చట్టాలు పాటించకపోతేదేశం విడిచి వెళ్లిపోండి!
ABN , Publish Date - Feb 04 , 2026 | 03:08 AM
గోప్యతా చట్టం విషయంలో రాజీ పడేదే లేదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. వాట్సాప్ మాతృసంస్థ, టెక్ దిగ్గజం.. ‘మెటా’పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన న్యాయస్థానం..
వాట్సాప్ మాతృ సంస్థ ‘మెటా’కు తేల్చి చెప్పిన సుప్రీంకోర్టు సీజే
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 3: గోప్యతా చట్టం విషయంలో రాజీ పడేదే లేదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. వాట్సాప్ మాతృసంస్థ, టెక్ దిగ్గజం.. ‘మెటా’పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన న్యాయస్థానం.. భారత దేశ చట్టాలను పాటించలేకపోతే.. దేశం విడిచి వెళ్లిపోవచ్చని తేల్చిచెప్పింది. గోప్యతా చట్టంతో ఆడుకోలేరని.. డేటాలోని ఒక్క అంకెను కూడా పంచుకునేందుకు అనుమతించేదిలేదని కుండబద్దలు కొట్టింది. ఈ మేరకు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం అమెరికా సంస్థ మెటాకు స్పష్టం చేసింది. ‘‘ప్రజల గోప్యతతో మీరు ఆడుకోలేరు. మా డేటాలోని ఒక్క అంకెనూ మీతో పంచుకునేందుకు అనుమతించం’’ అని సీజేఐ తేల్చిచెప్పారు. దేశ ప్రజల డేటాను దోపిడీ చేస్తామంటే సమర్థించలేమని స్పష్టం చేశారు. 2021నాటి వాట్సాప్ కొత్త ప్రైవసీ పాలసీని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్‌పై ధర్మాసనం మంగళవారం విచారించింది. ఈ సందర్భంగా గతంలో కాంపిటిషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) విధించిన రూ.213 కోట్ల జరిమానాను సమర్థించింది. విచారణ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా స్పందిస్తూ.. వాణిజ్య ప్రయోజనాల కోసం వినియోగదారుల డేటాను పంచుకునేందుకు వాట్సాప్ దోపిడీవిధానాన్ని అనుసరిస్తోందని తెలిపారు. సీజేఐ స్పందిస్తూ.. ‘‘మీరు (మెటా) మా రాజ్యాంగాన్ని అనుసరించలేకపోతే దేశం విడి చి వెళ్లిపోవచ్చు. పౌరుల సమాచారాన్ని పంచుకునే విషయంలో మేం రాజీ పడబోం’’అని స్పష్టం చేశారు. ‘‘మీ విధానాలను దేశంలోని లక్షలాది మంది పేదలు, వీధి వ్యాపారులు.. కేవలం ఒక భాష మాత్రమే మాట్లాడగలిగిన వారు ఎలా అర్థం చేసుకుంటారు? కొన్ని సందర్భాల్లో మీ విధానాలు అర్థం చేసుకోవడం మాకే ఇబ్బంది ఉంటోంది’’ అని సీజేఐ ఆగ్రహం వ్యక్తంచేశారు. ‘‘ఎవరికీ అర్థంకాని విధానాలను అనుసరించడం ప్రైవేటు సమాచారాన్ని దొంగిలించేందుకు ఒక మార్గం’’ అన్నారు. ఈ సందర్భంగా సీజేఐ.. తన స్వీయ అనుభవాన్ని వివరించారు. ‘‘వాట్సా్‌పలో ఓ డాక్టర్‌కు సందేశం పంపితే.. ఆయన ప్రిస్ర్కిప్షన్‌లో కొన్ని మందులు సూచించారు. ఆ మరుక్షణం వాటికి సంబంధించి న ప్రకటనలే ఫోన్‌లో కనిపించాయి’’అని తెలిపారు. వాట్సాప్, మెటా తరఫున కోర్టుకు హాజరైన సీనియర్ అడ్వొకేట్లు ముకుల్ రోహత్గీ, అఖిల్ సిబాల్‌లు స్పందిస్తూ.. వాట్సాప్ సందేశాలకు ఎండ్-టు-ఎండ్ గోప్యత ఉంటుందని..ఆయా కంపెనీలు కంటెంట్‌ను చూడలేవన్నారు. సీసీఐ విధించిన రూ.213 కోట్ల జరిమానాను డిపాజిట్ చేసినట్టు చెప్పారు.
ఏంటీ కేసు?
2021 జనవరిలో వాట్సాప్ కొత్త ప్రైవసీ విధానాన్ని తీసుకువచ్చింది. తమ కొత్త పాలసీని అంగీకరించని వారి ఖాతాలను రద్దు చేస్తామని నిరంకుశ ధోరణిని ప్రదర్శించింది. దీంతో అప్పట్లోనే కేంద్రం సదరు పాలసీని నిలిపివేయాలని ఆదేశించింది. ఈ వ్యవహారంపై సీసీఐ విచారణ జరిపింది. ఈ క్రమంలోనే 2024లో రూ.213 కోట్ల జరిమానా విధించింది. ఈ జరిమానాను కంపెనీ లా ట్రైబ్యునల్ కూడా సమర్థించింది. ఈ తీర్పులను మెటా గత ఏడాది జనవరిలో సుప్రీంకోర్టులో సవాల్ చేసింది.