కేరళ కాదు 'కేరళం'.. కేంద్ర క్యాబినెట్ ఆమోదం
ABN , Publish Date - Feb 24 , 2026 | 03:40 PM
కేరళ రాష్ట్రం పేరు ఇకపై 'కేరళం'గా మారింది. సంబంధిత బిల్లుకు కేంద్ర క్యాబినెట్ నేడు ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది.
ఇంటర్నెట్ డెస్క్: కేరళ రాష్ట్రం పేరును 'కేరళం'గా మారుస్తూ కేంద్ర క్యాబినెట్ నేడు ఏకగ్రీవంగా ఆమోదించింది. ఇకపై రాష్ట్రాన్ని 'కేరళం' అని పిలిచేలా సంబంధిత బిల్లుకు కేంద్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది. మలయాళీ రాష్ట్రంలో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో తాజా నిర్ణయం అత్యంత ప్రాధాన్యం సంతరించుకుంది.
తమ రాష్ట్రం పేరును మార్చాలనే ప్రతిపాదనలు మలయాళీ ప్రజల నుంచి ఎప్పటినుంచో వినిపిస్తున్నాయి. కేరళను మలయాళంలో 'కేరళం' అని పిలుస్తారని.. ఆ దిశగా రాష్ట్ర ముఖ్యమంత్రి పినరయి విజయన్ 2023లో ప్రవేశపెట్టిన తీర్మానానికి అసెంబ్లీ ఆమోదం తెలిపింది. అయితే.. కేంద్ర ప్రభుత్వ సూచనల మేరకు కొన్ని మార్పుల అనంతరం కేరళ అసెంబ్లీ మరోసారి ఆ తీర్మానాన్ని ఆమోదించింది. ఆ తర్వాత ఇది ఇన్నాళ్లూ కేంద్రం వద్ద పెండింగ్‌లో ఉండగా.. ఎట్టకేలకు మంగళవారం గ్రీన్ సిగ్నల్ లభించింది.
ఢిల్లీలో ఇటీవల ప్రారంభమైన నూతన 'సేవా తీర్థం' భవనంలో జరిగిన మొదటి క్యాబినెట్ సమావేశం ఇది. మొదటి తీర్మానాన్ని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ సమీక్షించిన అనంతరం.. కొన్ని సాంకేతిక మార్పులతో కేరళ అసెంబ్లీ రెండోసారి ఈ తీర్మానాన్ని ఆమోదించింది. ఈ తీర్మానాన్ని ప్రతిపాదించిన ఆ రాష్ట్ర సీఎం పినరయి విజయన్.. రాజ్యాంగంలోని మూడో అధికరణ ప్రకారం.. ఎనిమిదవ షెడ్యూల్‌లో చేర్చిన అన్ని భాషలలో 'కేరళం'గా సవరించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. తీర్మానాన్ని ప్రతిపాదిస్తున్న సందర్భంలో ఆయన మాట్లాడుతూ.. మలయాళంలో రాష్ట్రాన్ని 'కేరళం' అని పిలుస్తారని, జాతీయ స్వాతంత్ర్య పోరాట సమయం నుంచి మలయాళం మాట్లాడే వర్గాల కోసం ఐక్య కేరళను ఏర్పాటు చేయాలనే డిమాండ్ బలంగా ఉద్భవించిందని అన్నారు.
ఇవీ చదవండి:
ప్రతి కుటుంబానికి రూ.10,000 ఆర్థిక సాయం.. అన్నాడీఎంకే హామీల వర్షం
ఎయిర్ అంబులెన్స్ ఘటన.. వెలుగులోకి కన్నీళ్లు పెట్టించే విషయాలు..
పైలట్ అప్రమత్తత.. నిలిచిన ప్రయాణికుల ప్రాణాలు