కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ డీప్‌ఫేక్ వీడియోపై కేసు నమోదు..
ABN , Publish Date - Jul 25 , 2026 | 10:40 AM
తన డీప్‌ఫేక్ వీడియోపై చాణక్యపురి పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైందని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. పార్లమెంటు వెలుపల తాను మీడియాతో మాట్లాడిన వ్యాఖ్యలను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఉపయోగించి దురుద్దేశపూర్వకంగా మార్చేశారని ఆయన ఆరోపించారు.
న్యూఢిల్లీ: తన డీప్‌ఫేక్ వీడియోపై చాణక్యపురి పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైందని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. పార్లమెంటు వెలుపల తాను మీడియాతో మాట్లాడిన వ్యాఖ్యలను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఉపయోగించి దురుద్దేశపూర్వకంగా మార్చేశారని ఆయన ఆరోపించారు. తన మాటలతో డీప్‌ఫేక్ వీడియో సృష్టించి ప్రచారం చేశారని కేంద్ర మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై తాను పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు పేర్కొన్నారు. దీంతో ఈరోజు (శనివారం) తెల్లవారుజామున 4:35 గంటలకు చాణక్యపురి పోలీస్ స్టేషన్‌లో ఎఫ్‌ఐఆర్ నమోదైందని పీయూష్ గోయల్ ఎక్స్ వేదికగా వెల్లడించారు.
నకిలీ వీడియోను సృష్టించి సోషల్ మీడియా వేదికగా ప్రచారం చేసిన ప్రతి ఒక్కరిపైనా చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని కేంద్ర మంత్రి హెచ్చరించారు. ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు కృత్రిమ మేధను బాధ్యతారహితంగా దుర్వినియోగం చేయడాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని పేర్కొన్నారు. ఈ సందర్భంగా అధికారిక సమాచారాన్ని మాత్రమే నమ్మాలని ప్రజలకు కేంద్ర మంత్రి పిలుపునిచ్చారు. దేశంలో చైతన్యవంతులైన పౌరులు, సాంకేతిక పరిజ్ఞానం కలిగిన యువత ఉన్నారన్నారు. వారు ఇటువంటి తప్పుడు సమాచారానికి బలికారనే నమ్మకం తనకు ఉందన్నారు కేంద్ర మంత్రి.
కేంద్రం హామీ తర్వాత సామాజిక కార్యకర్త సోనమ్ వాంగ్‌చుక్ నిరాహార దీక్షను విరమించారని పీయూష్ గోయల్ పేర్కొన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని ప్రభుత్వ నిబద్ధతపై వాంగ్‌చుక్‌కు ఉన్న నమ్మకమే ఈ నిర్ణయానికి నిదర్శనమని ఆయన తెలిపారు. వాంగ్‌చుక్ లేవనెత్తిన సమస్యలను పరిష్కరించడానికి కేంద్రం కట్టుబడి ఉందన్నారు. పరీక్షా సంస్కరణలను బలోపేతం చేయడానికి, పేపర్ లీక్‌లపై కఠిన చర్యలు తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పారు. దేశ యువత ప్రయోజనాలకే ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇస్తోందన్నారు.
ఈ విషయంపై కేంద్ర ప్రభుత్వం కూడా స్పందించింది. ఢిల్లీలో నిరసన చేస్తున్న విద్యార్థులపై పీయూష్ గోయల్ బెదిరింపు వ్యాఖ్యలు చేశారనే వార్తలను ఖండించింది. ఆ వీడియో ఫేక్ అని స్పష్టం చేసింది.
ఈ వార్తలు కూడా చదవండి
నల్ల సముద్రంలో నౌకపై దాడి.. భారతీయుడి మృతి..
సోనమ్ వాంగ్‌చుక్‌పై విమర్శలు.. ఆవేదన వ్యక్తం చేస్తూ వీడియో రిలీజ్..