Share News

పెట్టుబడులకు అనుకూలతలో రాష్ట్రానికి 10వ ర్యాంకు

ABN , Publish Date - Jul 18 , 2026 | 06:31 AM

ట్టుబడులకు అనుకూలంగా ఉన్న దేశంలోని 17 అతి పెద్ద రాష్ట్రాలలో తెలంగాణ 10వ స్థానంలో నిలిచింది. అన్ని రాష్ట్రాల పరంగా చూస్తే 13వ స్థానంలో ఉంది. నీతి ఆయోగ్‌ శుక్రవారం విడుదల చేసిన...

పెట్టుబడులకు అనుకూలతలో రాష్ట్రానికి 10వ ర్యాంకు

  • వెల్లడించిన నీతి ఆయోగ్‌ నివేదిక

  • తెలంగాణ తలసరి జీఎ్‌సడీపీ రూ.2,17,801

  • సులభతర నిబంధనల్లో అగ్రస్థానం

  • పటిష్ఠమైన సంస్థాగత యంత్రాంగంతో వేగంగా అనుమతులు

  • లాజిస్టిక్‌ కారిడార్లు, డిజిటల్‌ నెట్‌వర్క్‌ అంశాల్లో మెరుగు పడాల్సి ఉందన్న నివేదిక

  • పెట్టుబడులకు అనుకూలంగా ఉన్న పెద్ద రాష్ట్రాల్లో ఏపీకి 6వ స్థానం

న్యూఢిల్లీ, జూలై 17 (ఆంధ్రజ్యోతి): పెట్టుబడులకు అనుకూలంగా ఉన్న దేశంలోని 17 అతి పెద్ద రాష్ట్రాలలో తెలంగాణ 10వ స్థానంలో నిలిచింది. అన్ని రాష్ట్రాల పరంగా చూస్తే 13వ స్థానంలో ఉంది. నీతి ఆయోగ్‌ శుక్రవారం విడుదల చేసిన ‘ఇన్వె్‌స్టమెంట్‌ ఫ్రెండ్లీనెస్‌ ఇండెక్స్‌’ నివేదిక ఈ వివరాలను వెల్లడించింది. మౌలిక సదుపాయాలు, వ్యాపార అనుకూల వాతావరణం, వనరులు, నిబంధనల సడలింపు, ప్రభుత్వ విధానాలు, ఆర్థిక పటిష్ఠత, పర్యావరణం తదితర అంశాలు ఆధారంగా రాష్ట్రాలకు నీతి ఆయోగ్‌ ర్యాంకులను కేటాయించింది. దీని ప్రకారం, తెలంగాణ 47.3 స్కోరు సాధించింది. రాష్ట్ర తలసరి జీఎ్‌సడీపీ రూ.2,17,801. సులభతరమైన నిబంధనల విషయంలో తెలంగాణ అగ్రగామిగా నిలిచింది. పటిష్ఠమైన సంస్థాగత యంత్రాంగాలు ఉన్నందువల్లే తెలంగాణలో అనుమతులు వేగంగా లభిస్తున్నాయని ఈ నివేదిక ప్రశంసించింది. వ్యాపార అనుకూల వాతావరణం అంశంలో మొత్తం 20లో తెలంగాణ 7.8 స్కోరును దక్కించుకుంది. సాంకేతిక పరిశ్రమలు, సాఫ్ట్‌వేర్‌ సేవలు, విన్నూత యజమాన్య పద్ధతుల విషయంలో రాష్ట్రం క్రియాశీలక కేంద్రంగా మారిందని నివేదిక పేర్కొంది. మానవ వనరుల లభ్యతతో పాటు సహజ వనరుల లభ్యత కూడా తెలంగాణలో బలంగా ఉందని, పారిశ్రామిక ప్రోత్సాహకాలు, పెట్టుబడుల పంపిణీ విషయంలో ప్రభుత్వ విధానాలు స్థిరంగా ఉన్నాయని తెలిపింది. లాజిస్టిక్‌ కారిడార్లు, భౌతిక నిల్వలు, డిజిటల్‌ నెట్‌వర్క్‌ విషయంలో మాత్రం తెలంగాణ కొన్ని సమస్యలను ఎదుర్కొంటుందని వివరించింది. కిందిస్థాయి పాలన, అధికారులు సమస్యలను పరిష్కరించే విషయంలో తెలంగాణ వెనుకంజలో ఉందని.. ఈ అంశంలో మెరుగుపడాల్సి ఉందని తెలిపింది. ఆర్థిక క్రమశిక్షణ స్థిరంగా ఉన్నప్పటికీ మొత్తంగా అప్పులు, స్థూల ద్రవ్యలోటుపై పర్యవేక్షణ అవసరమని, పర్యావరణ పరిరక్షణ, కాలుష్య నియంత్రణ అంశాల్లోనూ చర్యలు తీసుకోవాల్సి ఉందని నీతి ఆయోగ్‌ నివేదిక అభిప్రాయపడింది.


ఏపీకి 6వ స్థానం

పెట్టుబడులకు అనుకూలంగా ఉన్న దేశంలోని అతిపెద్ద రాష్ట్రాలలో ఆంధ్రప్రదేశ్‌ 6వ స్థానాన్ని దక్కించుకుంది. గుజరాత్‌, మహారాష్ట్ర, తమిళనాడు, ఒడిశా, మధ్యప్రదేశ్‌ తొలి 5 స్థానాల్లో ఉన్నాయి. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల పరంగా చూస్తే ఏపీ ఎనిమిదో స్థానంలో నిలిచింది. ఏపీ 48.7 స్కోరు సాధించింది. ఆ రాష్ట్రంలో తలసరి జీఎ్‌సడీపీ రూ.1,61,243గా నమోదైంది. ఆహార ఉత్పత్తులు, రసాయనాలు, ఫార్మాస్యూటికల్స్‌ ఏపీలో బలమైన పారిశ్రామిక రంగాలని నీతి ఆయోగ్‌ తెలిపింది. దేశంలోనే తలసరి డిజిటల్‌ లావాదేవీల్లో ఏపీ అగ్రగామిగా ఉందని నీతి ఆయోగ్‌ ప్రశంసించింది. ఏపీలోని టైర్‌-2, టైర్‌-3 ప్రాంతాలలో ఆంతర్గత రహదారుల పరిస్థితి మెరుగుపడాల్సి ఉందని పేర్కొంది.

ఇవి కూడా చదవండి

మూగజీవాలకు అపన్నహస్తం..

తప్పిపోయిన 35 ఏళ్ల తర్వాత.. అమ్మకు దగ్గరైన కూతురు

Updated Date - Jul 18 , 2026 | 06:31 AM