Share News

బ్రహ్మోస్ కంటే వేగవంతమైన మిసైల్! భారత్‌కు ఇజ్రాయెల్ ఆఫర్

ABN , Publish Date - Feb 24 , 2026 | 09:44 AM

భారత్‌కు గోల్డెన్ హొరైజన్ మిసైల్‌ను సరఫరా చేసేందుకు ఇజ్రాయెల్ ప్రతిపాదించినట్టు జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. మాక్-5 వేగంతో ప్రయాణించే ఈ మిసైల్ శత్రుదేశ బంకర్లను ధ్వంసం చేయగలదట.

బ్రహ్మోస్ కంటే వేగవంతమైన మిసైల్! భారత్‌కు ఇజ్రాయెల్ ఆఫర్
Golden Horizon missile

ఇంటర్నెట్ డెస్క్: బ్రహ్మోస్ మిసైల్ కంటే వేగవంతమైన గోల్డెన్ హొరైజన్ క్షిపణిని భారత్‌కు సరఫరా చేసేందుకు ఇజ్రాయెల్ ప్రతిపాదించినట్టు జాతీయ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి. గగనతలం నుంచి ప్రయోగించే ఈ బాలిస్టిక్ మిసైల్‌తో భూగర్భంలోని శత్రుదేశ బంకర్లను సైతం అత్యంత కచ్చితత్వంతో ధ్వంసం చేయొచ్చని నిపుణులు చెబుతున్నారు (Golden Horizon Missile).

ఇజ్రాయెల్‌కు చెందిన సిల్వర్ స్పారో మిసైల్ నుంచి గోల్డెన్ హొరైజన్‌‌ను అభివృద్ధి చేశారని నిపుణులు చెబుతున్నారు. ఈ మిసైల్ 1000-2000 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను అత్యంత కచ్చితత్వంతో ఛేదించగలుగుతుంది. వీటిని భారత్ కొనుగోలు చేస్తే సుఖోయ్-30ఎమ్‌కేఐ విమానాలకు అనుసంధానించొచ్చని నిపుణులు చెబుతున్నారు. దీంతో, భారత వాయుసేన సామర్థ్యాలు మరింత మెరుగుతాయని అంటున్నారు.


యుద్ధ క్షేత్రంలో వినియోగించేందుకు భారత్‌ వద్ద ఇప్పటికే ఉన్న మిసైల్స్‌తో పోలిస్తే గోల్డెన్ హొరైజన్ భిన్నమైనదని నిపుణులు వివరిస్తున్నారు. కట్టుదిట్టమైన భద్రత మధ్య ఉండే శత్రు దేశస్థావరాలు, భూగర్భ బంకర్‌లను టార్గెట్ చేసేందుకు దీన్ని ప్రత్యేకంగా డిజైన్ చేశారని చెబుతున్నారు. బలమైన కాంక్రీట్ నిర్మాణాల వెనుక ఉండే అణు కేంద్రాలను కూడా ఈ మిసైల్‌తో సులువుగా టార్గెట్ చేయొచ్చని అంటున్నారు. ఈ మిసైల్ గరిష్ఠంగా మాక్-5 వేగంతో ప్రయాణిస్తుంది కాబట్టి శత్రు దేశాలకు దీన్ని టార్గెట్ చేయడం కష్టమట. లక్ష్యానికి చేరువులోకి వెళ్లాక మిసైల్ గరిష్ఠ వేగాన్ని అందుకుని శత్రదేశ స్థావరాలను నామరూపాలు లేకుండా చేయగలుగుతుందని నిపుణులు చెబుతున్నారు.


ఇవీ చదవండి:

భారీ ఉగ్రకుట్ర భగ్నం! 8 మంది అరెస్టు

తేజస్ యుద్ధ విమానాలను తాత్కాలికంగా పక్కనపెట్టిన వాయుసేన

Updated Date - Feb 24 , 2026 | 10:26 AM