Share News

మరీ ఇంత ఆకలా!

ABN , Publish Date - Nov 20 , 2026 | 05:35 AM

దేశీయ కార్పొరేట్‌ కంపెనీలపై ప్రధాని నరేంద్ర మోదీ నిప్పులు చెరిగారు.

మరీ ఇంత ఆకలా!
narendramodi

  • ఉద్యోగుల జీతాలు పెంచారా? కొత్త ఉద్యోగాలిచ్చారా?

  • పన్ను రాయితీలు మీకు.. ఉద్యోగుల బాధ్యత మాకా?

  • కంపెనీలు ఉద్యోగుల కోసం మరింత చేయాల్సిందే

  • భారతీయ మార్కెట్‌ పెద్దది.. తేలిగ్గా తీసుకోవద్దు

  • ‘ఎక్స్‌పోర్టు క్వాలిటీ’ అంటే మన వాళ్లకు నాణ్యత అక్కర్లేదా?

  • ఫిక్కీ వేదికపై కార్పొరేట్లకు ప్రధాని మోదీ చురకలు

  • పొదుపును ప్రోత్సహించాలి

  • తినడం, తాగడం, జల్సాలు చేయడం భారతీయ సంస్కృతి కాదు

  • కేంద్ర మంత్రులు, ఉన్నతాధికారులతో భేటీలో ప్రధాని మోదీ

న్యూఢిల్లీ, నవంబరు 19: దేశీయ కార్పొరేట్‌ కంపెనీలపై ప్రధాని నరేంద్ర మోదీ నిప్పులు చెరిగారు. ప్రభుత్వం ఇచ్చిన పన్ను రాయితీల ఫలాలను కంపెనీలే అనుభవిస్తున్నాయని, ఉద్యోగాలు కల్పించడం గానీ జీతాలు పెంచడం గానీ చేయడం లేదని మండిపడ్డారు. ఎదురుగా కూర్చున్న పారిశ్రామికవేత్తలను ఉద్దేశించి ‘‘మీరు చప్పట్లు కొట్టరని నాకు తెలుసు. బాగా తెలుసు. ఎందుకంటే మీ ఆకలి అంతటిది. ఎంత తినిపించినా మీ కడుపు నిండదు’’ అని తీవ్ర స్వరంలో వ్యాఖ్యానించారు. భారత పరిశ్రమలు, వాణిజ్య సంఘాల సమాఖ్య(ఫిక్కీ) శతాబ్ది వార్షిక సదస్సులో గురువారం ఆయన ప్రసంగించారు. ఢిల్లీలోని భారత్‌ మండపం ఈ సదస్సుకు వేదికైంది. పారిశ్రామిక వాతావరణాన్ని మెరుగుపరచడానికి ప్రభుత్వం ఎన్నో చర్యలు తీసుకుందని ప్రధాని గుర్తు చేశారు. 2014లో 30 శాతంగా ఉన్న కార్పొరేట్‌ పన్నును 22 శాతానికి తగ్గించామన్నారు. పన్ను రిటర్నులు, రిఫండ్ల ప్రక్రియను సులభతరం చేశామని, ఎన్నో వస్తువులపై జీఎ్‌సటీ రేట్లు తగ్గించామని చెప్పారు. అయినా కంపెనీలు తమ వంతు బాధ్యత నెరవేర్చలేదన్నారు. ‘‘మా వంతుగా ఉద్యోగుల కోసం రూ.12 లక్షల వరకు ఆదాయ పన్ను మినహాయింపు ఇచ్చాను. మరి మీరు ఉద్యోగుల జీతాలు పెంచారా? ఉద్యోగుల సంఖ్య పెంచారా? లేదు! ఎప్పుడూ మీ ధోరణి ‘మోదీజీ.. మీరే చేయండి, ఏం జరుగుతుందో మేం చూస్తాం’ అన్నట్టే ఉంటుంది. ఇలా ఎన్నాళ్లు? అని సూటిగా ప్రశ్నించారు. వృద్ధి బాధ్యత అంతా ప్రభుత్వమే మోయాలని ఆశించవద్దని, ఉద్యోగుల కోసం కంపెనీలు మరింత చేయాలని స్పష్టం చేశారు.


