Share News

వికసిత్‌ భారత్‌కు సప్తధారలు

ABN , Publish Date - Aug 16 , 2026 | 06:24 AM

వికసిత్‌ భారత్‌-2047 విజన్‌లో భాగంగా దేశ ఆర్థిక, వ్యూహాత్మక అభివృద్ధి కోసం ప్రధాని నరేంద్రమోదీ ‘సప్తధారలు’ పేరుతో నూతన ప్రణాళికను వెల్లడించారు. 1. తయారీ 2. వ్యవసాయం, ఫుడ్‌ప్రాసెసింగ్‌...

వికసిత్‌ భారత్‌కు సప్తధారలు

  • తయారీ, సాగు, టెక్నాలజీ, గతిశక్తి, రక్షణ, గ్రీన్‌-బ్లూ ఎకానమీ, సాఫ్ట్‌పవర్‌

  • ఏడాదిలో కోటి మంది యువతకు ఏఐలో శిక్షణ

  • పోటీ పరీక్షలకు ఉచిత ఆన్‌లైన్‌ కోచింగ్‌

  • రైతులు సేంద్రియ సాగు దిశగా మళ్లాలి

  • అణుశక్తిలో స్వయం సమృద్ధి లక్ష్యం

  • 2047 నాటికి 100 గిగావాట్ల దిశగా చర్యలు

  • బాల క్రీడాకారులకు అంతర్జాతీయ స్థాయి శిక్షణ

  • రక్షణ సవాళ్ల నేపథ్యంలో ‘స్వచ్ఛంద పౌర దళం’

