Share News

ఆర్థిక వ్యూహ పరీక్షలో విఫలం.. కేంద్ర బడ్జెట్‌పై చిదంబరం

ABN , Publish Date - Feb 01 , 2026 | 09:27 PM

బడ్జెట్‌కు ముందు ప్రవేశపెట్టిన ఆర్థిక సర్వేను కేంద్ర ప్రభుత్వం, ఆర్థిక నిర్మలా సీతారామన్ పక్కన పెట్టారని, ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేశారని కేంద్ర మాజీ ఆర్థిక మంత్రి చిదంబరం ఆరోపించారు. ద్రవ్యలోటు, పన్నుమార్పుల్లో కూడా తేడా లేదని అసంతృప్తి వ్యక్తం చేశారు.

ఆర్థిక వ్యూహ పరీక్షలో విఫలం.. కేంద్ర బడ్జెట్‌పై చిదంబరం
P Chidambaram

న్యూఢిల్లీ: 2026-27 సంవత్సరానికి కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్ (Union Budget for 2026-27) ఆర్థిక వ్యూహ పరీక్షలో విఫలమైందని కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మాజీ ఆర్థిక మంత్రి పి.చిదంబరం (P Chidambaram) అన్నారు. కీలకమైన ఆర్థిక సవాళ్లను పట్టించుకోలేదని విమర్శించారు. కేంద్ర బడ్జెట్‌పై కాంగ్రెస్ ప్రధాన కార్యాలయంలో మీడియాతో ఆయన మాట్లాడుతూ, బడ్జెట్‌కు ముందు ప్రవేశపెట్టిన ఆర్థిక సర్వేను కేంద్ర ప్రభుత్వం, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పక్కన పెట్టారని, ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేశారని ఆరోపించారు. ద్రవ్యలోటు, పన్నుమార్పుల్లో కూడా తేడా లేదని అసంతృప్తి వ్యక్తం చేశారు.


గ్రామీణ ఉపాధిని ప్రస్తావిస్తూ, గ్రామీణ ఉపాధి పథకం కింద కేంద్రం ఏడాదికి 50 రోజులు పని కల్పిస్తోందని, ఇందుకు రూ.88,000 కోట్లు వరకూ ఖర్చు చేస్తోందని అన్నారు. మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం చట్టాన్ని రద్దు చేసి ప్రస్తుతం తీసుకువచ్చిన 'వీబీ-జీ రామ్ జీ' చట్టం కింద రూ.95,000 కోట్లతో 125 రోజుల పాటు పనిదినాలు ఎలా కల్పిస్తారని ఆయన ప్రశ్నించారు. ద్రవ్యలోటు 4.4 శాతంలో పెద్దగా మార్పు లేదని, జీడీపీలో కేవలం 0.1 శాతం తగ్గుదలను మాత్రమే అంచనా వేసిందని అన్నారు. కేంద్ర మూలధన వ్యయం కూడా తగ్గిందని, కీలక రంగాలు, ప్రోగ్రాంలలో కోతలు పెట్టడం వల్ల సాధారణప్రజలపై ఆ ప్రభావం పడుతుందని విశ్లేషించారు.


యువతకు ఉపాధి కల్పించే స్పష్టమైన ప్రణాళిక బడ్జెట్‌లో లేదని చిదంబరం విమర్శించారు. అమెరికా విధిస్తున్న పెనాల్టీ సుంకాలు, వాణిజ్య సంఘర్షణలు, ప్రైవేటు పెట్టుబడుల కొరత, విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల అనిశ్చితి వంటి ముఖ్యమైన అంశాలను బడ్జెట్ పట్టించుకోలేదని అన్నారు. 'బడ్జెట్‌ ప్రసంగానికి నామమాత్రంగానే చప్పట్లు రావడం, చాలామంది త్వరగానే ఆసక్తి కోల్పోవడం ఆశ్చర్యం కలిగించలేదు. ప్రసంగ సమయంలో సంసద్ టీవీ ప్రసారాలు కూడా పలుమార్లు ఆగిపోయాయి' అని చిదంబరం వ్యాఖ్యానించారు.


ఇవీ చదవండి:

బంగ్లాదేశ్‌కు బడ్జెట్ వాత.. సాయం నిధులు సగానికి కట్

బడ్జెట్ 2026.. ఇరాన్‌లోని చాబహార్‌ పోర్టుకు నిధులు కేటాయించని కేంద్రం

Updated Date - Feb 01 , 2026 | 09:37 PM