కేంద్రం దిద్దుబాట
ABN , Publish Date - Jul 25 , 2026 | 06:53 AM
నీట్ పరీక్ష పేపర్ లీకేజీపై విద్యార్థులు దేశవ్యాప్తంగా తీవ్ర నిరసన తెలుపుతున్న వేళ కేంద్ర ప్రభుత్వం దిద్దుబాటు చర్యలు చేపట్టింది. నీట్, జేఈఈ సహా పలు జాతీయ స్థాయి పరీక్షలు నిర్వహించే..
ఎన్టీఏలో భారీ ప్రక్షాళన.. 47 మంది ఉద్యోగులపై వేటు
కొలువుల నుంచి శాశ్వతంగా తొలగింపు
వారిలో కొందరిపై సివిల్, క్రిమినల్ చర్యలు
ఎన్టీఏకు మంజూరైన రెగ్యులర్ పోస్టులు 39
ప్రస్తుతం ఉన్న రెగ్యులర్ ఉద్యోగులు 24 మందే..
కొన్ని పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ పరీక్షల నిర్వహణలో భారీ మార్పులకు శ్రీకారం నెల రోజులుగా సాగుతున్న విద్యార్థుల ఆందోళనలపై కేంద్ర ప్రభుత్వం ఎట్టకేలకు దిద్దుబాటు చర్యలు ప్రారంభించింది! కాక్రోచ్ జనతా పార్టీ ప్రతినిధులతో చర్చలు జరిపింది! పేపర్ లీకేజీ కారణంగా ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల కుటుంబాలకు పరిహారం ఇచ్చేందుకు, ఆందోళనకారులపై కేసుల ఉపసంహరణకు సూత్రప్రాయంగా అంగీకరించింది! కానీ, ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాపై ఉత్కంఠ కొనసాగుతోంది. దీనిపై శనివారం కూడా చర్చలు జరగనున్నాయి! ఇక, లీకేజీ కారకులపై కఠిన చర్యలు తీసుకునేందుకు వీలుగా ప్రస్తుత చట్టంలో సవరణ చేయనుంది. ముసాయిదా బిల్లుకు క్యాబినెట్ ఆమోదం తెలిపింది! ఎన్టీఏలో ప్రక్షాళనకు శ్రీకారం చుట్టింది!
న్యూఢిల్లీ, జూలై 24: నీట్ పరీక్ష పేపర్ లీకేజీపై విద్యార్థులు దేశవ్యాప్తంగా తీవ్ర నిరసన తెలుపుతున్న వేళ కేంద్ర ప్రభుత్వం దిద్దుబాటు చర్యలు చేపట్టింది. నీట్, జేఈఈ సహా పలు జాతీయ స్థాయి పరీక్షలు నిర్వహించే స్వయంప్రతిపత్తి సంస్థ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) 47 మంది ఉద్యోగులను శాశ్వతంగా ఉద్యోగాల నుంచి తొలగిస్తున్నట్లు ప్రకటించింది. వారిలో కొందరిపై లీగల్, క్రిమినల్ చర్యలు చేపట్టనున్నట్లు ఎన్టీఏ వర్గాలు శుక్రవారం తెలిపాయి. అయితే, ఉద్యోగాల నుంచి ఎవరిని తొలగించారన్న వివరాలను బయటపెట్టలేదు. కేంద్ర విద్యాశాఖ కార్యదర్శి వినీత్ జోషీని పంచాయతీరాజ్ శాఖకు బదిలీ చేసిన మరుసటి రోజే ఎన్టీఏలో భారీ ప్రక్షాళన మొదలు కావటం విశేషం. ఎన్టీఏను కేంద్ర ప్రభుత్వం 2017లో ఏర్పాటు చేసింది. నీట్, జేఈఈ, సీయూఈటీ వంటి జాతీయ స్థాయి పరీక్షల నిర్వహణ కోసం స్వయంప్రతిపత్తి సంస్థగా దీనిని ఏర్పాటు చేశారు. ఈ సంస్థ ప్రస్తుత పరిస్థితిపై కేంద్ర విద్యాశాఖ ఈ నెల 22న రాజ్యసభకు వివరణ ఇచ్చింది. సంస్థలో మంజూరైన శాశ్వత పోస్టులు 39 కాగా, ప్రస్తుతం 24 మంది రెగ్యులర్ ఉద్యోగులు మాత్రమే ఉన్నట్లు తెలిపింది. 74 మంది కాంట్రాక్టు, 124 మంది అవుట్‌సోర్సింగ్ ఉద్యోగులు ఉన్నట్లు వివరించింది. వీరిలో ఎవరిని ఉద్యోగాల నుంచి తొలగించిందో మాత్రం శుక్రవారం వెల్లడించలేదు. కాగా, కొన్ని జనరల్ మేనేజర్ స్థాయి ప్రొఫెషనల్ పోస్టుల భర్తీకి ఎన్టీఏ తాజాగా నోటిఫికేషన్ జారీచేసింది. యూపీఎస్సీకి చెందిన ప్రతిభా సేతు పోర్టల్ ద్వారా 16మందిని నియమించుకోవాలని నిర్ణయించింది.