  • నక్సలైట్లను నిర్మూలించాం.. మేధో నక్సల్స్‌ ఇంకా

  • ఉన్నారు.. పంద్రాగస్టు ప్రసంగంలో ప్రధాని మోదీ

న్యూఢిల్లీ, ఆగస్టు 15 (ఆంధ్రజ్యోతి): వికసిత్‌ భారత్‌-2047 విజన్‌లో భాగంగా దేశ ఆర్థిక, వ్యూహాత్మక అభివృద్ధి కోసం ప్రధాని నరేంద్రమోదీ ‘సప్తధారలు’ పేరుతో నూతన ప్రణాళికను వెల్లడించారు. 1. తయారీ 2. వ్యవసాయం, ఫుడ్‌ప్రాసెసింగ్‌ 3. టెక్నాలజీ, ఆవిష్కరణలు 4. గతిశక్తి (హైస్పీడ్‌ రవాణా, అనుసంధానం) 5. రక్షణ రంగం 6. హరిత, సముద్ర ఆర్థిక వ్యవస్థలు 7. సాఫ్ట్‌పవర్‌ (యోగా మొదలైనవి).. వీటిద్వారా దేశాభివృద్ధిని నూతన శిఖరాలకు తీసుకెళ్దామని పిలుపునిచ్చారు. ప్రపంచవ్యాప్తంగా సేంద్రియ ఆహార ఉత్పత్తులకు డిమాండ్‌ పెరుగుతోందని, రైతులు రసాయన రహిత వ్యవసాయ విధానాలను అలవర్చుకోవాలన్నారు. శనివారం 80వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఎర్రకోట నుంచి జాతిని ఉద్దేశించి మోదీ ప్రసంగించారు. ప్రధానిగా ఇది ఆయనకు వరుసగా 13వ పంద్రాగస్టు ప్రసంగం. తద్వారా దేశ చరిత్రలో తొలి ప్రధాని నెహ్రూ(17సార్లు) తర్వాత స్థానంలో మోదీ మాత్రమే ఉన్నారు. కాగా, ఇటీవలి యువత, విద్యార్థుల ఉద్యమాల నేపథ్యంలో వారికి మోదీ తన ప్రసంగంలో అత్యధిక ప్రాముఖ్యతనిచ్చారు. మొత్తం 75నిమిషాల ప్రసంగంలో 50సార్లకు పైగా యువతను ప్రస్తావించారు. పేద, మధ్యతరగతి యువతకు కోచింగ్‌ భారంగా తయారైందని, ఫీజుల రూపంలో వారు వేల కోట్ల రూపాయలు చెల్లించాల్సి వస్తోందని.. ఈ భారాన్ని తొలగించటానికి పోటీ పరీక్షలకు ఆన్‌లైన్‌లో ఉచిత కోచింగ్‌ అందిస్తామని మోదీ ప్రకటించారు. రాబోయే ఏడాది కాలంలో కోటి మంది యువతకు కృత్రిమ మేధ (ఏఐ) నైపుణ్యాలలో శిక్షణ ఇవ్వనున్నట్లు ప్రకటించారు. 2036 ఒలింపిక్స్‌కు ఆతిథ్యం ఇవ్వటానికి భారత్‌ పోటీ పడుతున్న నేపథ్యంలో.. భవిష్యత్‌ క్రీడాకారులను రూపొందించే కార్యక్రమాన్ని చేపట్టనున్నట్లు ప్రధాని వెల్లడించారు. 5-15 ఏళ్ల వయస్సు గల బాలబాలికల్లో క్రీడా నైపుణ్యాలను గుర్తించేందుకు దేశవ్యాప్తంగా అన్వేషణ చేపడతామని, ఎంపికైనవారికి ప్రత్యేక శిక్షణ అందించి, అంతర్జాతీయ స్థాయిలో దేశానికి ప్రాతినిధ్యం వహించేలా తీర్చిదిద్దుతామని చెప్పారు. చట్టసభల్లో మహిళలకు రిజర్వేషన్‌ తక్షణం చేపట్టాల్సిన అంశమని, దీనిపై అన్ని పార్టీలూ కలిసి రావాలని మోదీ పిలుపునిచ్చారు. ‘బిల్లు ఆమోదించిన తర్వాత ఆ ఘనత మీ ఖాతాలోనే వేసుకోండి. కానీ, మహిళలకు మాత్రం ఆ హక్కును ఇవ్వండి’ అని పేర్కొన్నారు. మావోయిస్టులపై ప్రభుత్వం సాధించిన విజయాన్ని మోదీ గుర్తు చేశారు. ‘అడవుల్లో ఉన్న సాయుధ నక్సలైట్లను తుదముట్టించటంలో విజయం సాధించాం. కానీ, మేధో నక్సల్స్‌(దిమాగీ నక్సల్స్‌) ఇంకా మిగిలే ఉన్నారు. వారిని గుర్తించి ఏకాకులను చేయాలి’ అన్నారు.


రక్షణ ఉత్పత్తుల్లో గమ్యస్థానంగా భారత్‌

రక్షణ ఉత్పత్తుల తయారీలో భారత్‌ను అంతర్జాతీయ గమ్యస్థానంగా తీర్చిదిద్దుతామని ప్రధాని పేర్కొన్నారు. ముఖ్యంగా హైపర్‌సోనిక్‌ టెక్నాలజీలు, డ్రోన్‌ సిస్టమ్స్‌ వంటి ఆధునిక సామర్థ్యాల్లో స్వయంసమృద్ధి సాధించాల్సి ఉందన్నారు. అంతర్జాతీయ ఉద్రిక్తతల నేపథ్యంలో ఇంధనం, ఖనిజాల రంగంలో దేశీయ సామర్థ్యాన్ని పెంచుకోవాలన్నారు. ఈ ఏడాది తమిళనాడులోని కల్పకంలో ఉన్న ‘ప్రొటోటైప్‌ ఫాస్ట్‌బ్రీడర్‌ రియాక్టర్‌’ కీలకదశను అధిగమించిన విషయాన్ని గుర్తు చేస్తూ.. అణుశక్తి రంగంలోనూ స్వయంసమృద్ధి సాధించటానికి అడుగులు వేస్తున్నామని వెల్లడించారు. 2047 నాటికి 100 గిగావాట్ల అణుశక్తి ఉత్పత్తిని సాధించే లక్ష్యాన్ని నిర్దేశించుకుంటూ పార్లమెంటులో ‘శాంతి’ చట్టాన్ని తీసుకొచ్చామని తెలిపారు. ఐదు అణు రియాక్టర్లను నెలకొల్పాలని నిర్ణయించామన్నారు. భారతీయ పరిశ్రమలను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లాల్సిన అవసరం ఉందని, ఫార్చ్యూన్‌-500 జాబితాలో కనీసం 50 భారతీయ కంపెనీలు ఉండాలని ప్రధాని అన్నారు.

