Share News

అస్సాంలో రూ.4,500 కోట్ల విలువైన ప్రాజెక్టులకు మోదీ శంకుస్థాపన

ABN , Publish Date - Mar 13 , 2026 | 06:58 PM

అస్సాం అసెంబ్లీ ఎన్నికల వేళ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుక్రవారంనాడు ఆ రాష్ట్రంలో పర్యటించారు. రూ.4,500 కోట్ల విలువైన పలు అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించడంతో పాటు శంకుస్థాపనలు చేశారు.

అస్సాంలో రూ.4,500 కోట్ల విలువైన ప్రాజెక్టులకు మోదీ శంకుస్థాపన
PM Modi

గువాహటి: అస్సాం అసెంబ్లీ ఎన్నికల వేళ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) శుక్రవారంనాడు ఆ రాష్ట్రంలో పర్యటించారు. రూ.4,500 కోట్ల విలువైన పలు అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించడంతో పాటు శంకుస్థాపనలు చేశారు. షెడ్యూల్ ప్రకారం కోకరాఝార్‌లోని బహిరంగ సభలో మోదీ ప్రసంగించాల్సి ఉన్నప్పటికీ వాతావరణ ప్రతికూలత కారణంగా వేదిక వద్దకు చేరుకోలేకపోయారు. దీంతో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ఆ కార్యక్రమంలో పాల్గొన్నారు.


అభివృద్ధి వేగవంతం

అస్సాం అభివృద్ధికి రూ.4,500 కోట్లతో పలు పనులు ప్రారంభించామని, ఇందులో రూ.1,100 కోట్లు బోడోలాండ్ ప్రాంతంలోని రోడ్ల కోసం ఖర్చు చేయనున్నామని చెప్పారు. అస్సాం మేళా ఇనీషియేటివ్ మూడో దశలో అస్సాంలో రోడ్ల అనుసంధానం మరింత పటిష్టమవుతుందని అన్నారు. ఈ సందర్భంగా కామాఖ్య-చర్లపల్లి అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్, గౌహతి-న్యూ జల్‌పాయ్‌గురి ఎక్స్‌ప్రెస్‌లను మోదీ జెండా ఊపి ప్రారంభించారు.


దశాబ్దాలుగా బోడోలాండ్‌‌ను వంచించిన కాంగ్రెస్

కాంగ్రెస్ పార్టీ బోడోలాండ్‌ను తప్పుడు హామీలతో దశాబ్దాలుగా వంచించిందని, బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాతే బోడోలాండ్ ప్రాంత ప్రజల కలలు సాకారమయ్యాయని అన్నారు. అటు కేంద్రంలో, ఇటు అస్సాంలో కాంగ్రెస్‌కు ప్రజలు ఉద్వాసన చెప్పి బీజేపీ-ఎన్డీయేకు అవకాశం ఇవ్వడంతో చిత్తశుద్ధితో తాము అభివృద్ధి పనులు చేపట్టామని చెప్పారు. కాంగ్రెస్ వివిధ గ్రూపుల మధ్య అసంతృప్తిని పెంచితే, శాంతి కోసం బీజేపీ పాటుపడిందని, బోడో పీస్ ఒప్పందంపై సంతకం చేసి అన్ని ప్రధాన సంస్థలు, గ్రూపులను ఏకతాటిపైకి తెచ్చిందని చెప్పారు. అస్సాంలో చొరబాటుదారులను కాంగ్రెస్ ప్రోత్సహించిందని, గిరిజనుల భూములను అక్రమంగా చొరబాటుదారులకు కట్టబెట్టిందని మోదీ విమర్శించారు. అయితే గిరిజనుల భూములు వారికే తిరిగి ఇప్పించేందుకు ముఖ్యమంత్రి శర్మ అవిశ్రాంతంగా కృషి చేశారని కొనియాడారు.


దీనికి ముందు, అస్సాంలో రెండ్రోజుల పర్యటన కోసం గౌహతి వచ్చిన మోదీకి రాష్ట్ర గవర్నర్ లక్ష్మణ్ ప్రసాద్ ఆచార్య, ముఖ్యమంత్రి హిమంత బిశ్వా శర్మ, పలువురు రాష్ట్ర మంత్రులు, సీనియర్ అధికారులు సాదర స్వాగతం పలికారు.


ఇవి కూడా చదవండి..

ఎల్‌పీజీ ప్యానిక్ బుకింగ్ అవసరం లేదు, సంక్షోభం లేదు.. కేంద్రం ప్రకటన

సీఈసీ జ్ఞానేశ్ కుమార్‌పై అభిశంసన.. ఉభయసభల్లో తీర్మానం నోటీసు

Updated Date - Mar 13 , 2026 | 06:59 PM