Share News

ఫిలిబెక్‌ వ్యాఖ్యలపై సుప్రీంలో పిల్‌

ABN , Publish Date - Nov 18 , 2026 | 04:28 AM

హైదరాబాద్‌ వేదికగా జరిగిన ‘భారత్‌ సమ్మిట్‌--2026’లో ఇటలీకి చెందిన గియోకోమో ఫిలిబెక్‌ చేసిన ‘ఓట్‌ చోరీ’ వ్యాఖ్యలపై సుప్రీంకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలైంది

ఫిలిబెక్‌ వ్యాఖ్యలపై సుప్రీంలో పిల్‌
SUPREMECOURT

  • భారత్‌ సమ్మిట్‌లో ఇటలీ నేత వ్యాఖ్యలపై అభ్యంతరం

  • ‘ఓట్‌ చోరీ’పై మాట్లాడి నిబంధనల్ని ఉల్లంఘించారని ఆరోపణ

  • సోషల్‌ మీడియాలో ఆ వీడియోలను తొలగించాలని,

  • సమ్మిట్‌ నిర్వహణపై సిట్‌తో దర్యాప్తు చేయించాలని విజ్ఞప్తి

న్యూఢిల్లీ, నవంబరు 17 (ఆంధ్రజ్యోతి): హైదరాబాద్‌ వేదికగా జరిగిన ‘భారత్‌ సమ్మిట్‌--2026’లో ఇటలీకి చెందిన గియోకోమో ఫిలిబెక్‌ చేసిన ‘ఓట్‌ చోరీ’ వ్యాఖ్యలపై సుప్రీంకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. ‘పార్టీ ఆఫ్‌ యూరోపియన్‌ సోషలిస్ట్స్‌’ సెక్రటరీ జనరల్‌ అయిన ఫిలిబెక్‌.. ఓట్‌ చోర్‌, గద్దీ ఛోడ్‌ నినాదం ఇస్తూ, కాంగ్రెస్‌ పార్టీకి మద్దతుగా మాట్లాడిన వీడియోలను సామాజిక మాధ్యమాల నుంచి తొలగించాలని కోరుతూ జాహిద్‌ అలీ అనే వ్యకి ఈ పిటిషన్‌ దాఖలు చేశారు. అలాగే విదేశీ ప్రతినిధులకు మంజూరు చేసిన అనుమతులు, అధికారులు, నిర్వాహకుల పాత్రతోపాటు ఈ కార్యక్రమం నిర్వహణపై స్వతంత్ర ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్‌)తో విచారణ జరిపించాలని అభ్యర్థించారు.


భవిష్యత్తులో ఇలాంటి తప్పిదాలు జరగకుండా చూస్తామని రాష్ట్ర ప్రభుత్వం, సమ్మిట్‌ నిర్వాహకుల నుంచి హామీ తీసుకోవాలని, ఈ ఘటనకు తెలంగాణ ప్రభుత్వం బహిరంగ క్షమాపణలు చెప్పేలా ఆదేశించాలని పిటిషన్‌లో విజ్ఞప్తి చేశారు. ఈ నెల 14న హైదరాబాద్‌లో జరిగిన సదస్సులో ఫిలిబెక్‌ ‘ఓట్‌ చోర్‌, గద్దీ ఛోడ్‌’ నినాదాన్ని లేవనెత్తి.. రాహుల్‌గాంధీ, కాంగ్రెస్‌ పార్టీ రాజకీయ ప్రచారాన్ని సమర్థించారని పిటిషనర్‌ ఆరోపించారు. ఫిలిబెక్‌ వ్యాఖ్యలు కేవలం సదస్సులో పాల్గొనడానికి మాత్రమే పరిమితం కాలేదన్నారు. దేశంలో పర్యటించే విదేశీ పౌరులకు అనుమతించే రాజకీయ కార్యక్రమాలు, వారి భాగస్వామ్యాన్ని నియంత్రించే నిబంధనలపై ఈ సంఘటన పలు ప్రశ్నలను లేవనెత్తుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. కాన్ఫరెన్స్‌ వీసాల కోసం కేంద్ర హోంశాఖ జారీ చేసిన మార్గదర్శకాల ప్రకారం విదేశీయుల పర్యటన కేవలం సంబంధిత సదస్సు, సెమినార్‌ లేదా వర్క్‌షా్‌పకే పరిమితం కావాలని పిటిషనర్‌ గుర్తుచేశారు. రాజకీయ, సున్నితమైన అంశాలతో కూడిన కార్యక్రమాల్లో పాల్గొనడంపై ఆంక్షలు ఉంటాయన్నారు. సామాజిక మాధ్యమాల్లో జరిగే సాధారణ రాజకీయ చర్చలపై గానీ, చట్టబద్ధమైన భావప్రకటన స్వేచ్ఛపై గానీ ఆంక్షలు కోరడం లేదని తెలిపారు.

ఇవి కూడా చదవండి..

ఢిల్లీలో కుప్పకూలిన 50 ఏళ్ల నాటి భవనం.. చిన్నారితో సహా ఇద్దరి మృతి

గ్రామాల విలీనంపై సుప్రీం విచారణ వాయిదా

Updated Date - Nov 18 , 2026 | 04:29 AM