మన బలం ‘స్వయం సమృద్ధి’

కొవిడ్‌, రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధం, అమెరికా-ఇరాన్‌ యుద్ధం వంటి పరిణామాల నేపథ్యంలో సహజ వనరులు, వ్యూహాత్మక సముద్ర మార్గాలను ఆయుధాలుగా మలుచుకుంటూ తమ ఆధిపత్యాన్ని నిలుపుకోవటానికి కొన్ని దేశాలు ప్రయత్నిస్తున్నాయని మోదీ పేర్కొన్నారు. ఇటువంటప్పుడే స్వయం సమృద్ధి అవసరమవుతుందన్నారు. ‘స్వయంసమృద్ధి గురించి నేను మాట్లాడిన కొత్తలో.. ఏసీ గదుల్లో కూర్చున్నవాళ్లు ప్రపంచీకరణ సంగతేంటి అని ప్రశ్నించేవారు. కానీ, పదేళ్లలో ప్రపంచీకరణ అంశం పక్కకుపోయింది. ఇప్పుడు ప్రతీ దేశం తన స్వీయ ప్రయోజనాల గురించే ఆలోచిస్తోంది. పెట్రోల్‌, డీజిల్‌, ఎరువులు, ఔషధాలు, టెక్‌ చిప్‌లు, చివరికి భౌగోళిక ప్రాంతాన్ని కూడా కొన్ని దేశాలు ఆయుధంగా వాడుకుంటున్నాయి. గత పదేళ్లలో మనం స్వయం సమృద్ధి మార్గంలో నడిచి ఉండకపోతే.. ఈ సవాళ్లు మనకు పెద్ద సమస్యలుగా పరిణమించి ఉండేవి’ అని మోదీ పేర్కొన్నారు. 2014కు ముందు ఐదు బలహీన ఆర్థిక వ్యవస్థల్లో ఒకటిగా ఉన్న భారత్‌.. ప్రస్తుతం ముందడుగు వేసి, 40 దేశాలతో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలను కుదుర్చుకుందన్నారు. దేశంలోని చిన్న, మధ్యస్థాయి పరిశ్రమలకు ఇదొక గొప్ప అవకాశమని, దీనిని వినియోగించుకోవాలన్నారు. ప్రస్తుత కాలంలో యుద్ధం తీరుతెన్నులు మారాయని.. ఈ నేపథ్యంలో, మన సైనిక దళాల సామర్థ్యాన్ని పెంచటంతోపాటు పౌరులను కూడా సన్నద్ధం చేయాల్సిన అవసరం ఉందని, ‘పౌర రక్షణ స్వచ్ఛంద దళాన్ని’ ఆధునీకరించే ప్రణాళికలు ఉన్నాయని ప్రకటించారు. నెహ్రూతోపాటు పలువురు స్వాతంత్య్ర సమరయోధులను పేరు పేరునా ప్రస్తావిస్తూ వారి త్యాగాలను మోదీ గుర్తు చేశారు. ఎర్రకోట ప్రసంగానికి ముందు ప్రధాని.. రాజ్‌ఘాట్‌కు వెళ్లి గాంధీజీకి నివాళులు అర్పించారు. కాగా, ఎర్రకోట వద్ద జరిగిన స్వాతంత్య్ర దినోత్సవాల్లో తొలిసారిగా 6చరణాల వందేమాతరం గేయాన్ని పూర్తిగా ఆలపించారు.


