భారత్‌లో ఇంధన కొరత లేదు.. లోక్‌సభలో కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్
ABN , Publish Date - Mar 12 , 2026 | 05:44 PM
ఇండియాలో ఇంధన కొరత లేదని, తగినన్ని క్రూడాయిల్ నిల్వలు ఉన్నాయని కేంద్ర పెట్రోలియం, సహజ వాయువుల శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పురి తెలిపారు. పెట్రోల్, డీజిల్, విమాన ఇంధన సరఫరాలో ఎలాంటి కొరత లేదని స్పష్టం చేశారు.
న్యూఢిల్లీ: ఇండియాలో ఇంధన కొరత లేదని, తగినన్ని క్రూడాయిల్ నిల్వలు ఉన్నాయని కేంద్ర పెట్రోలియం, సహజ వాయువుల శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పురి (Hardeep Singh Puri) తెలిపారు. పెట్రోల్, డీజిల్, విమాన ఇంధన సరఫరాలో ఎలాంటి కొరత లేదని చెప్పారు. దేశీయ రిఫైనరీలు పూర్తి సామర్థ్యంతో పనిచేస్తున్నాయని అన్నారు. ప్రజలు ఎలాంటి వదంతులు వ్యాప్తి చేయవద్దని కోరారు. పశ్చిమాసియాలో ఉద్రిక్తతల నేపథ్యంలో దేశంలో ఎల్‌పీజీ లభ్యతపై ఆందోళన నెలకొనడంతో కేంద్ర మంత్రి లోక్‌సభలో మాట్లాడారు.
'ఆధునిక ఇంధన చరిత్రలో ప్రపంచం ఇలాంటి క్లిష్ట సమయాన్ని మునుపెన్నడూ ఎదుర్కోలేదు. భారత్ తన ముడి చమురు అవసరాల కోసం సురక్షితమైన సరఫరాలను సమకూర్చుకుంది. హర్మూజ్ సంక్షోభంతో భారత్‌కు సంబంధం లేదు. హర్మూజ్ జలసంధి భారత్‌కు తెరిచారు. ప్రధానమంత్రి చర్చలతో పరిస్థితులు సర్దుకుంటున్నాయి' అని హర్దీప్ సింగ్ తెలిపారు. ఎలాంటి సంక్షోభం తలెత్తినా ఎదుర్కునేందుకు కూడా కేంద్రం సిద్ధంగా ఉందని చెప్పారు.
ఎల్ఎన్‌జీ కార్గోలు ప్రతిరోజూ వస్తున్నాయి
డొమెస్టిక్ సిలిండర్ల సరఫరాకు ఎలాంటి ఇబ్బందులు లేవని మంత్రి వివరించారు. సిలిండర్ల సరఫరాలో ఆసుపత్రులు, విద్యాసంస్థలకు ప్రాధాన్యత ఇస్తున్నట్టు చెప్పారు. సిలిండర్ బుకింగ్‌కు నగరాల్లో 25 రోజుల వ్యవధి, గ్రామాల్లో 45 రోజుల వ్యవధి అమలు చేస్తున్నట్టు చెప్పారు. ఎల్ఎన్‌జీ కార్గోలు దాదాపు ప్రతిరోజూ ప్రత్యామ్నాయ సరఫరా రూట్లలో ఇండియాకు వస్తున్నాయని తెలిపారు. ఒకవేళ ఘర్షణలు సుదీర్ఘకాలం కొనసాగినప్పటికీ తగినంత గ్యాస్ ఉత్పత్తి, సరఫరా ఏర్పాట్లు చేయగలిగే స్థితిలో ఇండియా ఉందని అన్నారు. గృహాలు, పరిశ్రమలకు అవసరమైన విద్యుత్ ఉత్పత్తికి ఎలాంటి ఇబ్బంది లేదని చెప్పారు.
ఎల్పీజీ ఉత్పత్తి 28 శాతం పెరిగింది
రిఫైనరీలకు తగిన ఆదేశాలు ఇవ్వడం ద్వారా గత ఐదు రోజులుగా 28 శాతం ఎల్పీజీ ఉత్పత్తి పెరిగినట్టు హర్దీప్ సింగ్ పురి తెలిపారు. లక్షలాది భారతీయ కుటుంబాల వంటిళ్లలో ఎలాంటి కొరత లేకుండా చూసేందుకు మోదీ ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యం ఇస్తోందని, డొమిస్టిక్ సప్లయ్‌కు పూర్తి భరోసా ఉందని చెప్పారు.
ఇవి కూడా చదవండి..
తప్పుడు విదేశాంగ విధానం వల్లే ఎల్పీజీ కొరత.. పార్లమెంటు ఆవరణలో రాహుల్ నిరసన
నేనెప్పుడూ ఆ నియమాలు ఉల్లంఘించలేదు.. లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా కామెంట్స్