Share News

సీఎంలతో సమావేశమైన మోదీ.. ఇంధన సంక్షోభం, రాష్ట్రాల సన్నద్ధతపై సమీక్ష

ABN , Publish Date - Mar 27 , 2026 | 07:43 PM

పశ్చిమాసియాలో ఘర్షణలు, హోర్ముజ్ జలసంధి మూసివేత భయాల కారణంగా అంతర్జాతీయ సంక్షోభం తలెత్తడంతో రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుక్రవారం సాయంత్రం వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు.

సీఎంలతో సమావేశమైన మోదీ.. ఇంధన సంక్షోభం, రాష్ట్రాల సన్నద్ధతపై సమీక్ష
Modi virtual meeting with CMs

న్యూఢిల్లీ: పశ్చిమాసియాలో ఘర్షణలు, హోర్ముజ్ జలసంధి మూసివేత భయాల కారణంగా అంతర్జాతీయ సంక్షోభం తలెత్తడంతో రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుక్రవారం సాయంత్రం వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. ఇంధన సంక్షోభంపై చర్చించారు. పెట్రోల్, డీజిల్, ఎల్‌పీజీ, ఎరువుల సరఫరాకు ఎదురవుతున్న సమస్యలు, రాష్ట్రాల సన్నద్ధతను సమీక్షించారు. అసెంబ్లీ ఎన్నికలు ప్రకటించిన రాష్ట్రాల ముఖ్యమంత్రులు మినహా తక్కిన రాష్ట్రాల మఖ్యమంత్రులు ఈ వర్చువల్ సమావేశంలో పాల్గొన్నారు.


దేశ ఇంధన అవసరాలను తీర్చేందుకు, ఇంధన సరఫరా స్థిరంగా ఉండేందుకు కేంద్రం పలు చర్యలు తీసుకుంటోంది. అయితే క్షేత్రస్థాయిలో అమలు కోసం రాష్ట్రాల సహకారాన్ని ఇప్పటికే కోరింది. పశ్చిమాసియాలో పరిస్థితుల ప్రభావం అంతర్జాతీయంగా అన్ని దేశాలపై పడిందని, భారత్‌పైనా ప్రభావం ఉందని ప్రధాని మోదీ పార్లమెంటు ఉభయసభల్లోనూ ప్రకటించారు. కోవిడ్ మహమ్మారిని సమష్టిగా ఎదుర్కొన్నట్టే తాజా పరిస్థితులను కేంద్రం, రాష్ట్రాలు కలిసికట్టుగా ఎదుర్కోవాలని పిలుపునిచ్చారు. నిత్యావసర వస్తువుల సరఫరాకు ఎలాంటి అవాంతరం కలుగకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని రాష్ట్రాలను కోరారు. టీమిండియా స్పిరిట్‌తో పనిచేసి దేశానికి మారదర్శకంగా నిలవాల్సిన అవసరం ఉందన్నారు. ఈ క్రమంలో ముఖ్యమంత్రులతో మోదీ తాజాగా వర్చువల్ సమావేశంలో పాల్గొనడం ప్రాధాన్యం సంతరించుకుంది.


హాజరైన సీఎంలు

ప్రధానమంత్రి నిర్వహించిన వర్చువల్ మీట్‌లో కేంద్ర హోం మంత్రి అమిత్‌షా, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు, ఛత్తీస్‌గఢ్ సీఎం విష్ణు దేవ్ సాయి, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్, జేకీ సీఎం ఒమర్ అబ్దుల్లా, పంజాబ్ సీఎం భగవంత్ మాన్, మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్, జార్ఖాండ్ సీఎం హేమంత్ సోరెన్, ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామి, గుజరాత్ సీఎం భూపేంద్ర పటేల్, మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవిస్ తదితరులు పాల్గొన్నారు.


ఇవి కూడా చదవండి..

ఇంధన సమస్యల పర్యవేక్షణకు కేంద్ర మంత్రులతో కమిటీ

ఎరువుల కొరత లేదు, ఆందోళన వద్దు: లోక్‌సభలో జేపీ నడ్డా

Updated Date - Mar 27 , 2026 | 08:28 PM