నీరవ్ మోదీ అప్పగింతకు మార్గం సుగమం.. ఇక భారత్‌కు రప్పించడమేనా..?
ABN , Publish Date - Jul 06 , 2026 | 05:30 PM
పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్‌బీ) భారీ రుణ మోసం కేసులో ప్రధాన నిందితుడైన వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీని భారత్‌కు అప్పగించే ప్రక్రియకు ఉన్న అన్ని న్యాయపరమైన అడ్డంకులు తొలగిపోయాయి. నీరవ్ మోదీ దాఖలు చేసిన పిటిషన్‌ను యూరోపియన్ కోర్ట్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ (ఈసీహెచ్‌ఆర్) తిరస్కరించింది.
లండన్: పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్‌బీ) భారీ రుణ మోసం కేసులో ప్రధాన నిందితుడైన వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీని భారత్‌కు అప్పగించే ప్రక్రియకు ఉన్న అన్ని న్యాయపరమైన అడ్డంకులు తొలగిపోయాయి. నీరవ్ మోదీ దాఖలు చేసిన పిటిషన్‌ను యూరోపియన్ కోర్ట్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ (ఈసీహెచ్‌ఆర్) తిరస్కరించింది. దీంతో అప్పగింతకు సంబంధించిన ప్రక్రియను యూకే ప్రభుత్వం మొదలుపెట్టే అవకాశం లభించింది.
భారత ప్రభుత్వం 2018 ఆగస్టులో నీరవ్ మోదీపై నేరపూరిత కుట్ర, నమ్మకద్రోహం, మోసం, అవినీతి, మనీలాండరింగ్, నిధుల దుర్వినియోగం, ఒప్పంద ఉల్లంఘన తదితర అభియోగాలు నమోదు చేసింది. అనంతరం ఇంటర్‌పోల్ కూడా అతడిపై అంతర్జాతీయ సహకారం కోరుతూ నోటీసు జారీ చేసింది. నీరవ్ మోదీ తన అప్పగింతను అడ్డుకునేందుకు యూకేలో అందుబాటులో ఉన్న అన్ని న్యాయపరమైన అవకాశాలను వినియోగించుకున్నారు. చివరిగా 2026 ఏప్రిల్‌లో యూరోపియన్ కోర్ట్ ఆఫ్ హ్యూమన్ రైట్స్‌ను ఆశ్రయించారు. అయితే, భారత్ ఇచ్చిన జైలు భద్రత, ఖైదీల పట్ల వ్యవహారంపై హామీలు సంతృప్తికరంగానే ఉన్నాయని ఇప్పటికే యూకే హైకోర్టు స్పష్టం చేస్తూ నీరవ్ మోదీ అప్పీల్‌ను తిరస్కరించింది.
ఈసీహెచ్‌ఆర్ తీర్పుతో నీరవ్ మోదీ అప్పగింతకు ఇక ఎలాంటి న్యాయపరమైన అడ్డంకులు లేవని దౌత్య వర్గాలు వెల్లడించాయి. ప్రస్తుతం లండన్‌లోని వాండ్స్‌వర్త్ జైలులో ఉన్న ఆయనను భారత్‌కు అప్పగించేందుకు బ్రిటన్ అధికారులు పరిపాలనా ప్రక్రియను ప్రారంభించినట్లు సమాచారం. అవసరమైన అధికారిక ప్రక్రియలు పూర్తికాగానే భారత్‌కు తీసుకురానున్నట్లు తెలుస్తోంది. నీరవ్ మోదీని 2019 మార్చిలో లండన్‌లో అరెస్టు చేశారు. పంజాబ్ నేషనల్ బ్యాంక్ భారీ మోసం, మనీలాండరింగ్ కేసుల్లో ఆయనని సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ), ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) వాంటెడ్ నిందితుడిగా ప్రకటించాయి.
కాగా, ఈ ఏడాది మార్చిలోనూ తన అప్పగింత ఉత్తర్వులను పునఃపరిశీలించాలని లండన్‌లోని కింగ్స్ బెంచ్ డివిజన్ హైకోర్టును నీరవ్ మోదీ ఆశ్రయించారు. అయినా ఆయన పిటిషన్‌ను కోర్టు తిరస్కరించింది. అయితే, రక్షణ సలహాదారు సంజయ్ భండారీ కేసులో మానవతా దృక్పథంతో అప్పగింతను నిరాకరించిన తీర్పును ఆధారంగా చూపిస్తూ నీరవ్ మోదీ తన వాదనలు వినిపించినప్పటికీ.. కోర్టు వాటిని అంగీకరించలేదు. కాగా, తాజా తీర్పుతో ఆయన అప్పగింతకు మార్గం పూర్తిగా సుగమమైంది.
ఈ వార్తలు కూడా చదవండి
తాజ్ మహల్ వివాదం.. కేంద్రం, ఏఎస్ఐకు హైకోర్టు నోటీసులు..
అయోధ్య రామ మందిర విరాళాల చోరీ కేసులో కీలక పరిణామం