Share News

నోయిడాలో చెలరేగిన అల్లర్లు.. వాహనాలకు నిప్పుపెట్టిన కార్మికులు..

ABN , Publish Date - Apr 13 , 2026 | 12:24 PM

నోయిడాలో జీతాలు పెంచాలని కార్మిక సంఘాలు చేపట్టిన ఆందోళన హింసాత్మకంగా మారింది. వేతనాలు పెంచాలని నోయిడా పారిశ్రామికవాడలో మూడ్రోజులుగా నిరసన చేస్తున్న కార్మికులంతా నేడు ఒక్కసారిగా రోడ్లపైకి వచ్చారు. పలు హింసాత్మక ఘటనలకు పాల్పడ్డారు.

నోయిడాలో చెలరేగిన అల్లర్లు.. వాహనాలకు నిప్పుపెట్టిన కార్మికులు..
Noida Workers Protest

ఉత్తరప్రదేశ్‌: నోయిడాలో జీతాలు పెంచాలని కార్మిక సంఘాలు చేపట్టిన ఆందోళన (Noida Workers Protest) హింసాత్మకంగా మారింది. వేతనాలు పెంచాలని నోయిడా పారిశ్రామికవాడ (Noida Industrial Area)లో మూడ్రోజులుగా నిరసన చేస్తున్న కార్మికులంతా నేడు ఒక్కసారిగా రోడ్లపైకి వచ్చారు. పలు హింసాత్మక ఘటనలకు పాల్పడ్డారు. పలు వాహనాలకు నిప్పుపెట్టగా.. మరికొన్నింటిని ధ్వంసం చేశారు. వేలాది మంది కార్మికులు వీధులు, రహదారులపైకి వచ్చి న్యాయం చేయాలంటూ నినాదాలు చేస్తున్నారు.


కార్మికుల ఆందోళనలతో నోయిడాలో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. రద్దీగా ఉండే డీఎన్‌డీ ఫ్లైఓవర్‌తో సహా కీలకమైన ప్రధాన మార్గాల్లో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఎక్కడి వాహనాలు అక్కడే నిలిచిపోయాయి. నోయిడా ఫేజ్-2 ప్రాంతంలో ముఖ్యంగా సెక్టార్ 1, సెక్టార్ 84లో ఆందోళనలు తీవ్రంగా జరుగుతున్నాయి. భారీగా పోలీసులు ఘటనా స్థలానికి చేరుకోవడంతో ఇరువర్గాల మధ్య తోపులాట చోటు చేసుకుంది. అనంతరం రెచ్చిపోయిన ఆందోళనకారులు పోలీసులపైకి రాళ్లు రువ్వారు.


అయితే పరిస్థితిని అదుపు చేసేందుకు పోలీసులు తీవ్రంగా శ్రమిస్తున్నారు. గౌతమ్ బుద్ధనగర్ కమిషనరేట్ పరిధి పారిశ్రామిక ప్రాంతాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు. మరోవైపు జీతాల పెంపు డిమాండ్లను పరిష్కరిస్తామని జిల్లా అధికారులు, పారిశ్రామిక శాఖ అధికారులు ఆదివారమే చెప్పినప్పటికీ హింసాత్మక ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. హింసను నివారించేందుకు క్షేత్రస్థాయిలో కార్మికులతో సంప్రదింపులు జరుపుతున్నామని అధికారులు చెబుతున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి

నగదు, ఆస్తి కావాలంటూ మహిళ బ్లాక్ మెయిల్.. జిమ్ ట్రైనర్ ఆత్మహత్య..

యోగి పాదాలకు మొక్కిన సువేందు అధికారి.. వీడియో వైరల్

Updated Date - Apr 13 , 2026 | 12:33 PM