మోదీ ‘దిమాగీ నక్సల్స్‌’పై విపక్షాల ఆగ్రహం

న్యూఢిల్లీ, ఆగస్టు 15: స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగంలో మోదీ ‘దిమాగీ నక్సల్స్‌’ అనే మాట ఉపయోగించడంపై కాంగ్రెస్‌, సీపీఐ, సీపీఐ(ఎం), టీఎంసీ తదితర పార్టీలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. తనని ప్రశ్నించిన వాళ్లని గతంలో అర్బన్‌ నక్సల్స్‌ అని పేర్కొన్న మోదీ ఇప్పుడు దిమాగీ నక్సల్స్‌ అన్నారని.. రాజకీయంగా ఆయనలో ఉన్న నిరాశకు ఈ వ్యాఖ్యలు నిదర్శనమని కాంగ్రెస్‌ జనరల్‌ సెక్రటరీ జైరాం రమేశ్‌ పేర్కొన్నారు. గతంలో కులగణనకు సమర్థించిన వారిని అర్బన్‌ నక్సల్స్‌ అని పేర్కొన్న కేంద్ర ప్రభుత్వం ఏడాది తర్వాత కులగణన నిర్వహించాలని ప్రకటించిందని ఎత్తిచూపారు. ప్రశ్నించిన వారి దూషించి వారు లేవెనెత్తిన అంశాలను అమలు చేయడం కేంద్రం తీరని ఎద్దేవా చేశారు. దిమాగీ నక్సల్స్‌ అనేది తీవ్రమైన ఆరోపణ అని సీపీఐ(ఎం) జనరల్‌ సెక్రటరీ ఎంఏ బేబీ అన్నారు. ప్రతిపక్షాలను దేశద్రోహులు, మావోయిస్టులుగా చిత్రీకరించడం కేంద్రానికి అలవాటుగా మారిందని మండిపడ్డారు. మహిళా రిజర్వేషన్లపై కేంద్రానిది ద్వంద్వ వైఖరి అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రశ్నించే వాళ్లను నిందించేందుకు ప్రధాని మోదీ స్వాతంత్య్ర దినోత్సవ వేదికను కూడా వాడుకున్నారని, దిమాగీ నక్సల్స్‌ అంటూ ప్రతిపక్షాలపై నిందలు వేశారని సీపీఐ జనరల్‌ సెక్రటరీ డీ రాజా పేర్కొన్నారు.

మావోయిస్టు సిద్ధాంతాలతో ప్రభావితమైన వారు ఏళ్లుగా దేశంలోని ప్రభుత్వ యంత్రాంగాల్లో పాతుకుపోయారు. ప్రభుత్వ కమిటీల్లో సలహాదారులుగా పని చేశారు. విధానాలను, నిర్ణయాలను ప్రభావితం చేశారు. ఈ సంక్షోభం నుంచి దేశానికి విముక్తి కల్పించాం. అడవుల్లో ఉన్న సాయుధ నక్సలైట్లను తుదముట్టించడంలో విజయం సాధించాం. అయితే, మేధో నక్సల్స్‌ (దిమాగీ నక్సల్స్‌) ఇంకా మిగిలే ఉన్నారు. వారిని గుర్తించి ఏకాకులను చేయాలి.

ప్రధాని నరేంద్ర మోదీ

ఇవి కూడా చదవండి...

అమరావతిలో తొలిసారిగా స్వాతంత్ర్య వేడుకలు.. జెండా ఆవిష్కరించిన సీఎం చంద్రబాబు

ఏపీ వ్యాప్తంగా ఘనంగా స్వాతంత్ర్య వేడుకలు.. ఊరూవాడా జాతీయ జెండా రెపరెపలు

Read Latest AP News And Telugu News

Updated Date - Aug 16 , 2026 | 06:24 AM