Share News

ఎయిర్ అంబులెన్స్ ఘటన.. వెలుగులోకి కన్నీళ్లు పెట్టించే విషయాలు..

ABN , Publish Date - Feb 24 , 2026 | 03:02 PM

సోమవారం రాత్రి రాంచీ నుంచి ఢిల్లీ బయల్దేరిన ‘ది బీచ్‌క్రాఫ్ట్ సీ90’ ఎయిర్ అంబులెన్స్ ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. వాతావరణ పరిస్థితుల కారణంగా విమానం కుప్పకూలటంతో ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రమాదానికి సంబంధించి కన్నీళ్లు పెట్టించే విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.

ఎయిర్ అంబులెన్స్ ఘటన.. వెలుగులోకి కన్నీళ్లు పెట్టించే విషయాలు..
Jharkhand air ambulance crash

ఇంటర్‌నెట్ డెస్క్: జార్ఖండ్ రాష్ట్రంలో చోటుచేసుకున్న ఎయిర్ అంబులెన్స్ ప్రమాదానికి సంబంధించి కన్నీళ్లు పెట్టించే విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఒక మనిషి ప్రాణాలు కాపాడటానికి చేసిన ప్రయత్నం మరో ఆరుగురి ప్రాణాలను బలితీసుకుంది. నిన్న (సోమవారం) రాత్రి రాంచీ నుంచి ఢిల్లీ బయలుదేరిన ‘ది బీచ్‌క్రాఫ్ట్ సీ90’ ఎయిర్ అంబులెన్స్ ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. వాతావరణ పరిస్థితులు అనుకూలించనందున విమానం కుప్పకూలడంతో ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు.


హోటల్‌లో ప్రమాదం..

జార్ఖండ్‌లోని లతేహర్ జిల్లా చంద్వాకు చెందిన సంజయ్ కుమార్ షా స్థానికంగా ఓ హోటల్ నడుపుతున్నాడు. సోమవారం షార్ట్ సర్క్యూట్ కారణంగా హోటల్‌లో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. సంజయ్ మంటల్లో చిక్కుకున్నాడు. అతడికి 65 శాతం కాలిన గాయాలు అయ్యాయి. కుటుంబ సభ్యులు అతడిని రాంచిలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. సంజయ్ పరిస్థితి విషమంగా ఉండటంతో అక్కడి డాక్టర్లు ఢిల్లీలోని టాప్ ఆస్పత్రి అయిన శ్రీ గంగారామ్ ఆస్పత్రికి రెఫర్ చేశారు.


రాంచీ నుంచి రోడ్డు ద్వారా సంజయ్‌ను ఢిల్లీకి తీసుకెళ్లేంత సమయం లేదని డాక్టర్లు తేల్చి చెప్పారు. ఎయిర్ అంబులెన్స్ గురించి కుటుంబ సభ్యులకు వివరించారు. బాధితులు.. బంధువులు, తెలిసిన వాళ్లను అడిగి ఎయిర్ అంబులెన్స్ కోసం 7.5 లక్షల రూపాయలు.. చికిత్స కోసం మరికొంత సేకరించారు. రెడ్ బర్డ్ ఎయిర్‌వేస్ ప్రైవేట్ లిమిటెడ్ నుంచి ‘ది బీచ్‌క్రాఫ్ట్ సీ90’ ఎయిర్ అంబులెన్స్ అద్దెకు తీసుకున్నారు. పేషంట్ సంజయ్ కుమార్ షా, అతడి భార్య అర్చనా దేవి, బంధువు ధ్రువ్ కుమార్, డాక్టర్ వికాస్ కుమార్ గుప్తా, నర్సు సచిన్ కుమార్ మిశ్రా, పైలట్లు వివేక్ వికాస్ భగత్, సవ్‌రాజ్ దీప్‌సింగ్ ఢిల్లీకి బయల్దేరారు.


టేకాఫ్ అయిన 20 నిమిషాల్లోనే..

విమానం రాంచీ నుంచి రాత్రి 7:11 గంటల సమయంలో టేకాఫ్ అయింది. సరిగ్గా 20 నిమిషాలకు ఊహించని విషాదం చోటుచేసుకుంది. విమానం ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ నుంచి కాంటాక్ట్ కోల్పోయింది. ఛత్రా జిల్లాలోని అటవీ ప్రాంతంలో కుప్పకూలిపోయింది. విమానంలో ప్రయాణిస్తున్న ఏడుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.


అంతా విషాదమే..

భర్తను బతికించుకోవటానికి సంజయ్ భార్య అర్చన ఎంతో శ్రమపడింది. ఈ ప్రయత్నంలోనే భర్తతో పాటు తాను కూడా మృతిచెందింది. సంజయ్, అర్చనలకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. తల్లిదండ్రులు ఇద్దరూ చనిపోవడంతో వారు అనాథలుగా మిగిలిపోయారు. విమాన ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన డాక్టర్ వికాస్ కుమార్ గుప్తా తండ్రి బజ్‌రంగీ ప్రసాద్ మాట్లాడుతూ.. ‘నా కొడుకును చదివించటం కోసం నా పొలం మొత్తం అమ్మేశాను. అతడికి ఏడేళ్ల కొడుకు కూడా ఉన్నాడు’ అంటూ కన్నీరు మున్నీరుగా విలపించాడు.


ఇవి కూడా చదవండి

పోక్సో కేసు.. ముందస్తు బెయిలు పిటిషన్ వేసిన స్వామి అవిముక్తేశ్వరానంద

మీ చూపునకు పవర్ ఉంటే.. ఈ ఫొటోలో ఎన్వలప్ కవర్ ఎక్కడుందో 15 సెకెన్లలో గుర్తించండి..

Updated Date - Feb 24 , 2026 | 03:25 PM