కనీసం దానికైనా చప్పట్లు కొట్టండి

పన్ను చెల్లింపుదారుల డబ్బు వ్యవస్థలో అనవసరంగా ఇరుక్కుపోకుండా రిఫండ్ల విధానాన్ని మార్చామని ప్రధాని చెప్పారు. ‘‘ఇదివరకు ఎనిమిది నెలలకు రీఫండ్‌ ఉత్తరం వచ్చేది. ఇప్పుడు వారంలోనే ఏకంగా రిఫండ్‌ వస్తోంది. వస్తోందా లేదా? కనీసం దానికైనా చప్పట్లు కొట్టండి’’ అని పారిశ్రామికవేత్లలను ఉద్దేశించి అన్నారు. ఆదాయ పన్ను మినహాయింపుతో ప్రజల కొనుగోలు శక్తి పెరిగిందని, అది డిమాండ్‌గా, వ్యాపార విస్తరణగా మారాలని అన్నారు.

నా దేశ ప్రజలకునాణ్యమైన వస్తువులు దక్కాలి

దేశంలోని 140 కోట్ల మందిని చచ్చినట్లు కొనే మార్కెట్‌గా భావించవద్దని ప్రధాని కంపెనీలను హెచ్చరించారు. ఏది తయారు చేసినా దేశంలో కొనేవాళ్లు దొరుకుతారనే ధోరణి నుంచి బయటపడాలన్నారు. ‘ఎగుమతి నాణ్యత’ పేరుతో ప్రత్యేక శ్రేణి వస్తువులను దేశంలో అమ్మడాన్ని తప్పుపట్టారు. విదేశీ వినియోగదారులకు ఇచ్చే నాణ్యత మన దేశ ప్రజలకు అక్కర్లేదా? అని ప్రశ్నించారు. ‘‘నా దేశ ప్రజలకు నాణ్యమైన వస్తువులు దక్కాలి’’ అని తేల్చిచెప్పారు. ‘‘దేశీయ మార్కెట్‌ కంపెనీలకు కంఫర్ట్‌ జోన్‌ కాకూడదు. అది ప్రపంచ మార్కెట్లో పోటీపడే ఆత్మవిశ్వాసం ఇవ్వాలి’’ అన్నారు.

‘అది కూడా నేనే వచ్చి చెప్పాలా?’

ప్రపంచంలోని పలు దేశాలతో భారత్‌ కుదుర్చుకున్న స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలను (ఎఫ్‌టీఏ) పరిశ్రమకు చారిత్రక అవకాశంగా ప్రధాని అభివర్ణించారు. ‘‘పెద్ద ఆర్థిక వ్యవస్థలతో ఎఫ్‌టీఏలు కుదిరాయంటే మీ కోసం తలుపులు తెరుచుకున్నాయని అర్థం. ఫిక్కీ సభ్యులుగా మీరెప్పుడైనా కూర్చుని దీనిపై ఆలోచించారా? ఈ అవకాశాలు అందిపుచ్చుకోవడానికి ఏమైనా ప్రణాళికలు వేశారా? లేక అది కూడా నేనే వచ్చి మీకు చెప్పాలా?’’ అని చురక అంటించారు. వివిధ ప్రాంతాల వినియోగదారుల అవసరాలు తెలుసుకోవాలని, అంతర్జాతీయ ప్రమాణాలతో ఉత్పత్తులు తయారు చేయాలని, విదేశాల్లో సరఫరా నెట్‌వర్క్‌ నిర్మించుకోవాలని సూచించారు.


