Share News

ఎల్‌పీజీ ప్యానిక్ బుకింగ్ అవసరం లేదు, సంక్షోభం లేదు.. కేంద్రం ప్రకటన

ABN , Publish Date - Mar 13 , 2026 | 05:34 PM

ఎల్‌పీజీ కొరత ఆందోళన కలిగిస్తున్న నేపథ్యంలో కేంద్రం కీలక ప్రకటన చేసింది. ఎలాంటి భయాందోళనలు వద్దని, 'ప్యానిక్ బుకింగ్‌' అవసరం లేదని తెలిపింది. సంక్షోభం లేదని వివరించింది.

ఎల్‌పీజీ ప్యానిక్ బుకింగ్ అవసరం లేదు, సంక్షోభం లేదు.. కేంద్రం ప్రకటన
LPG

న్యూఢిల్లీ: పశ్చిమాసియాలో యుద్ధం కారణంగా ఎల్‌పీజీ కొరత ఆందోళన కలిగిస్తున్న నేపథ్యంలో కేంద్రం కీలక ప్రకటన చేసింది. ఎలాంటి భయాందోళనలు వద్దని, 'ప్యానిక్ బుకింగ్‌' అవసరం లేదని తెలిపింది. సంక్షోభం లేదని వివరించింది. గృహావసరాల కోసం ఎలాంటి అంతరాయం లేకుండా పైపుల ద్వారా సహజ వాయివు (PNG), కంప్రెస్డ్ నేచురల్ గ్యాస్ (CNG) సరఫరాకు భరోసా ఇచ్చింది. పెట్రోలియం, సహజ వాయువు మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి సుజాతా శర్మ శుక్రవారంనాడిక్కడ మీడియాతో మాట్లాడుతూ, ఆసుపత్రులు, హాస్టల్స్‌కు ఎల్‌పీజీ సరఫరాకు తొలి ప్రాధాన్యం ఇస్తున్నట్టు చెప్పారు. మార్చి 2026తో పోల్చుకుంటే దేశంలో ఎల్‌పీజీ ఉత్పత్తి 40 శాతం పెరిగిందని, అదనంగా రాష్ట్రాలకు 48,000 కిలోలీటర్ల (సుమారు 48 మిలియన్ లీటర్లు) కిరోసిన్ పంపిణీ చేశామని తెలిపారు. హోటళ్లు, రెస్టారెంట్లకు బొగ్గు సరఫరా చేయాలని కోల్ ఇండియాను ప్రభుత్వం ఆదేశించిందని చెప్పారు.


ఒక్కసారిగా పెరిగిన ఎల్పీజీ బుకింగ్స్

మధ్యప్రాచ్యంలో యుద్ధానికి ముందు యావరేజ్‌గా 55.7 లక్షల బుకింగ్‌లు ఉంటే మార్చి 12 నాటికి అది 75.7 లక్షలకు పెరిగిందని, భయాల కారణంగానే బుకింగ్‌లు అనూహ్యంగా పెరిగాయని సుజాతా శర్మ తెలిపారు. ఎల్పీజీపై ఒత్తిడి తగ్గేందుకు పీఎన్‌జీ కనెక్షన్లకు మళ్లాలని ప్రజలను కోరారు. క్రూడాయిల్‌కు సంబంధించి 258 మిలియన్ మెట్రిక్ టన్నుల రిఫైనింగ్ కెపాసిటీ మనకు ఉందని, పెట్రోల్, డీజిల్ ఉత్పత్తిలో స్వయం సమృద్ధిని కలిగి ఉన్నామని వివరించారు. ప్రధానమైన అర్బన్ సిటీలు, కేంద్రాల్లో కమర్షియల్ వినియోగదారుల ఆందోళన, సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటోందని చెప్పారు. కమర్షియల్ వినియోగదారులు స్థానిక సీజీడీ (సిటీ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్) నెట్‌వర్క్ ప్రొవైడర్‌ను కానీ, సంబంధిత డీలర్‌ను కానీ సంప్రదించి పీఎన్‌జీ కనెక్షన్ పొందవచ్చని సూచించారు.


అన్నీ పంపులూ ఫుల్..

దేశంలోని అన్ని పెట్రోల్ పంపుల్లో తగినన్ని పెట్రోల్, డీజిల్ నిల్వలు ఉన్నాయని, బంక్‌లు ఖాళీ అయినట్టు 25,000 డిస్ట్రిబ్యూటర్లలో ఏ ఒక్కరి నుంచీ తమకు సమాచారం లేదని సుజాతా శర్మ తెలిపారు. వదంతులను విశ్వసించవద్దని, ప్యానిక్ బైయింగ్‌కు దూరంగా ఉండాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.


ఇవి కూడా చదవండి..

సీఈసీ జ్ఞానేశ్ కుమార్‌పై అభిశంసన.. ఉభయసభల్లో తీర్మానం నోటీసు

మిడిల్‌ఈస్ట్‌లో హింసకు స్వస్తి పలకండి: ఇరాన్ అధ్యక్షుడు మసౌద్‌తో మోదీ

Updated Date - Mar 13 , 2026 | 05:39 PM