సీఈసీ జ్ఞానేశ్ కుమార్‌పై అభిశంసన.. ఉభయసభల్లో తీర్మానం నోటీసు
ABN , Publish Date - Mar 13 , 2026 | 03:56 PM
ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ (CEC Gyanesh Kumar)ను తొలగించాలంటూ 'ఇండియా' కూటమి పార్టీలు తీర్మానాన్ని పార్లమెంటు ముందుకు తెచ్చాయి. ఇందుకు సంబంధించిన తీర్మానం నోటీసును పార్లమెంటు ఉభయ సభల్లోనూ విపక్ష నేతలు శుక్రవారంనాడు ప్రవేశపెట్టారు.
న్యూఢిల్లీ: ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ (CEC Gyanesh Kumar)ను తొలగించాలంటూ 'ఇండియా' కూటమి పార్టీలు ఒక తీర్మానాన్ని పార్లమెంటు ముందుకు తెచ్చాయి. ఇందుకు సంబంధించిన తీర్మానం నోటీసును పార్లమెంటు ఉభయ సభల్లోనూ విపక్ష నేతలు శుక్రవారంనాడు ప్రవేశపెట్టారు. తీర్మానం నోటీసుపై 193 మంది ఎంపీలు సంతకాలు చేశారు. వీరిలో 130 మంది లోక్‌సభ, 63 మంది రాజ్యసభ ఎంపీలు ఉన్నారు.
ఈ తీర్మానానికి సంబంధించి తృణమూల్ కాంగ్రెస్ ఇచ్చిన నోటీసు లోక్‌సభ సెక్రటేరియట్‌కు అందిందని, నోటీసు పరిశీలన ప్రక్రియ త్వరలోనే ప్రారంభమవుతుందని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. 'ఇండియా' కూటమికి దూరంగా ఉంటున్న ఆమ్ ఆద్మీ పార్టీ సైతం తీర్మానం నోటీసుపై సంతకాలు చేసింది. పలువురు ఇండిపెండెంట్ ఎంపీలు కూడా ఇందులో ఉన్నారు. ఎన్నికల ప్రధాన కమిషనర్‌ను తొలగించడానికి నోటీసు ఇవ్వడం భారత పార్లమెంటు చరిత్రలో ఇదే మొదటిసారి.
ఏడు ఆరోపణలు
సీఈసీ జ్ఞానేశ్ కుమార్‌పై ప్రవేశపెట్టిన తీర్మానం నోటీసులో విపక్షాలు ఏడు ప్రధాన ఆరోపణలు చేసినట్టు తెలుస్తోంది. రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉండి పక్షపాత నిర్ణయాలు తీసుకుంటున్నారని, అనుచిత ప్రవర్తన రుజువైందని, ఎన్నికల అవకతవకలపై విచారణను ఉద్దేశపూర్వకంగా అడ్డుకుంటున్నారని, సామూహికంగా ఓటుహక్కును రద్దుచేశారని విపక్షాలు ఆరోపించాయి. కొన్ని పార్టీలకు అనుకూలంగా పక్షపాత వైఖరిని ప్రదర్శిస్తున్నారని కూడా నోటీసులో పేర్కొన్నాయి. తమ ఆరోపణలకు బలంచేకూర్చే పలు సుప్రీంకోర్టు తీర్పులను సైతం నోటీసులో ప్రస్తావించాయి. ఎస్ఐఆర్ ప్రక్రియలో కేంద్రంలోని అధికార పార్టీకి అనుకూలంగా సీఈసీ వ్యవహరిస్తున్నారని ఆరోపించాయి.
అభిశంసన ఇలా..
రాజ్యాంగ నిబంధనల ప్రకారం సుప్రీంకోర్టు న్యాయమూర్తిని తొలగించే పద్ధతిలోనే సీఈసీని తొలగించాల్సి ఉంటుంది. ఇందుకు లోక్‌సభలో 100 మంది, రాజ్యసభలో 50 మంది సంతకాలు అవసరం. స్పీకర్ నోటీసును అంగీకరిస్తే ముగ్గురు సభ్యులతో విచారణ కమిటీ ఈ ఆరోపణలను పరిశీలిస్తుంది. ఆరోపణలు నిజమని తేలితే తీర్మానంపై ఓటింగ్ నిర్వహిస్తారు. ఉభయసభల్లోనూ హాజరైన ఎంపీల్లో మూడింట రెండు వంతుల మెజారిటీ లభిస్తే తీర్మానం నెగ్గుతుంది.
ఇవి కూడా చదవండి..
తృణమూల్ కాంగ్రెస్ నేతలకు అపాయింట్‌మెంట్ ఇవ్వని రాష్ట్రపతి
మిడిల్‌ఈస్ట్‌లో హింసకు స్వస్తి పలకండి: ఇరాన్ అధ్యక్షుడు మసౌద్‌తో మోదీ