Share News

నీట్ విద్యార్థి రితిక్ ఆత్మహత్యకు బాధ్యులెవరు?: ప్రియాంక గాంధీ

ABN , Publish Date - May 15 , 2026 | 03:37 PM

నీట్ విద్యార్థి రితిక్ మృతిపై కాంగ్రెస్ అగ్రనేత, ఎంపీ ప్రియాంక గాంధీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. రితిక్ మిశ్రా ఆత్మహత్య చేసుకోవడం అత్యంత హృదయ విదారకమని ప్రియాంక గాంధీ అన్నారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా పోస్టు పెట్టారు.

నీట్ విద్యార్థి రితిక్ ఆత్మహత్యకు బాధ్యులెవరు?: ప్రియాంక గాంధీ
MP Priyanka Gandhi

ఉత్తర్ ప్రదేశ్: నీట్ యూజీ 2026 పరీక్ష రద్దుతో ఉత్తర్ ప్రదేశ్‌కు చెందిన విద్యార్థి రితిక్ మిశ్రా ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ ఘటన దేశవ్యాప్తంగా కలకలం సృష్టించింది. పరీక్ష రద్దుతో తీవ్ర మానసిక వేదనకు గురైన రితిక్ బలవన్మరణానికి పాల్పడినట్లు బాధిత కుటుంబం ఆరోపిస్తోంది. విద్యార్థి ఆత్మహత్య ఘటనపై ప్రతిపక్ష పార్టీలు, పలువురు రాజకీయ ప్రముఖులు స్పందిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే రితిక్ మృతిపై కాంగ్రెస్ అగ్రనేత, ఎంపీ ప్రియాంక గాంధీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా పోస్టు పెట్టారు.


లఖింపూర్ ఖేరీలో నీట్ విద్యార్థి రితిక్ మిశ్రా ఆత్మహత్య చేసుకోవడం అత్యంత హృదయ విదారకమని ప్రియాంక గాంధీ అన్నారు. దుఃఖంలో ఉన్న బాధిత కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. నీట్ పరీక్ష రద్దు కావడంతో రితిక్ తీవ్రమైన మానసిక ఒత్తిడికి గురయ్యాడని విద్యార్థి తల్లిదండ్రులు చెబుతున్నారని ప్రియాంక అన్నారు. పరీక్షల్లో విచ్చలవిడిగా పెరిగిపోతున్న అవినీతి యువత ప్రాణాలను బలి తీసుకుంటోందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతి ఏటా లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తు నాశనమవుతోందని మండిపడ్డారు. ఈ పేపర్ లీక్‌ల పరంపర ఎప్పుడు ఆగుతుంది? అంటూ ప్రశ్నించారు. దీనికి ఎవరు జవాబుదారీతనం వహిస్తారని ప్రియాంక గాంధీ మండిపడ్డారు.


కాగా, నీట్ పరీక్ష రద్దుతో తీవ్ర ఆవేదనకు గురైన యూపీకి చెందిన రితిక్ మిశ్రా నిన్న (గురువారం) ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఇప్పటికే రెండు సార్లు నీట్ రాసిన విద్యార్థికి సీటు రాలేదు. మూడోసారి అయినా సీటు వస్తుందని భావించిన యువకుడికి పరీక్ష రద్దు షాక్ ఇచ్చినట్లు అయ్యింది. దీంతో అతడు బలవన్మరణానికి పాల్పడ్డాడు.


ఈ వార్తలు కూడా చదవండి

పార్లమెంటరీ నిబంధనలకు విరుద్ధంగా రాహుల్ విదేశీ పర్యటనలు.. కిరణ్ రిజిజు

పెళ్లైన 5 నెలలకే నవ వధువు అనుమానాస్పద మృతి

Updated Date - May 15 , 2026 | 03:40 PM