Share News

పాక్ ఆక్రమిత కశ్మీర్ ఎన్నికల్లో కాల్పులు.. 20 మంది మృతి

ABN , Publish Date - Jul 28 , 2026 | 05:12 PM

పాక్ ఆక్రమిత కాశ్మీర్‌ లో ఎన్నికల బహిష్కరణ ఉద్యమం హింసాత్మకంగా మారింది. ఎన్నికలను బహిష్కరించాలని పిలుపునిచ్చిన నిరసనకారులపై పాకిస్థాన్ భద్రతా బలగాలు కాల్పులు జరపడంతో గత 24 గంటల్లో 20 మంది మరణించారు.

పాక్ ఆక్రమిత కశ్మీర్ ఎన్నికల్లో కాల్పులు.. 20 మంది మృతి
Pakistan Occupied Kashmir

ఇంటర్నెట్ డెస్క్: పాక్ ఆక్రమిత కశ్మీర్‌ లో ఎన్నికల బహిష్కరణ ఉద్యమం హింసాత్మకంగా మారింది. రావలకోట్‌లోని డ్రేక్ ఎయిత్ ప్రాంతంలో ఎన్నికల బహిష్కరణకు మద్దతుగా ప్రజలు పెద్ద ఎత్తున నిరసనలు తెలిపారు. ఈ క్రమంలోనే నిరసనకారులపై పాకిస్థాన్ భద్రతా బలగాలు కాల్పులు జరిపినట్లు స్థానిక వర్గాలు తెలిపాయి. ఈ కాల్పుల్లో జాయింట్ అవామీ యాక్షన్ కమిటీ (JAAC) ప్రతినిధి ఉమర్ నజీర్ కాశ్మీరీ సోదరుడు ఉస్మాన్ నజీర్ సహా 20 మంది ప్రాణాలు కోల్పోగా, 50 మందికి పైగా గాయపడ్డారు. జూన్ 5 నుంచి ప్రారంభమైన నిరసనల్లో ఇప్పటివరకు మొత్తం 80 మంది వరకు మరణించినట్లు స్థానిక వర్గాలు ఆరోపిస్తున్నాయి.


సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోల్లో రోడ్లపై మృతదేహాలు పడి ఉండగా, గాయపడిన వారిని స్థానికులు తరలిస్తున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. పీవోకే సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ అఖీల్ భాయ్ విడుదల చేసిన వీడియోలో.. ‘రావలకోట్ మొత్తం మృతదేహాలతో నిండిపోయింది. గాయపడిన వారి సంఖ్య కూడా భారీగా ఉంది. అంతర్జాతీయ మీడియా, మానవ హక్కుల సంస్థలు వెంటనే స్పందించి మాకు అండగా నిలవాలి. నేను తృటిలో ప్రాణాలతో బయటపడ్డా.’ అని విజ్ఞప్తి చేశారు.

ఎన్నికల బహిష్కరణ ఉద్యమానికి నాయకత్వం వహిస్తున్న అవామీ యాక్షన్ కమిటీ (AAC) సభ్యులనే పాకిస్థాన్ భద్రతా బలగాలు ప్రధాన లక్ష్యంగా చేసుకుంటున్నాయని స్థానిక వర్గాలు ఆరోపిస్తున్నాయి. సోమవారం ఎన్నికల ప్రక్రియ ప్రారంభం కావడంతో, పాక్ ఆక్రమిత కశ్మీర్ (PoK) అంతటా భారీ భద్రతా ఏర్పాట్ల కోసం ఇస్లామాబాద్ 14,000 మందికి పైగా సాయుధ భద్రతా సిబ్బందిని ఆ ప్రాంతానికి పంపింది. అయితే ఈ ఘటనపై పాకిస్థాన్ ప్రభుత్వం నుంచి అధికారిక ప్రకటన వెలువడలేదు.


ఇవి కూడా చదవండి..

అవకాశాలు సద్వినియోగం చేసుకోండి.. యువతకు నారా భువనేశ్వరి పిలుపు

పేపర్ లీక్‌లు అరికట్టేందుకే బిల్లు: కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్

Read Latest Telangana News And Telugu News

Updated Date - Jul 28 , 2026 | 05:57 PM