారు.
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 05: రాష్ట్రపతి ద్రౌపది ముర్ము బడ్జెట్ ప్రసంగంపై ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై ప్రధాని నరేంద్ర మోదీ ఇవాళ (గురువారం) రాజ్యసభలో ప్రసంగించనున్నారు. ఈ రోజు సాయంత్రం 5 గంటలకు రాజ్యసభలో ప్రధాని మోదీ ప్రసంగించనున్నారు. అలాగే భారత్, అమెరికా వాణిజ్య ఒప్పందంపైనా ఆయన ఈ ప్రసంగంలో పలు కీలక అంశాలపై స్పష్టతనిచ్చే అవకాశం కనిపిస్తోంది. ఇక ప్రధాని మోదీ ప్రసంగం లేకుండానే రాష్ట్రపతి ప్రసంగంపై ధన్యవాదాలు తెలిపే తీర్మానాన్ని లోక్‌సభలో గురువారం ఆమోదించారు.
మరోవైపు బుధవారం లోక్‌సభలో చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో స్పీకర్ ఓం బిర్లా కీలక వ్యాఖ్యలు చేశారు. ఈరోజు లోక్‌సభలో ప్రధాని మోదీపై దాడి చేసేలా విపక్ష సభ్యులు వ్యవహరించే అవకాశం ఉందని తెలిపారు. అందుకే సభకు రావొద్దని ప్రధాని మోదీకి తాను సూచించినట్లు చెప్పుకొచ్చారు. పార్లమెంట్ చరిత్రలో ఎప్పుడూ ఇలాంటి ఘటన జరగలేదన్నారు. సభా మర్యాదను విపక్ష సభ్యులు మంటగలిపారంటూ స్పీకర్ ఓం బిర్లా మండిపడ్డారు. తనకు అందిన సమాచారంతోనే ప్రధాని భద్రత కోసం తాను ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.
ఇక లడాఖ్ ఘర్షణపై భారత సైన్యం మాజీ చీఫ్ నరవణె రాసిన పుస్తకంలోని అంశాలను ఇటీవల లోక్‌సభలో రాహుల్ గాంధీ ప్రస్తావించారు. దీనిపై బీజేపీ సభ్యులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ అంశంపై సభలో చర్చ జరగాలంటూ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ పట్టుబట్టారు. రాహుల్ నిర్ణయానికి మద్దతు ఇస్తూ 8 మంది ఎంపీలు స్పీకర్ కుర్చీ వద్దకు వెళ్లి ఆందోళన చేపట్టారు. కాగితాలను చింపి... స్పీకర్ ఓం బిర్లాపై విసిరారు. దాంతో వారిపై సస్పెన్షన్ వేటు వేశారు. ఈ బడ్జెట్ సమావేశాల వరకు వారు హాజరు కాకుండా స్పీకర్ ఈ నిర్ణయం తీసుకున్నారు.
బుధవారం లోక్‌సభలో విపక్ష సభ్యుల నిరసనల కారణంగా సభ పలుమార్లు వాయిదా పడింది. ప్రధాని మోదీ సాయంత్రం లోక్‌సభలో బడ్జెట్ ప్రసంగంపై రాష్ట్రపతికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై ప్రసంగిస్తారని అంతా భావించారు. కానీ విపక్షాల నిరసనతో సభ గురువారానికి వాయిదా పడింది. ఈ రోజు సైతం విపక్ష సభ్యుల తీరులో ఏ మాత్రం మార్పు లేకపోవడంతో.. పలుమార్లు లోక్‌సభ వాయిదా పడింది. దాంతో మోదీ ప్రసంగం లేకుండానే తీర్మానాన్ని ఆమోదించారు.
ఈ వార్తలు కూడా చదవండి:
ట్రేడ్ డీల్.. త్వరలో భారత్, యూఎస్ సంయుక్త ప్రకటన!
ఖర్గే, నడ్డా మధ్య వాగ్వాదం.. రాజ్యసభలో హోరాహోరీ..