ఉత్తర్ ప్రదేశ్‌లో మరో బోటు ప్రమాదం.. ఆరుగురు గల్లంతు..
ABN , Publish Date - May 07 , 2026 | 11:08 AM
ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రం హమీర్‌పుర్ జిల్లాలో ఘోర బోటు ప్రమాదం జరిగింది. కురారా పోలీస్ స్టేషన్ పరిధి కుతుబ్‌పూర్ పటియా వద్ద యమునా నదిలో పడవ బోల్తా పడింది.
ఉత్తర్ ప్రదేశ్: హమీర్‌పుర్ జిల్లాలో ఘోర బోటు ప్రమాదం జరిగింది. కురారా పోలీస్ స్టేషన్ పరిధి కుతుబ్‌పూర్ పటియా వద్ద యమునా నదిలో పడవ బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఆరుగురు గల్లంతవగా.. ముగ్గురు క్షేమంగా బయటపడ్డారు. బుధవారం సాయంత్రం 7 గంటల ప్రాంతంలో తొమ్మిది మంది పర్యాటకులతో కూడిన బోటు యమునా నదిలో ప్రయాణిస్తోంది. అయితే, ప్రమాదవశాత్తూ అదుపుతప్పి బోల్తాపడింది. విష్ణు, రింకూ, పరుల్ అనే ముగ్గురిని పడవ నడిపే వ్యక్తి ధీరూ రక్షించాడు. ఆకాంక్ష (9), రాణి (9), బ్రిజ్‌రాణి (25), లభ్యాంష్ (5), మహేశ్ (6), ఆదిత్య (11) నీటిలో గల్లంతయ్యారు.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు రంగంలోకి దింపి సహాయక చర్యలు చేపట్టారు. ఈ ప్రమాదం గురించి తెలుసుకున్న యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ అధికారులను అప్రమత్తం చేశారు. గల్లంతైన వారిని త్వరగా గుర్తించేందుకు సహాయక చర్యలు ముమ్మరం చేయాలని ఆదేశించారు. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని ఆజ్ఞాపించారు. ఘటనా స్థలానికి బీజేపీ ఎమ్మెల్యే మనోజ్ ప్రజాపతి చేరుకున్నారు. గల్లంతైన వారి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నట్లు పేర్కొన్నారు. ప్రమాదంపై పూర్తి నివేదికను సీఎం యోగికి సమర్పించనున్నట్లు ఎమ్మెల్యే మనోజ్ తెలిపారు.
మరోవైపు సీఎం యోగి ఆదేశాలతో జిల్లా మేజిస్ట్రేట్ అభిషేక్ గోయల్ ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. ఏప్రిల్ నెలలోనూ ఉత్తరప్రదేశ్‌లో ఇలాంటి ఘటనే మరొకటి చోటు చేసుకుంది. మధురలో పడవ బోల్తాపడి 15 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన జరిగిన రోజుల వ్యవధిలోనే తాజాగా బోటు ప్రమాదం సంభవించడం ఆందోళనకు గురి చేస్తోంది.
ఈ వార్తలు కూడా చదవండి
చంద్రనాథ్ రథ్ హత్యను ఖండించిన సువేందు అధికారి..
తమిళనాడు ఆపద్ధర్మ ముఖ్యమంత్రి స్టాలిన్ సంచలన ప్రకటన..