750కి చేరిన నేపాల్ వరదల మృతుల సంఖ్య..
ABN , Publish Date - Aug 30 , 2026 | 03:26 PM
నేపాల్ జల ప్రళయంలో ఇప్పటివరకూ మృతిచెందిన వారి సంఖ్య 750కి చేరింది. హిమానీనదం విచ్ఛిన్నం కావడంతో ఉప్పొంగిన నదులు పలు ప్రాంతాలను ముంచెత్తాయి. ఈ ప్రకృతి విపత్తుకు నేపాల్‌లో 734 మంది, టిబెట్‌లో 16 మంది మృతిచెందారు.
ఢిల్లీ: నేపాల్ జల ప్రళయంలో ఇప్పటివరకూ మృతిచెందిన వారి సంఖ్య 750కి చేరింది. హిమానీనదం విచ్ఛిన్నం కావడంతో ఉప్పొంగిన నదులు పలు ప్రాంతాలను ముంచెత్తాయి. ఈ ప్రకృతి విపత్తుకు నేపాల్‌లో 734 మంది, టిబెట్‌లో 16 మంది మృతిచెందారు. మరో 2,498 మంది గల్లంతు కాగా.. వీరిలో 589 మంది విదేశీయులు ఉన్నట్లు స్థానిక అధికారులు తెలిపారు. గల్లంతైన వారి కోసం నేపాల్ సైన్యం, పోలీసులు, ఇతర భద్రతా బలగాలు ముమ్మరంగా గాలింపు చర్యలు చేపడుతున్నాయి.
నేపాల్ వరదల్లో 280 మందికి పైగా భారతీయ పర్యాటకులు, యాత్రికులు గల్లంతైనట్లు అధికారులు గుర్తించారు. వీరిలో తెలుగు రాష్ట్రాలకు చెందిన వారూ ఉన్నారు. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన 13 మంది యాత్రికుల ఆచూకీ ఇంకా లభించకపోవడంతో గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. కోదారీ సరిహద్దుకు 145 మంది తెలుగు యాత్రికులు చేరుకోగా, వారిని సురక్షితంగా తరలించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. మరోవైపు, నేపాల్‌లో చిక్కుకున్న తెలుగు యాత్రికుల కోసం ఢిల్లీలోని ఏపీ భవన్ ప్రత్యేక చర్యలు చేపట్టింది. ఎమర్జెన్సీ కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేసి సహాయక చర్యలను నిరంతరం పర్యవేక్షిస్తోంది. అలాగే నేపాల్ పోలీసులు అందించిన మృతుల తొలి జాబితా ఏపీ భవన్ అధికారులకు చేరింది. ఈ జాబితాను పరిశీలించిన అనంతరం సాయంత్రానికి మృతుల వివరాలపై మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉంది.
కాగా, వరదల కారణంగా త్రిశూలి జలవిద్యుత్ ప్రాజెక్టు తీవ్రంగా ప్రభావితమైంది. ప్రాజెక్టు సొరంగాల్లో పలువురు కార్మికులు చిక్కుకున్నారు. వారిని కాపాడేందుకు నేపాల్ సైన్యం ప్రత్యేక రెస్క్యూ ఆపరేషన్ చేపట్టింది. భారీ యంత్రాలతో సహాయక బృందాలు రంగంలోకి దిగాయి. విపత్తు నేపథ్యంలో నేపాల్ ప్రభుత్వం భారీగా సహాయక చర్యలు చేపట్టింది. దాదాపు 30 వేల మంది భద్రతా సిబ్బందిని సహాయక, రెస్క్యూ చర్యల్లో మోహరించింది. ఇప్పటివరకు వారు 8,186 మందిని కాపాడి సురక్షిత ప్రాంతాలకు తరలించారు. మరోవైపు, నేపాల్‌కు అండగా భారత్ ప్రత్యేక ‘ఎయిర్ బ్రిడ్జి’ ద్వారా నిరంతరం సహాయక సామగ్రిని సరఫరా చేస్తోంది.
ఈ వార్తలు కూడా చదవండి
ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భాగవత్‌పై ఎంపీ కపిల్ సిబల్ విమర్శలు
ఉజ్బెకిస్థాన్ ప్రెసిడెంట్‌తో ప్రధాని మోదీ చర్చలు