విజయవంతంగా ముగిసిన ప్రధాని మోదీ 3 దేశాల పర్యటన..
ABN , Publish Date - Jul 11 , 2026 | 06:46 PM
ప్రధాని నరేంద్ర మోదీ ఇండోనేషియా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ దేశాలలో వారం రోజుల చరిత్రాత్మక పర్యటనను ఇవాళ విజయవంతంగా ముగించుకుని భారత్‌కు తిరుగుపయనమయ్యారు.
ఆక్లాండ్ (న్యూజిలాండ్), జులై 11: ప్రధాని నరేంద్ర మోదీ ఇండోనేషియా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ దేశాలలో వారం రోజుల చరిత్రాత్మక పర్యటనను ఇవాళ (శనివారం) విజయవంతంగా ముగించుకుని భారత్‌కు తిరుగుపయనమయ్యారు. పర్యటన చివరి రోజైన ఇవాళ, దాదాపు 40 ఏళ్ల తర్వాత న్యూజిలాండ్‌లో పర్యటించిన తొలి భారత ప్రధానిగా మోదీ సరికొత్త అధ్యాయాన్ని లిఖించారు. ఈ పర్యటనలో ఇరు దేశాల సంబంధాలను 'వ్యూహాత్మక భాగస్వామ్యం' స్థాయికి పెంచుతూ కీలక నిర్ణయాలు తీసుకున్నారు.
ప్రధాని మోదీకి వీడ్కోలు పలికేందుకు న్యూజిలాండ్ ప్రధాని క్రిస్టోఫర్ లక్సన్ స్వయంగా విమానాశ్రయానికి రావడం విశేషం. దీనిపై భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ (MEA) స్పందిస్తూ.. 'ఈ పర్యటన ఇరు దేశాల బంధాన్ని మరింత బలోపేతం చేసింది. భాగస్వామ్యాలను దృఢపరిచింది. ఉమ్మడి భవిష్యత్తుకు పునాది వేసింది' అని పేర్కొంది.
2030 నాటికి రూ.35,000 కోట్ల ద్వైపాక్షిక వ్యాపారమే లక్ష్యం
ఇటీవలే రికార్డు కాలంలో భారత్-న్యూజిలాండ్ మధ్య ఉచిత వాణిజ్య ఒప్పందం (FTA) కుదిరిన నేపథ్యంలో, ఇరు దేశాల ప్రధానులు'ఇండియా-న్యూజిలాండ్ స్ట్రాటజిక్ పార్టనర్‌షిప్ రోడ్‌మ్యాప్ 2030'ని ఆమోదించారు. దీని ప్రకారం 2030 నాటికి ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్యాన్ని 7 బిలియన్ న్యూజిలాండ్ డాలర్లకు (సుమారు రూ.35,000 కోట్లు)రెట్టింపు చేయాలని నిర్ణయించారు. ఇరు దేశాల మధ్య పర్యాటకాన్ని, వ్యాపారాన్ని పెంచేందుకు వీలుగా డైరెక్ట్ నాన్-స్టాప్ విమానాలను ప్రారంభించేలా ఎయిర్‌లైన్స్ సంస్థలను ప్రోత్సహించనున్నారు.
రక్షణ, వ్యవసాయ రంగాల్లో 18 కీలక ఒప్పందాలు
ఈ పర్యటనలో భాగంగా రక్షణ, సముద్ర భద్రత, విపత్తు నిర్వహణ, వ్యవసాయం, విద్య సహా వివిధ రంగాలలో 18 కీలక ఒప్పందాలను ప్రకటించారు.
రక్షణ, సముద్ర భద్రత
ఇండో-పసిఫిక్ ప్రాంతంలో సమాచార మార్పిడి, ఉమ్మడి కార్యకలాపాల కోసం భారత రక్షణ శాఖ, న్యూజిలాండ్ డిఫెన్స్ ఫోర్స్ మధ్య మారిటైమ్ కోఆపరేషన్ ఒప్పందం కుదిరింది.
నౌకాదళాల మధ్య పరస్పర లాజిస్టిక్స్ మద్దతు ఒప్పందంతో పాటు ఉగ్రవాద నిరోధకతపై జాయింట్ వర్కింగ్ గ్రూప్‌ను ఏర్పాటు చేయనున్నారు.
