విద్యార్థులు ఆ సవాలును అవకాశంగా మార్చుకున్నారు: నిర్మలా సీతారామన్
ABN , Publish Date - Jul 25 , 2026 | 01:19 PM
పరీక్షల పేపర్ లీకేజీల వివాదంపై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ స్పందించారు. పేపర్ లీక్‌లు జరిగినప్పుడు మొదట్లో విద్యార్థులు తీవ్రంగా బాధపడినప్పటికీ, తర్వాత దాన్నే అవకాశంగా మలచుకుని మెరుగ్గా రాశామని పలువురు విద్యార్థులు చెబుతున్నారని ఆమె పేర్కొన్నారు.
ఢిల్లీ, జులై 25: దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న పరీక్షల పేపర్ లీకేజీల వివాదంపై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ స్పందించారు. పేపర్ లీక్‌లు జరిగినప్పుడు మొదట్లో విద్యార్థులు తీవ్రంగా బాధపడినప్పటికీ, ఆ తర్వాత ఆ సవాలును స్వీకరించి మరింత బాగా చదివి ప్రతిభను మెరుగుపరుచుకున్నారని ఆమె తెలిపారు. ముందు బాధనిపించింది.. తర్వాత దాన్నే అవకాశంగా మలచుకుని మెరుగ్గా రాశామని పలువురు విద్యార్థులు చెబుతున్నారని ఆమె పేర్కొన్నారు. ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద జరుగుతున్న విద్యార్థుల ఆందోళనలపై వార్తా సంస్థ 'ఏఎన్‌ఐ' కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడారు.
పరీక్షల పవిత్రతను దెబ్బతీసిన వారిపై సత్వర చర్యలు తీసుకోవడానికి ప్రధాని నరేంద్ర మోదీ స్వయంగా స్పందించారని మంత్రి చెప్పారు. నిందితుల అరెస్టులు, సకాలంలో మళ్లీ పరీక్షలు నిర్వహించడం, ఫలితాలను విడుదల చేయడం ద్వారా విద్యార్థులు తమ ఉన్నత విద్య వైపు అడుగులు వేయగలుగుతున్నారని తెలిపారు.
'విద్యార్థుల భవిష్యత్తుకు సంబంధించిన ఈ సున్నితమైన అంశంపై ప్రభుత్వం తక్షణమే స్పందించి చర్యలు తీసుకుంటోంది. ప్రభుత్వ చర్యల వల్ల ప్రతిపక్షాల విమర్శలకు విలువే లేకుండా పోయింది. ఫాస్ట్ ట్రాక్ కోర్టుల ఏర్పాటు, పేపర్లను అమ్మిన, కొనుగోలు చేసిన నేరస్తుల అరెస్టులు శరవేగంగా జరుగుతున్నాయి' అని ఆమె స్పష్టం చేశారు. నీట్ పేపర్ లీకేజీ నేపథ్యంలో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA)ని పూర్తిగా ప్రక్షాళన చేస్తున్నామని, ఇందులో భాగంగా ఇప్పటికే ఎన్టీఏకు చెందిన 47 మంది ఉద్యోగులను ప్రభుత్వం తొలగించిందని ఆమె పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి:
క్వాంటం వ్యాలీలో మరో కీలక ప్రాజెక్టు