Share News

పాకిస్థాన్‌కు ‘పీవోకే’ పోటు!

ABN , Publish Date - Jul 01 , 2026 | 07:05 AM

‘‘మేం పాకిస్థాన్‌లో భాగం కాదు. మా స్వతంత్ర ప్రతిపత్తిని తొక్కేయవద్దు. మా ప్రాంతంపై మాకే నిర్ణయాధికారం ఉండాలి’’ అంటూ పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌(పీవోకే) ప్రజలు పాకిస్థాన్‌ ప్రభుత్వానికి...

పాకిస్థాన్‌కు ‘పీవోకే’ పోటు!

  • పాక్‌ ప్రభుత్వానికి వ్యతిరేకంగా జేఏఏసీ ఆధ్వర్యంలో నిరసనలు

  • గోధుమల కొరత, నిరుద్యోగం, స్థానిక హక్కుల కోసం కొన్నేళ్లుగా పోరాటం

  • తాజాగా తమ ప్రాంతంపై నిర్ణయాధికారం తమ చేతుల్లోనే ఉండాలనే డిమాండ్‌

  • అణచివేతకు దిగిన పాక్‌.. పోలీసు కాల్పుల్లో 24 మంది నిరసనకారుల మృతి

  • ఆందోళనలను ఉధృతం చేసిన జేఏఏసీ.. తాము పాక్‌లో భాగం కాదంటూ ఫైర్‌

న్యూఢిల్లీ/రావల్‌కోట్‌, జూన్‌ 30: ‘‘మేం పాకిస్థాన్‌లో భాగం కాదు. మా స్వతంత్ర ప్రతిపత్తిని తొక్కేయవద్దు. మా ప్రాంతంపై మాకే నిర్ణయాధికారం ఉండాలి’’ అంటూ పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌(పీవోకే) ప్రజలు పాకిస్థాన్‌ ప్రభుత్వానికి ఎదురుతిరిగారు. పీవోకేలో నిత్యావసరాల ధరల పెరుగుదల, నిరుద్యోగం తదితర సమస్యలపై పాక్‌ ప్రభుత్వాన్ని నిలదీస్తూ కొన్నేళ్ల క్రితం ‘జమ్మూకశ్మీర్‌ జాయింట్‌ అవామీ యాక్షన్‌ కమిటీ(జేకే జేఏఏసీ)’ ఏర్పడింది. అప్పటి నుంచీ ఇది స్థానిక హక్కుల కోసం పోరాడుతూ వస్తోంది. ఇటీవల పాక్‌ ప్రభుత్వం పీవోకే అసెంబ్లీలో 12 స్థానాలను పీవోకే నుంచి పాకిస్థాన్‌లోకి వెళ్లి స్థిరపడిన శరణార్థుల కోసం రిజర్వు చేసింది. పీవోకే అసెంబ్లీకి జూలై 27 ఎన్నికలు జరగాల్సి ఉంది. ఇలాంటి సమయంలో పాక్‌ తీరు పీవోకేలో మంటలు పుట్టించింది. పాకిస్థాన్‌లో స్థిరపడినవారి ఓట్లతో తమ ప్రజాప్రతినిధులను ఎన్నుకోవడం ఏమిటంటూ జేఏఏసీ భారీ ఎత్తున ఆందోళనలకు దిగింది. రావల్‌కోట్‌, ముజఫరాబాద్‌, మీర్పూర్‌ తదితర ప్రాంతాల్లో వేలాది మంది నిరసనలకు దిగారు. పాక్‌ ప్రభుత్వం ఈ ఆందోళనలను పాశవికంగా అణచివేసేందుకు ప్రయత్నించింది. పోలీసుల కాల్పుల్లో 24 మంది నిరసనకారులు మరణించారు. దీంతో, ఆందోళనలు మరింత ఉధృతమయ్యాయి. పాక్‌ ప్రభుత్వం మరింతగా అణచివేత చర్యలకు దిగింది. కీలక నేతలను ఉగ్రవాదులంటూ అరెస్టు చేసింది, ఇంటర్నెట్‌ నిలిపివేసింది. పాకిస్థాన్‌లోని కీలక ప్రాంతాలకు వెళ్లే రహదారులను మూసివేసి.. నిత్యావసరాలు పీవోకేకు చేరకుండా అడ్డుకుంది. ఉగ్రవాద ఆరోపణలతో జేఏఏసీపై నిషేధం విధించింది.

మేం పాక్‌లో భాగం కాదు..

మంగళవారం రావల్‌కోట్‌లోని ఈద్గా మైదానంలో వేలాది మంది నిరసనకారులు భారీ బహిరంగ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా పీవోకే నాయకుడు అమన్‌ ఖాన్‌ మాట్లాడుతూ ‘మాకు మీ రేషన్‌ అవసరం లేదు. మీకే మేము అవసరం’ అని పాక్‌ ప్రభుత్వాన్ని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. సరఫరాల నిలిపివేత కొనసాగితే తమ మనుగడ కోసం స్థానికులు ఇతర మార్గాలు చూసుకుంటారని హెచ్చరించారు. పీవోకేలో పాకిస్థాన్‌ ప్రభుత్వం, సైన్యం వ్యవహరిస్తున్న తీరు దారుణంగా ఉందని ‘యునైటెడ్‌ కశ్మీర్‌ పీపుల్స్‌ నేషనల్‌ పార్టీ(యూకేపీఎన్‌పీ)’కూడా మండిపడింది. పీవోకేలో పాక్‌ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై ఐరాస మానవ హక్కుల సంఘం(యూఎన్‌హెచ్‌ఆర్‌సీ) కూడా ఆందోళన వ్యక్తం చేసింది.


అఫ్గాన్‌పై పాక్‌ వైమానిక దాడులు

  • 36మంది పౌరులు మృతి!

అఫ్గానిస్థాన్‌ సరిహద్దు వెంబడి పాకిస్థాన్‌ సైన్యం ఆదివారం రాత్రి జరిపిన వైమానిక దాడుల్లో 36మంది పౌరులు మరణించగా, 163మందికి పైగా గాయపడ్డారు. శనివారం కరాచీలో జరిగిన ఉగ్రవాద దాడికి ప్రతీకారంగా ఈ సైనిక చర్య చేపట్టామని, ఉగ్ర స్థావరాలే లక్ష్యంగా దాడులు చేశామని పాకిస్థాన్‌ ప్రకటించింది. మృతులంతా ఉగ్రవాదులేనని పాకిస్థాన్‌ వాదిస్తుండగా.. అమాయక పౌరులు, చిన్నారులు ప్రాణాలు కోల్పోయారని ఆఫ్గనిస్థాన్‌ ఆరోపిస్తోంది. ఈ దాడుల్లో పాక్‌ సైన్యం అనుసరించిన డబుల్‌ ట్యాప్‌ (ఒకసారి బాంబు దాడి జరిగిన తర్వాత, సహాయక చర్యల కోసం జనం గుమిగూడినపుడు రెండోసారి దాడి చేయడం) వ్యూహం తీవ్ర విమర్శలకు దారి తీసింది. కాగా, పాక్‌ దాడులను భారత్‌ తీవ్రంగా ఖండించింది.

ఇవి కూడా చదవండి

ధాన్యం ఉత్పత్తి, సేకరణలో దేశంలోనే తెలంగాణ టాప్‌: తుమ్మల

హీరో అవ్వాలని చూశాడు.. తిలక్ వర్మపై కృష్ణమాచారి సంచలన వ్యాఖ్యలు!

Updated Date - Jul 01 , 2026 | 07:05 AM