Share News

మణిపూర్‌లో రాష్ట్రపతి పాలన రద్దు.. బీజేపీ ప్రభుత్వ ఏర్పాటుకు లైన్ క్లియర్..

ABN , Publish Date - Feb 04 , 2026 | 04:05 PM

మణిపూర్‌లో రాష్ట్రపతి పాలన ఎత్తివేస్తూ దేశ ప్రథమ పౌరురాలు ద్రౌపది ముర్ము ఉత్తర్వులు జారీ చేశారు. 2025 ఫిబ్రవరి 13న మణిపూర్‌లో రాష్ట్రపతి పాలన విధిస్తూ తాను జారీ చేసిన ఆదేశాలను రద్దు చేశారు.

మణిపూర్‌లో రాష్ట్రపతి పాలన రద్దు.. బీజేపీ ప్రభుత్వ ఏర్పాటుకు లైన్ క్లియర్..
Droupadi Murmu

న్యూఢిల్లీ: మణిపూర్‌లో రాష్ట్రపతి పాలనను రద్దు చేశారు. ఈ మేరకు రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము బుధవారం నాడు ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో ఆ రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటుకు మార్గం సుగమమైంది. రాజ్యాంగంలోని 356వ అధికరణలోని క్లాజ్ (2) ద్వారా తనకు సంక్రమించిన అధికారాలతో 2025 ఫిబ్రవరి 13న మణిపూర్‌లో రాష్ట్రపతి పాలన విధిస్తూ జారీ చేసిన ఆదేశాలను రద్దు చేస్తున్నట్టు రాష్ట్రపతి ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. 2026 ఫిబ్రవరి 4వ తేదీ నుంచి తక్షణమే ఈ ఆదేశాలు అమల్లోకి వచ్చినట్టు తెలిపారు.


జాతుల మధ్య ఘర్షణలతో మణిపూర్‌ అట్టుడకడంతో ముఖ్యమంత్రి బీరేన్ సింగ్ గతేడాది రాజీనామా చేశారు. దీంతో తొలుత 6 నెలలపాటు అక్కడ రాష్ట్రపతి పాలన విధించి మరోసారి దానిని పొడిగించారు. ఈ క్రమంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటుకు కేంద్రం చేపట్టిన సన్నాహకాల్లో భాగంగా బీజేపీ రాష్ట్ర శాసనసభా పక్ష నేతగా యుమునాం ఖేమ్‌చంద్ సింగ్‌ను ఆ పార్టీ ఎమ్మెల్యేలు మంగళవారం నాడు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. దీంతో 62 ఏళ్ల ఖేమ్‌చంద్.. మణిపూర్ కొత్త ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి.


కొత్త సీఎం వివరాలివే..

మణిపూర్ రాజకీయాల్లో బీజేపీ కీలక నేతగా ఖేమ్‌చంద్ పేరు తెచ్చుకున్నారు. 2017, 2022 అసెంబ్లీ ఎన్నికల్లో ఇంఫాల్ వెస్ట్‌లోని సింజమీ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2017 మార్చి నుంచి 2022 మార్చి వరకూ మణిపూర్ అసెంబ్లీ స్పీకర్‌గా పనిచేశారు. 2022 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ మెజారిటీ సాధించడంతో బీరేన్ సింగ్ ప్రభుత్వంలో రెండోసారి క్యాబినెట్ మంత్రిగా సింగ్ నియమితులయ్యారు. మున్సిపల్ పాలనా వ్యవహారాలు, హౌసింగ్ డెవలప్‌మెంట్, గ్రామీణాభివృద్ధి, పంచాయతీ రాజ్, విద్యా శాఖలను నిర్వహించారు. 2025 ఫిబ్రవరిలో మణిపూర్‌లో రాష్ట్రపతి పాలన విధించేంత వరకూ ఆ పదవులను ఆయన సమర్ధవంతంగా నిర్వహించారు.


ఇవి కూడా చదవండి..

మిత్ర ద్రోహి.. దేశ ద్రోహి.. పార్లమెంట్ వెలుపల రాహుల్ గాంధీ, బీజేపీ ఎంపీ మధ్య వాగ్వాదం..

జమ్మూకశ్మీర్‌లో ఎన్‌కౌంటర్‌.. ఇద్దరు జైషే ఉగ్రవాదుల హతం..

Updated Date - Feb 04 , 2026 | 05:55 PM