సోనమ్ వాంగ్‌చుక్‌పై విమర్శలు.. ఆవేదన వ్యక్తం చేస్తూ వీడియో రిలీజ్..
ABN , Publish Date - Jul 25 , 2026 | 07:56 AM
కేంద్ర ప్రభుత్వంతో రహస్య ఒప్పందం చేసుకుని నిరాహార దీక్షను విరమించారంటూ వస్తున్న విమర్శలపై ప్రముఖ సామాజిక కార్యకర్త సోనమ్ వాంగ్‌చుక్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. తనపై వస్తున్న ఆరోపణలు బాధాకరమని పేర్కొంటూ చికిత్స పొందుతున్న ఆస్పత్రి నుంచే ఓ వీడియో సందేశాన్ని విడుదల చేశారు.
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వంతో రహస్య ఒప్పందం చేసుకుని నిరాహార దీక్షను విరమించారంటూ వస్తున్న విమర్శలపై ప్రముఖ సామాజిక కార్యకర్త సోనమ్ వాంగ్‌చుక్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. తనపై వస్తున్న ఆరోపణలు బాధాకరమని పేర్కొంటూ చికిత్స పొందుతున్న ఆస్పత్రి నుంచే ఆయన ఓ వీడియో సందేశాన్ని విడుదల చేశారు. తన నిజాయతీని ప్రశ్నించడం అత్యంత దురదృష్టకరమని వాంగ్‌చుక్ వాపోయారు.
ఢిల్లీలోని జంతర్‌మంతర్‌లో 26 రోజుల పాటు నిరాహార దీక్ష చేపట్టిన వాంగ్‌చుక్ ఇటీవల కేంద్ర మంత్రులు జేపీ నడ్డా, జితేంద్ర సింగ్ సమక్షంలో దీక్షను విరమించారు. అయితే కేంద్రంతో ఏదో ఒప్పందం కుదుర్చుకున్న తర్వాతే దీక్ష విరమించారని సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో స్పందించిన వాంగ్‌చుక్ '26 రోజుల పాటు ఆకలితో ఉండి నా నిజాయతీని ఇంకా నిరూపించుకోవాలా?, నా దీక్ష పవిత్రమైనది. దానికి ఇప్పుడు క్యారెక్టర్ సర్టిఫికెట్ కూడా తెచ్చుకోవాలా?' అంటూ ప్రశ్నించారు. తన దీక్ష కారణంగా ఆరోగ్యం తీవ్రంగా దెబ్బతిన్నట్లు ఆయన వెల్లడించారు. 26 రోజుల నిరాహార దీక్షలో 11 కిలోల బరువు తగ్గానని, శరీరంలోని కండరాలు క్షీణించాయని ఆవేదన వ్యక్తం చేశారు.
అంతేకాకుండా శరీర అవయవాలు, మెదడుపైనా తీవ్ర ప్రభావం పడిందని, పరిస్థితి ప్రమాదకర స్థాయికి చేరుకుందని వాంగ్‌చుక్ వివరించారు. కేంద్రంతో ఒప్పందం చేసుకోవాలనుకుంటే 26 రోజుల పాటు ఢిల్లీ ఎండలో రోడ్డుపై కూర్చొని దీక్ష చేయాల్సిన అవసరం ఏముందని ఈ సందర్భంగా విమర్శకులను ఆయన ప్రశ్నించారు. 'డీల్ చేయాలనుకుంటే విలాసవంతమైన ఏసీ గదిలో కూర్చొని చేసేవాడిని. ఇందుకోసం నెల రోజుల పాటు ఆకలితో అలమటించాల్సిన అవసరం లేదు' అంటూ ఘాటుగా సమాధానం ఇచ్చారు. ఈ సందర్భంగా తనకు అండగా నిలిచిన వేలాది మంది ప్రజలకు వాంగ్‌చుక్ కృతజ్ఞతలు తెలిపారు. కష్టకాలంలో అండగా నిలిచిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు చెప్పారు.
ఆందోళన కొనసాగుతుందన్న సీజేపీ..
ఇదిలా ఉండగా.. వాంగ్‌చుక్ దీక్ష విరమించినప్పటికీ తమ ఆందోళన కొనసాగుతుందని కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) ప్రతినిధి ఆశుతోష్ రాంకా తెలిపారు. కేంద్ర ప్రభుత్వం పేపర్ లీకేజీలపై కొన్ని చర్యలు ప్రకటించినా, సమస్య మూలాలను పరిష్కరించే చర్యలు ఇంకా అవసరమని పేర్కొన్నారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసే వరకు తమ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు. వాంగ్‌చుక్ ఆరోగ్య పరిస్థితి విషమించడంతోనే దీక్ష విరమించాలని తామే పలుమార్లు కోరినట్లు రాంకా వెల్లడించారు.
ఈ వార్తలు కూడా చదవండి
నల్ల సముద్రంలో నౌకపై దాడి.. భారతీయుడి మృతి..