Prime Minister Modi: వలసలే బెంగాల్‌కు పెద్ద సమస్య
ABN , Publish Date - Jan 18 , 2026 | 03:44 AM
అక్రమ వలసలతో బెంగాల్‌ను అధికార తృణమూల్ కాంగ్రెస్ నింపివేసిందని ప్రధాని మోదీ ఆరోపించారు. దీనివల్లే బెంగాల్ తరచూ మత ఘర్షణల్లో చిక్కుకుంటోందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.
ఈ పాపం మమతా బెనర్జీదే.. చొరబాటుదార్లతో బెంగాల్‌ను నింపేశారు
తరచూ మత ఘర్షణలకు కారణం ఇదే
‘ముంబై’ ఫలితమే బెంగాల్‌లో సాధిస్తాం
బీజేపీ వెంటే జన్ జీ తరం : ప్రధాని మోదీ
మాల్దా (పశ్చిమబెంగాల్), జనవరి 17 : అక్రమ వలసలతో బెంగాల్‌ను అధికార తృణమూల్ కాంగ్రెస్ నింపివేసిందని ప్రధాని మోదీ ఆరోపించారు. దీనివల్లే బెంగాల్ తరచూ మత ఘర్షణల్లో చిక్కుకుంటోందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. వలసలే బెంగాల్‌కు ఇప్పుడు పెద్ద సమస్యగా పరిణమించాయని, బీజేపీ రాష్ట్రంలో అధికారంలోకి రాగానే చొరబాట్లు, చొరబాటుదారులను అణచివేస్తుందని మోదీ అన్నారు. శనివారం బెంగాల్‌లో పర్యటించిన ఆయన, తొలి వందేభారత్ స్లీపర్ రైలును మాల్దాలో జెండా ఊపి ప్రారంభించారు. ఈ రైలు బెంగాల్‌లోని హవ్‌డా నుంచి అసోంలోని గువాహటి వరకు నడుస్తుంది. పూర్తిగా ఏసీ కోచ్‌లతో దీనికి సిద్ధం చేశారు. మాల్దా వేదికగానే రెండో తరానికి చెందిన నాలుగు అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లకు జెండా ఊపి మోదీ ప్రారంభించారు. రూ.3వేల కోట్లకు పైగా విలువైన రైలు, రోడ్డు ప్రాజెక్టులను ఇక్కడినుంచి ఆయన ప్రారంభించారు.
అనంతరం జరిగిన సభలో మోదీ మాట్లాడుతూ.. మాతా కాళీ పవిత్ర భూమి నుంచి మాతా కామఖ్య పుణ్య ప్రాంతం వరకు వందేభారత్ స్లీపర్ రైలును ప్రారంభించడం సంతోషంగా ఉన్నదన్నారు. అనంతరం వందేభారత్ స్లీపర్ రైలులో ప్రయాణించి కొందరు ప్రయాణికులతో ఆయన మాట్లాడారు. ఈ సర్వీసులను త్వరలోనే దేశమంతా విస్తరిస్తామన్న ఆయన, ప్రస్తుతం 150 వందేభారత్ రైళ్లు పట్టాలపై ఉన్నాయన్నారు. అమృత్ భారత్ ఎక్స్‌ప్రె్‌సలు ఉత్తర బెంగాల్‌ను పశ్చిమ, దక్షిణ భారతాలతో కలుపుతాయని తెలిపారు. అనంతరం.. బెంగాలీ యువత, విద్యార్థులు, సాఫ్ట్‌వేర్ నిపుణులు బెంగళూరుకు సులువుగా చేరుకునేందుకు వీలుగా ప్రత్యేకంగా రూపొందించిన రెండు కొత్త రైలు సర్వీసులను ఆయన ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ పాల్గొన్నారు. అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్‌లు కొత్త తరం రైలు సర్వీసులు. అందుబాటు ధరల్లో, ఆధునిక సౌకర్యాలతో అంతర్రాష్ట మార్గాల్లో ప్రయాణించేందుకు వీలుగా తయారుచేశారు. స్లీపర్ క్లాసులో 200 కిలోమీటర్లు, సెకండ్ క్లాసులో యాభై కిలోమీటర్ల వరకు కనిష్ఠ చార్జీతో ప్రయాణించవచ్చు. ఈ దూరాలకు స్లీపర్‌లో రూ.149, సెకండర్ క్లాసులో రూ.36ను వసూలు చేస్తారు. ఈ సర్వీసుల్లో ఆర్‌ఏసీని అనుమతించరు. స్లీపర్‌లో మహిళలు, దివ్యాంగులు, వృద్ధులకు మాత్రమే రిజర్వేషన్ కోటా ఉంటుంది.
అండగా ఉంటాం : మోదీ
బంగ్లాదేశ్‌లో మతదాడులకు గురయి, బెంగాల్‌లోకి వలస వచ్చిన మథువాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని, ‘సర్’ వల్ల ఇబ్బందులు రాకుండా చూస్తామని మోదీ హామీ ఇచ్చారు. అక్రమ వలసల తాకిడివల్ల స్థానిక భాషలు, సంస్కృతులు, ఆహార్యం..అన్నీ మారిపోతున్నాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఆ పాపం సీఎం మమతా బెనర్జీదేనని ఆయన మండిపడ్డారు. తృణమూల్ నేతలు, చొరబాటుదారుల మధ్య కుమ్మక్కును బద్దలుకొట్టాలని ఆయన పిలుపునిచ్చారు. ముంబై మునిసిపల్ ఎన్నికల ఫలితాలను ప్రస్తావిస్తూ.. అలాంటి ఫలితమే బీజేపీకి బెంగాల్‌లో లభించనున్నదని మోదీ ధీమా వ్యక్తం చేశారు. బీజేపీ అభివృద్ధి నమూనా పట్ల జన్ జీ తరం సుముఖంగా ఉన్నదన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి
Kollam Vigilance Court: శబరిమల బంగారం చోరీ కేసు.. సిట్‌కు చేరిన శాస్త్రీయ నివేదిక