నేనెప్పుడూ ఆ నియమాలు ఉల్లంఘించలేదు.. లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా కామెంట్స్
ABN , Publish Date - Mar 12 , 2026 | 02:04 PM
తాను ఎల్లప్పుడూ సభ నిర్దేశించిన నియమ నిబంధనలకు లోబడే విధులు నిర్వర్తించానని, ఇకపైనా తన విధులను నిష్పక్షపాతంగా, పారదర్శకంగానే నిర్వహిస్తానని లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా అన్నారు.
ఢిల్లీ: తాను ఎల్లప్పుడూ సభ నిర్దేశించిన నియమ నిబంధనలకు లోబడే విధులు నిర్వర్తించానని, ఇకపై కూడా తన విధులను నిష్పక్షపాతంగా, పారదర్శకంగానే నిర్వహిస్తానని లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా అన్నారు. ప్రతిపక్ష సభ్యులు పెట్టిన అవిశ్వాస తీర్మానం వీగిపోయిన నేపథ్యంలో, గురువారం ఓం బిర్లా లోక్‌సభకు హాజరయ్యారు. దేశంలోని 140 కోట్ల మంది ప్రజల ఆకాంక్షలకు ప్రతిరూపమే లోక్‌సభ అని, ప్రతిపక్షాలకు మాట్లాడే అవకాశం కల్పిస్తేనే ప్రజాస్వామ్యం బతుకుతుందని తాను నమ్ముతానని అన్నారు (Om Birla statement).
'ప్రతిపక్ష ఎంపీలకు మాట్లాడే అవకాశం ఇవ్వడం లేదని కొందరు సభ్యులు ఆరోపించారు. మంత్రి అయినా, ప్రతిపక్ష ఎంపీ అయినా, ఏ సభ్యుడైనా సరే, నిబంధనల ప్రకారం మాట్లాడే హక్కు ప్రతి ఒక్కరికీ ఉంటుంది. నిబంధనల ప్రకారమే లోక్‌సభ నడుస్తుంది. ఈ నిబంధనలను ప్రస్తుత ప్రభుత్వమో లేదా ప్రతిపక్షమో రూపొందించలేదు. నిబంధనలు అనేవి సభ్యులందరికీ సమానంగా వర్తిస్తాయి. ఆ నిబంధనల ప్రకారమే నేను నడుచుకుంటున్నాను' అని ఓం బిర్లా స్పష్టం చేశారు.
'ఏ అంశం మీదనైనా మాట్లాడాలని అనుకుంటే, ప్రధాన మంత్రి అయినా సరే ముందుగా నోటీసు ఇవ్వాలి. ఆ తర్వాతే వారికి అనుమతి లభిస్తుంది. కాబట్టి సభలోని ఏ సభ్యుడికైనా నిబంధనలకు విరుద్ధంగా, అనుమతి లేకుండా మాట్లాడే హక్కు ఉండదు' అని స్పీకర్ తేల్చిచెప్పారు (Indian politics news). ఓం బిర్లా గురువారం లోక్‌సభకు వచ్చిన సమయంలో, విపక్షాలు ఆయనకు వ్యతిరేకంగా నినాదాలు చేసి, నిరసన వ్యక్తం చేశాయి. దీనితో ఆయన ప్రశ్నోత్తరాల సమయంలో సభ సజావుగా సాగేలా సహకరించాలని ప్రతిపక్ష ఎంపీలను కోరారు. అయినప్పటికీ వారు శాంతించలేదు.
ఇవి కూడా చదవండి..
స్థిరంగా బంగారం, స్వల్పంగా తగ్గిన వెండి.. ఈ రోజు ధరలు ఎలా ఉన్నాయంటే..
ఉత్తర కొరియా క్షిపణి ప్రయోగాలు.. కూతురితో కలిసి వీక్షించిన కిమ్..