మాది స్నేహపూర్వక ప్రభుత్వం

మరిన్ని సంస్కరణలపై పరిశ్రమ సూచనలు పరిశీలించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని ప్రధాని ప్రకటించారు. తమది స్నేహ పూర్వక ప్రభుత్వమని, స్నేహాన్ని ఎలా గౌరవించాలో తెలుసని చెప్పారు. ఏ మార్పులు కావాలో సంకోచం లేకుండా తనకు నేరుగా రాయాలని కోరారు. వచ్చే 20 ఏళ్ల పెట్టుబడి నిర్ణయాలకు ‘ఇండియా ఫస్ట్‌’ పునాది కావాలన్నారు. దిగుమతులపై ఆధారపడటం తగ్గించడానికి, ఎగుమతుల్లో పోటీ పెంచడానికి మందుల ముడి పదార్థాలు, ప్రత్యేక స్టీల్‌, అల్యూమినియం ఉత్పత్తులు, వ్యవసాయ, ప్రాసెస్డ్‌ ఆహార ఉత్పత్తులు, ఇంజనీరింగ్‌ పరికరాలు, యంత్రాల రంగాల్లో దేశీయ తయారీ పెరగాలని సూచించారు.

దేశ ప్రజల్లో పొదుపు అలవాటును ప్రోత్సహించాలని ప్రధాని మోదీ సూచించారు. భారతీయ సంస్కృతి పొదుపుపై ఆధారపడి ఉంటుందని, తినడం, తాగడం, జల్సాలు చేయడం అనే ధోరణికి అది పూర్తిగా భిన్నమైనదని అన్నారు. ఢిల్లీలోని భారత్‌ మండపంలో కేంద్ర మంత్రులు, ఉ న్నతాధికారులతో గురువారం నిర్వహించిన సమావేశంలో ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. ఆర్థిక క్రమశిక్షణను పాటించడంలో విఫలమైతే ప్రజలను పేదరికం నుంచి బయట పడేసేందుకు సాధించిన పురోగతి అంతా వృథాగా మారే ప్రమాదం ఉందని హెచ్చరించారు. 2011 నుంచి 2023 మధ్యకాలంలో దాదాపు 50 కోట్ల మందిని పేదరికం నుంచి బయటకు తీసుకురావడంలో సాధించిన విజయాన్ని మోదీ ఈ సందర్భంగా ప్రస్తావించారు. ఇది జాతీయ వేడుకగా జరుపుకోదగ్గ మైలురాయి అని ఆయన అభివర్ణించారు. అయితే ప్రజలను పేదరికం నుంచి బయటకు తీసుకురావడం అనేది సవాలులో ఒక భాగం మాత్రమేనని, వారు మళ్లీ దాని కోరల్లో చిక్కుకోకుండా ఉండేందుకు నిరంతర కృషి అవసరమని పేర్కొన్నారు. మాదకద్రవ్యాల దుర్వినియోగంపై మాట్లాడుతూ ప్రధాని భావోద్వేగానికి లోనయ్యా రు. యువతను డ్రగ్స్‌ బారినుంచి కాపాడాలని ఆయన అన్నారు. నక్సలిజాన్ని ఎదుర్కొన్న విధంగానే మాదకద్రవ్యాల సమస్యను కూడా దేశం అధిగమించగలదని, దీనికి ప్రభుత్వం సమన్వయంతో కృషి చేయాలని పిలుపునిచ్చారు.

ఇవి కూడా చదవండి...

సిరాజ్‌ను ఎందుకు పక్కన పెట్టారు?.. టీమిండియా ఎంపికపై గావస్కర్

హైదరాబాద్‌లో డ్రగ్స్ కింగ్‌పిన్ అరెస్ట్.. 51 గ్రాముల ఎమ్‌డీఎమ్‌ఏ స్వాధీనం

Updated Date - Nov 20 , 2026 | 06:12 AM