వీడు మామూలోడు కాదు.. పెళ్లి చేసుకోవాలన్నందుకు హత్య చేశాడు..!
ABN , Publish Date - Jun 11 , 2026 | 09:42 PM
పెళ్లి చేసుకోవాలని కోరిన ప్రియురాలిని ఓ యువకుడు హత్య చేసిన ఘటన తీవ్ర కలకలం రేపుతోంది. ఏళ్లుగా ప్రేమించుకుంటున్నామని, ఇక వివాహం చేసుకుని ఒక్కటవుదామని కోరడంతో ఆమెను అతి దారుణంగా హత్య చేశాడు.
భువనేశ్వర్: పెళ్లి చేసుకోవాలని కోరిన ప్రియురాలిని ఓ యువకుడు హత్య చేసిన ఘటన తీవ్ర కలకలం రేపుతోంది. ఏళ్లుగా ప్రేమించుకుంటున్నామని, ఇక వివాహం చేసుకుని ఒక్కటవుదామని కోరడంతో అతి దారుణంగా హత్య చేశాడు. యువతిని చంపేసి సినిమా రేంజ్‌లో కథ అల్లేందుకు ప్రయత్నించాడు. అతని కట్టుకథ నమ్మశక్యంగా లేకపోవడంతో బాధిత కుటుంబ సభ్యులకు అనుమానం వచ్చింది. పోలీసులకు ఫిర్యాదు చేయగా.. నిందితుడి నుంచి నిజాలు రాబట్టి కటకటాల వెనక్కి పంపారు. పూర్తి వివరాల్లోకి వెళితే..
ఒడిశాలోని గంజాం జిల్లాలో దారుణ ఘటన వెలుగు చూసింది. నిమఖండి పెంత్ ప్రాంతానికి చెందిన రాకేశ్ ఆచార్య, రోహి గ్రామానికి చెందిన అంబిక కొన్నేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. డాక్టర్ కావాలనే ఆశయంతో అంబిక నీట్ పరీక్షకు సిద్ధమవుతోంది. ఈ మేరకు ప్రస్తుతం బెర్హంపూర్‌లో నివసిస్తోంది. అయితే, రాకేశ్ ఆచార్యపై ఉన్న ప్రేమతో పెళ్లి చేసుకోవాలని యువతి నిర్ణయించుకుంది. ఈ విషయాన్ని ప్రియుడికి చెప్పగా.. ఏదో ఒక సాకుతో నిరాకరిస్తూ వస్తున్నాడు. దీంతో రాకేశ్‌పై ఆమె ఒత్తిడి పెంచింది. వివాహం చేసుకోవాలని పదేపదే అడుగుతుండటంతో అతను దారుణ నిర్ణయం తీసుకున్నాడు. ప్రేయసిని ఎలాగైనా అడ్డు తొలగించుకోవాలని నిర్ణయించుకున్నాడు.
సరదాగా గడుపుదామని చెప్పి జూన్ 7న అంబికను ద్విచక్రవాహనంపై గోపాల్‌పూర్‌కు తీసుకెళ్లాడు రాకేశ్. రోజంతా కలిసి తిరిగిన తర్వాత ఆ రాత్రి తిరుగు ప్రయాణమయ్యారు. అయితే, అంకులి ఓవర్‌బ్రిడ్జి దగ్గర బైక్ ఆపాడు రాకేశ్. ఎవరూ లేని సమయం చూసి ప్రేయసిని ఓవర్‌బ్రిడ్జి పైనుంచి తోసేశాడు. దీంతో అంబిక అక్కడికక్కడే మృతిచెందింది. ఈ హత్యను ప్రమాదంలా చిత్రీకరించేందుకు కథ అల్లాడు నిందితుడు. యువతి కుటుంబ సభ్యులకు అతనే స్వయంగా ఫోన్ చేసి అంబిక రోడ్డు ప్రమాదంలో మరణించిందని నమ్మించే ప్రయత్నం చేశాడు. అతను చెప్పిన విషయాలకు, ఘటనాస్థలిలోని పరిస్థితులకు పొంతన కుదరకపోవడంతో బాధిత కుటుంబం బైద్యనాథ్‌పూర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది.
మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు.. పోస్ట్‌మార్టం నివేదిక ఆధారంగా ఇది రోడ్డు ప్రమాదం కాదని నిర్ధారించుకున్నారు. దర్యాప్తు కొనసాగుతున్న కొద్దీ రాకేశ్‌కు వ్యతిరేకంగా అనేక సాక్ష్యాలను సేకరించారు. పెళ్లి తర్వాత బాధ్యతలను స్వీకరించేందుకు రాకేశ్ సిద్ధంగా లేడని.. అందుకే హత్యకు ప్రణాళిక రచించాడని పోలీసులు భావిస్తున్నారు. ఈ మేరకు నిందితుడిని అరెస్టు చేసి స్థానిక కోర్టులో హాజరుపరిచారు. కేసును విచారించిన కోర్టు.. రాకేశ్‌కు రిమాండ్ విధించింది.
ఈ వార్తలు కూడా చదవండి
వేగంగా వెళ్తున్న బస్సు డ్రైవర్‌కు షాక్.. నడి రోడ్డుపై చిన్నారి ప్రత్యక్షం..
ఫ్రాన్స్ వేదికగా జీ7 సదస్సు.. వరుసగా 7వ దఫా హాజరవుతున్న మోదీ