మా బలం 2002... నోరు జారిన నితీశ్
ABN , Publish Date - Feb 24 , 2026 | 08:22 PM
అసెంబ్లీలో విపక్షాల దాడిని నితీశ్ కుమార్ తిప్పికొడూతూ.. అనవసరంగా మాట్లాడవద్దని, తాము 2002 మంది ఉన్నామని, అటువైపు ఎందరు మళ్లీ సభలోకి అడుగుపెట్టలేదో గుర్తుంచుకోవాలని విసుర్లు విసిరారు.
పాట్నా: బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ (Nitish Kumar) టంగ్ స్లిప్ అయ్యారు. ప్రభుత్వం 'తుపాకులు, బుల్లెట్ల' సాయంతో పాలిస్తోందంటూ విపక్ష ఎమ్మెల్యేలు అసెంబ్లీలో మంగళవారంనాడు నినాదాలు చేయడంతో ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. దీంతో నితీశ్ సహనం కోల్పోయారు. నిరసనలకు దిగిన విపక్ష ఎమ్మెల్యేలను మందలించేందుకు ఎన్డీయే ఇటీవల సాధించిన మెజారిటీని ప్రస్తావించారు. 'మా బలం 2002' అని నితీశ్ చెప్పడంతో అటు విపక్ష ఎమ్మెల్యేలతో పాటు జేడీయూ ఎమ్మెల్యేలు మెదట షాక్ అయ్యారు. ఆ వెంటనే నవ్వులు చిందించడంతో సభాప్రాగణం అహ్లాదంగా మారిపోయింది. ఇటీవల జరిగిన బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ-జేడీయూ కూటమి 202 సీట్లు గెలుచుకుంది.
పోలీసు లాఠీచార్జీపై..
తొలుత అసెంబ్లీ ఉదయం 11 గంటలకు ప్రారంభం కాగానే ఆర్జేడీ ఎమ్మెల్యే కుమార్ సర్వజీత్ మాట్లాడుతూ, సోమవారంనాడు పాట్నాలో వేతనాల పెంపుకోసం చౌకీదార్లు జరిపిన ప్రదర్శనపై పోలీసులు లాఠీచార్జి జరపడాన్ని తప్పుపట్టారు. వేతనం పెంపుకోరుతున్న వారు హోం శాఖకు చెందిన వారేనని గుర్తుచేశారు. పలువురు ఎమ్మెల్యేలు సైతం ఆయన వాదనను బలపరుస్తూ, తుపాకీలు, బుల్లెట్లతో పాలన సాగించాలనుకుంటే ఊరుకోమంటూ నినాదాలు చేశారు. విపక్షాల దాడిని వెంటనే నితీశ్ కుమార్ తిప్పికొట్టారు. అనవసరంగా మాట్లాడవద్దని, తాము 2002 మంది ఉన్నామని, అటువైపు ఎందరు మళ్లీ సభలోకి అడుగుపెట్టలేదో గుర్తుంచుకోవాలని విసుర్లు విసిరారు. అసెంబ్లీ ఎన్నికల్లో విపక్ష ఆర్జేడీ కేవలం 25 సీట్లకే పరిమితం కావడాన్ని ప్రస్తావిస్తూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ క్రమంలో పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి విజయ్ కుమార్ చౌదరి జోక్యం చేసుకుంటూ, చౌకీదార్ అసోసియేషన్ల ప్రతినిధులను పిలిచి వారి డిమాండ్లను పరిశీలిస్తామని, తగు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. దీంతో సభ సద్దుమణిగింది.
గతంలోనూ..
కాగా, నితీశ్ కుమార్ గతంలోనూ నోరు జారిన సందర్భాలు ఉన్నాయి. ఒక ఎన్నికల ప్రచార సభలో ప్రధాని మోదీ మళ్లీ సీఎం కావాలని ఆకాంక్షిస్తున్నానంటూ నోరుజారారు. అయితే ఆ తర్వాత దాన్ని సవరించుకున్నారు. అంతకుముందు తన డిప్యూటీగా పనిచేసిన తేజస్వి యాదవ్‌ను పొరపాటును ముఖ్యమంత్రి అని సంబోదించారు. ఒకసారి శాసనమండలిలో మాజీ సీఎం రబ్రీదేవిని ఉద్దేశించి 'యే లడ్కీ' అని సంబంధించడం కూడా అప్పట్లో చర్చనీయాంశమైంది.
ఇవి కూడా చదవండి..
వాళ్లు ఎవరికీ భయపడని బబ్బర్ షేర్స్.. రాహుల్ కితాబు
రూ.12,236 కోట్లతో రైల్, మెట్రో, ఎయిర్ పోర్ట్ ప్రాజెక్టులకు కేంద్రం ఆమోదం