ఉజ్బెకిస్థాన్‌లో మార్మోగిన ప్రధాని కవిత.. అభీ తో సూరజ్ ఉగా హైను ఆలపించిన విద్యార్థులు..
ABN , Publish Date - Aug 31 , 2026 | 05:27 PM
ప్రధాని నరేంద్ర మోదీ ఉజ్బెకిస్థాన్ పర్యటనలో రాజకీయ, దౌత్య అంశాలతో పాటు ఒక ప్రత్యేక సాంస్కృతిక ఘట్టం కూడా చోటు చేసుకుంది. మోదీ స్వయంగా రచించిన 'అభీ తో సూరజ్ ఉగా హై' కవితను ఉజ్బెక్ విద్యార్థులు హిందీ, ఉజ్బెక్ భాషల్లో ఆలపించారు.
ఇంటర్నెట్ డెస్క్: ప్రధాని నరేంద్ర మోదీ ఉజ్బెకిస్థాన్ పర్యటనలో రాజకీయ, దౌత్య అంశాలతో పాటు ఒక ప్రత్యేక సాంస్కృతిక ఘట్టం కూడా చోటు చేసుకుంది. మోదీ స్వయంగా రచించిన 'అభీ తో సూరజ్ ఉగా హై' కవితను ఉజ్బెక్ విద్యార్థులు హిందీ, ఉజ్బెక్ భాషల్లో ఆలపించారు. ఈ కార్యక్రమానికి మోదీ కూడా హాజరయ్యారు. ఉదయించే సూర్యుడిని కొత్త ప్రారంభానికి ప్రతీకగా అన్వయిస్తూ 'అభీ తో సూరజ్ ఉగా హై' కవితను ప్రధాని రాశారు (PM Modi poem Abhi Toh Suraj Uga Hai).
ప్రధాని మోదీ రచించిన మూడు కవితలను తాష్కెంట్‌లోని స్టేట్ యూనివర్సిటీ ఆఫ్ ఓరియెంటల్ స్టడీస్‌లో విద్యార్థులు ఆలపించారు. ప్రతి కవితను హిందీతో పాటు ఉజ్బెక్ అనువాదంలోనూ వినిపించారు. ఈ ప్రదర్శనకు ప్రేక్షకుల నుంచి విశేష స్పందన లభించింది. ఉజ్బెకిస్థాన్ అధ్యక్షుడు షవ్కత్ మిర్జియోయెవ్ తాష్కెంట్‌లోని కుక్సారోయ్ ప్యాలెస్‌లో మోదీ కోసం ఏర్పాటు చేసిన అనధికారిక విందులో కూడా 'అభీ తో సూరజ్ ఉగా హై' ఆధారంగా ప్రత్యేక సంగీత ప్రదర్శన నిర్వహించారు. మోదీ, మిర్జియోయెవ్ కలిసి ఈ ప్రదర్శనను వీక్షించారు. కార్యక్రమంలో కవితకు సంబంధించిన హిందీ పదాలను స్క్రీన్‌పై ప్రదర్శించారు (Uzbek students poem).
తన కవితలను ఉజ్బెక్ విద్యార్థులు హిందీలో పఠించడం మోదీని భావోద్వేగానికి గురిచేసింది (India Uzbekistan relations). చాలా కాలం క్రితం తాను రాసిన కవితలను ఇప్పుడు యువ విద్యార్థుల నోట వినడం ప్రత్యేక అనుభూతిని కలిగించిందని ఆయన పేర్కొన్నారు. హిందీ వారి మాతృభాష కాకపోయినప్పటికీ, కవితల్లోని భావాలను విద్యార్థులు తాను రాసినప్పుడు అనుభవించినట్టుగానే వ్యక్తీకరించారని మోదీ అన్నారు. ఒక భాషను పూర్తిగా నేర్చుకుని, దానిలో మమేకమైనప్పుడే అలాంటి భావవ్యక్తీకరణ సాధ్యమవుతుందని పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి..
2027 యూపీ ఎన్నికలు.. డింపుల్ యాదవ్ కేంద్రంగా అఖిలేష్ కీలక వ్యూహం..
పెట్రోల్‌లో ఇథనాల్ శాతం వెల్లడించాలని పిటిషన్.. సుప్రీంకోర్టు కీలక నిర్ణయం..