వ్యవసాయం, పరిశోధన
వ్యవసాయ ఉత్పాదకతను పెంచేందుకు ప్రత్యేక భాగస్వామ్యం కుదిరింది. ఇందులో భాగంగా నాగాలాండ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాలలో వ్యవసాయ ఆవిష్కరణలు, నైపుణ్యాభివృద్ధి కోసం రెండు 'సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్' సంస్థల్ని ఏర్పాటు చేయనున్నారు. పశుసంవర్ధక, డెయిరీ రంగాల్లో సాంకేతిక సహకారం కోసం ఒప్పందం కుదిరింది.
క్రీడలు, సంస్కృతి
హై-పెర్ఫార్మెన్స్ స్పోర్ట్స్, స్పోర్ట్స్ మెడిసిన్ అభివృద్ధికి జాయింట్ యాక్షన్ ప్లాన్ విడుదల చేశారు. గుజరాత్‌లోని లోథల్ నేషనల్ మారిటైమ్ హెరిటేజ్ కాంప్లెక్స్ (NMHC), న్యూజిలాండ్ మారిటైమ్ మ్యూజియం సంయుక్తంగా ప్రాజెక్టులు చేపట్టనున్నాయి.
ఇండోనేషియా, ఆస్ట్రేలియా పర్యటనల ముఖ్యాంశాలు:
న్యూజిలాండ్ కంటే ముందు ప్రధాని మోదీ సందర్శించిన రెండు దేశాల పర్యటనలు కూడా భారీ విజయాలను సాధించాయి.
ఇండోనేషియా (జూలై 6-8): ప్రెసిడెంట్ ప్రబోవో సుబియాంతో ద్వైపాక్షిక చర్చలు జరిపారు. భారత్-ఇండోనేషియా సాంస్కృతిక బంధానికి ప్రతీకగా నిలిచే, దాదాపు 1000 ఏళ్ల నాటి యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశమైన'ప్రాంబనన్ ఆలయం'పునరుద్ధరణ ప్రాజెక్టును ఇరు దేశాల నేతలు సంయుక్తంగా ప్రారంభించారు.
ఆస్ట్రేలియా (జూలై 9): ప్రధాని ఆంథోనీ అల్బనీస్‌తో కలిసి రక్షణ, వ్యూహాత్మక భద్రతపై జాయింట్ డిక్లరేషన్ చేశారు. ముఖ్యంగా, శాంతియుత అవసరాల కోసం ఆస్ట్రేలియా నుంచి భారతదేశానికి యురేనియం ఎగుమతి చేసేందుకు పరిపాలనాపరమైన ఏర్పాట్లను ఖరారు చేశారు.
క్రికెట్ ప్రియుల కోసం బిగ్ అప్‌డేట్:
ఆస్ట్రేలియా బిగ్ బాష్ లీగ్ (BBL 2026-27) చరిత్రలోనే మొదటిసారిగా ఆస్ట్రేలియా వెలుపల జరగబోతోంది. ఈ సీజన్ తొలి మ్యాచ్ డిసెంబర్ 12న చెన్నైలోని చిదంబరం స్టేడియంలో మెల్బోర్న్ రెనెగేడ్స్ vs పెర్త్ స్కార్చర్స్ మధ్య జరగనుందని ప్రధాని అల్బనీస్ ప్రకటించారు.
ప్రధాని మోదీ చేపట్టిన ఈ మూడు దేశాల పర్యటన ద్వారా భారతదేశానికి ఇండో-పసిఫిక్ ప్రాంతంలో వ్యూహాత్మక రక్షణ బలం పెరగడమే కాకుండా.. వాణిజ్యం, ఇంధన భద్రత, సాంకేతిక రంగాలలో సరికొత్త పెట్టుబడులకు మార్గం సుగమమైంది.
ఈ వార్తలు కూడా చదవండి
తెలంగాణ బులెట్ ట్రైన్స్ హబ్‌గా మారబోతోంది: అశ్వినీ వైష్ణవ్
ఐదు గనులకు ఫైవ్ స్టార్ రేటింగ్