Share News

సీషెల్స్ స్వాతంత్ర్య వేడుకల్లో భారత సైనిక దళాల కవాతు.. లేచి నిలబడిన ప్రధాని మోదీ

ABN , Publish Date - Jun 29 , 2026 | 12:51 PM

భారత్-సీషెల్స్ మధ్య ఉన్న చిరకాల స్నేహబంధానికి అద్దం పట్టేలా సీషెల్స్ 50వ స్వాతంత్ర్య దినోత్సవం ఘనంగా జరుగుతోంది. మూడు రోజుల అధికారిక పర్యటనలో భాగంగా సీషెల్స్‌కు వెళ్లిన ప్రధాని నరేంద్ర మోదీ.. ఆ దేశ జాతీయ దినోత్సవ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు.

సీషెల్స్ స్వాతంత్ర్య వేడుకల్లో భారత సైనిక దళాల కవాతు.. లేచి నిలబడిన ప్రధాని మోదీ
PM Modi Seychelles Tour

విక్టోరియా: భారత్-సీషెల్స్ మధ్య ఉన్న చిరకాల స్నేహబంధానికి అద్దం పట్టేలా సీషెల్స్ 50వ స్వాతంత్ర్య దినోత్సవం ఘనంగా జరుగుతోంది. మూడు రోజుల అధికారిక పర్యటనలో భాగంగా సీషెల్స్‌కు వెళ్లిన ప్రధాని నరేంద్ర మోదీ.. ఆ దేశ జాతీయ దినోత్సవ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ఈ సందర్భంగా నేడు (సోమవారం) భారత ఆర్మీ, నౌకాదళ దళాలు కవాతు నిర్వహించగా.. వారికి గౌరవ సూచకంగా ప్రధాని మోదీ లేచి నిలబడటం కార్యక్రమానికి విశేషంగా నిలిచింది.


రాజధాని విక్టోరియాలో నిర్వహించిన గోల్డెన్ జూబ్లీ పరేడ్‌లో భారత ఆర్మీకి చెందిన అస్సాం రెజిమెంట్ సైనికులు, భారత నౌకాదళానికి చెందిన సిబ్బంది కవాతు నిర్వహించి ఆకట్టుకున్నారు. ముఖ్యంగా అస్సాం రెజిమెంట్ జవాన్లు తమ ప్రసిద్ధ రెజిమెంటల్ గీతం ‘బడ్లు రామ్ కా బదన్’ ఆలపిస్తూ మార్చ్ చేయడం ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. ఈ వేడుకల్లో భారత నౌకాదళానికి చెందిన అత్యాధునిక స్టెల్త్ ఫ్రిగేట్ ఐఎన్‌ఎస్ తార్కష్, స్వదేశీ పరిజ్ఞానంతో నిర్మించిన ఐఎన్‌ఎస్ ఇక్షాక్ సర్వే నౌకలూ పాల్గొన్నాయి. దీంతో ఇరు దేశాల మధ్య రక్షణ సహకారం మరింత బలపడుతున్న సంకేతాలు స్పష్టం అయ్యాయి.


ఈ సందర్భంగా భారత నౌకాదళం స్పందించింది. సీషెల్స్ జాతీయ దినోత్సవ స్వర్ణోత్సవాల్లో ఐఎన్‌ఎస్ తార్కష్, ఐఎన్‌ఎస్ ఇక్షాక్ నౌకలు, భారత నౌకాదళ బ్యాండ్, మార్చింగ్ కంటింజెంట్ పాల్గొన్నాయని తెలిపింది. ఇది భారత్-సీషెల్స్ సముద్ర సహకారానికి ప్రతీకని పేర్కొంది.


మరోవైపు, ఈ వేడుకల అనంతరం ప్రధాని మోదీ కూడా ఎక్స్‌లో స్పందించారు. ఈ సందర్భంగా సీషెల్స్ అధ్యక్షుడు పాట్రిక్ హెర్మినీ ఆతిథ్యానికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. 'అస్సాం రెజిమెంట్, భారత నౌకాదళ దళాలు సీషెల్స్ జాతీయ దినోత్సవ పరేడ్‌లో పాల్గొనడం ఇరు దేశాల మధ్య ఉన్న చిరస్థాయి స్నేహానికి మరో నిదర్శనం' అని ప్రధాని పేర్కొన్నారు. కాగా, ప్రధాని మోదీకి సీషెల్స్ అత్యున్నత పురస్కారం 'గార్డియన్ ఆఫ్ ది బ్లూ హారిజన్' లభించింది. దీనిని ఆ దేశ ప్రధాని ప్యాట్రిక్ హెర్మినీ.. భారత ప్రధానికి ఆదివారం నాడు అందజేశారు.


ఈ వార్తలు కూడా చదవండి

అయోధ్య రామ మందిరం విరాళాల కేసు.. అత్యవసర విచారణకు నో చెప్పిన సుప్రీంకోర్టు..\

అపార్ట్‌మెంట్‌లో అగ్ని ప్రమాదం.. కొనసాగుతున్న సహయక చర్యలు..

Updated Date - Jun 29 , 2026 | 01:59 PM