ధాన్యం ఉత్పత్తి, సేకరణలో దేశంలోనే తెలంగాణ టాప్: తుమ్మల
ABN , Publish Date - Jun 30 , 2026 | 08:01 PM
రైతు సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్పష్టం చేశారు. తెలంగాణను గత ప్రభుత్వం అన్ని రంగాల్లో వెనక్కి నెట్టిందని విమర్శించారు.
హైదరాబాద్: గత బీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణను అన్ని రంగాల్లో విధ్వంసం చేసిందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు విమర్శించారు. హైదరాబాద్‌లో జరిగిన రైతు భరోసా సభలో మాట్లాడుతూ రైతుల సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు. ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు రూ.2 లక్షలలోపు రైతు రుణాలను మాఫీ చేశామని మంత్రి తెలిపారు. అధికారంలోకి వచ్చిన తొలి ఏడాదిలోనే రైతుల ఖాతాల్లో రూ.22 వేల కోట్లకు పైగా జమ చేసినట్లు వెల్లడించారు.
గత బీఆర్ఎస్ ప్రభుత్వం రూ.లక్ష వరకు రుణమాఫీ చేస్తామని ప్రకటించినప్పటికీ పూర్తి స్థాయిలో అమలు చేయలేదని అన్నారు. రైతు సమస్యలను గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని విమర్శించారు. 'కేసీఆర్ ఒక్క రైతుబంధు ఇచ్చి.. అన్నీ బంద్ చేశారు' అంటూ మంత్రి తుమ్మల వ్యాఖ్యానించారు. కేంద్ర ప్రభుత్వం నిధులు అందించే పలు వ్యవసాయ పథకాలను కూడా అప్పటి ప్రభుత్వం అమలు చేయకుండా నిలిపివేసిందని ఆరోపించారు.
తెలంగాణ ప్రస్తుతం ధాన్యం ఉత్పత్తి, ధాన్యం సేకరణలో దేశంలోనే అగ్రస్థానంలో ఉందని మంత్రి పేర్కొన్నారు. ఇదే స్ఫూర్తితో ఆయిల్‌పామ్ సాగులో కూడా తెలంగాణను దేశంలో నంబర్‌వన్ రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. రైతులకు ఎరువుల పంపిణీ, వ్యవసాయ సేవలను మరింత పారదర్శకంగా అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన యూరియా యాప్ మంచి ఫలితాలు ఇస్తోందని, ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం కూడా ఇదే తరహా యాప్‌ను తీసుకొస్తోందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు.
Also Read:
హీరో అవ్వాలని చూశాడు.. తిలక్ వర్మపై కృష్ణమాచారి సంచలన వ్యాఖ్యలు!