పరీక్షల నిర్వహణ లో భారీ మార్పులు
జాతీయ స్థాయి పోటీ పరీక్షల నిర్వహణలో ఎన్టీఏ ఎక్కువగా అవుట్‌సోర్సింగ్ విధానాన్ని అనుసరిస్తుంది. పరీక్ష పేపర్ తయారీ మాత్రమే ఎన్టీఏ చూసుకుంటుంది. పేపర్ ముద్రణ, పరీక్ష కేంద్రాలకు తరలింపు, స్ట్రాంగ్ రూముల్లో భద్రపర్చటం, పరీక్షల నిర్వహణ, పరీక్ష కేంద్రాల్లో విద్యార్థుల బయోమెట్రిక్ వివరాల సేకరణ, విద్యార్థులను భౌతికంగా చెక్‌చేయటం, సీసీటీవీ కెమెరాల నిర్వహణ వంటి పనులన్నీ వివిధ సంస్థలకు అప్పగిస్తుంది. ఎంపిక చేసిన సబ్జెక్టు నిపుణుల నుంచి ప్రశ్నలు సేకరించి, అన్నీ కలిపి తుది పరీక్ష పేపర్‌ను తయారు చేస్తారు. ఈ ప్రక్రియ మొత్తాన్ని అత్యంత గోప్యంగా ఉంచుతారు. పరీక్ష పేపర్‌ను ఎక్కడ ముద్రిస్తున్నారన్న విషయం సంస్థలోని ఉన్నత స్థాయి అధికారులు ఒకరిద్దరికి మాత్రమే తె లుస్తుంది. అయితే, పరీక్ష పేపర్ ముద్రణ నుంచి పరీక్ష నిర్వహణ వరకు ఉండే వివిధ దశల్లో అవుట్‌సోర్సింగ్ సంస్థల మధ్య ఏమాత్రం సమన్వయం లోపించినా తీవ్ర పరిణామాలకు దారితీస్తుంది. ఎన్టీఏలో ఉద్యోగులు చాలా తక్కువ మంది ఉన్నందున అవుట్‌సోర్సింగ్ విధానం తప్పనిసరి అయ్యిందని ఆ సంస్థ వర్గాలు తెలిపాయి. తాజాగా నీట్ పేపర్ లీకేజీ వివాదం నేపథ్యంలో ఈ విధానంలో సమూల మార్పులు తీసుకురానున్నట్లు వెల్లడించాయి.
ఈ వార్తలు కూడా చదవండి..
స్థానిక సమస్యలపై దృష్టి పెట్టండి.. జనసేన నేతలకు మంత్రి మనోహర్ సూచన
అమరావతి ఎన్‌జీఓ టవర్స్ నిర్మాణ పనుల్లో మరో ముందడుగు
Read Latest AP News And Telugu News